జూన్‌ 10న సాగునీరు

ABN , First Publish Date - 2022-05-19T06:16:43+05:30 IST

జూన్‌ 10న సాగునీరు

జూన్‌ 10న సాగునీరు
మాట్లాడుతున్న మంత్రి జోగి రమేశ్‌, మాజీమంత్రి పేర్ని నాని. చిత్రంలో కలెక్టర్‌ రంజిత్‌ బాషా, జేసీ మహేశ్‌, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ హారిక

ఇకపై ఈ-క్రాప్‌ నమోదైనట్లు రైతులకు పత్రాలివ్వండి

అధికారులు సమన్వయంతో పనిచేయండి

రైతులకు ఇబ్బంది రానీయొద్దు

కాంట్రాక్టర్లు, వారికి సహకరిస్తున్న అధికారులు పద్ధతి మార్చుకోవాలి

36వ సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో మంత్రి జోగి రమేశ్‌


ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : కృష్ణాడెల్టాకు జూన్‌ 10 నుంచి సాగునీటిని విడుదల చేయాలని కృష్ణాజిల్లా 36వ సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం తీర్మానించింది. కలెక్టరేట్‌లోని స్పందన సమావేశపు హాల్లో గురువారం ఐఏబీ సమావేశం జరిగింది. నీటిపారుదల, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. జోగి రమేశ్‌ మాట్లాడుతూ పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 32 టీఎంసీల నీటిని వినియోగించుకుని కృష్ణాడెల్టాకు జూన్‌ 10న సాగునీటిని విడుదల చేస్తామన్నారు. సకాలంలో నీరు విడుదల చేయడం వల్ల నవంబరు నాటికి వరి కోతలు పూర్తవుతాయన్నారు. రబీ పంట మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేసి, వేసవిలో మూడో పంటగా అపరాలు లేదా ఇతర పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. కృష్ణాడెల్టాలో 5.25 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటి అవసరాల కోసం 150 టీఎంసీల నీటిని వినియోగించడం జరుగుతుందన్నారు. 

కాంట్రాక్టర్ల తీరుపై మండిపాటు

కొందరు కాంట్రాక్టర్లు సాగునీటి, డ్రెయినేజీల్లో పనులు చేయకుండా జాప్యం చేస్తున్న అంశం చర్చకు వచ్చింది. నలుగురు కాంట్రాక్టర్లు ఈ పనులను దక్కించుకుని, పనులు చేయకపోగా, కోర్టును ఆశ్రయిస్తున్నారని, ఈ కాంట్రాక్టర్లకు కొందరు నీటిపారుదల శాఖ అధికారులు సహకరిస్తున్నారని, అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని మంత్రి జోగి రమేశ్‌, మాజీమంత్రి పేర్ని నాని హెచ్చరించారు.  

ఈ-క్రాప్‌ నమోదుపై చర్చ

మాజీమంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, రైతులు ముతక రకం వరి వంగడాలు సాగుచేస్తే ఈ-క్రాప్‌లో బీపీటీ రకాల వంగడాలు సాగు చేసినట్టుగా చూపిస్తోందని, దీంతో ధాన్యం కొనుగోళ్లు జరగట్లేదన్నారు. రైతులు ఏ పంటను సాగు చేశారో చూడకుండానే రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ-క్రాప్‌ జాబితాలు తయారుచేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ఈ తరహా ఇబ్బందులు  ఎదురవుతున్నాయన్నారు. రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా మిల్లర్లకు అప్పగించారని, బీపీటీ రకం ధాన్యంగా ఆన్‌లైన్‌లో నమోదై ఉండటంతో నగదు రావట్లేదని, రైతుల ఇబ్బందులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదు చేసినట్లు రైతులకు  సంబంధిత వివరాలతో కూడిన పత్రాలను ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ప్రింటింగ్‌ మిషన్లు లేకుంటే ఈ ఏడాదైనా కొని ఈ-క్రాప్‌ నమోదైన ట్టుగా రైతులకు పత్రాలు తెలుగులో ప్రింట్‌ చేసి ఇవ్వాలని, ఆ సమయంలో సంతకాలు తీసుకోవాలని పేర్ని నాని, కలెక్టర్‌ రంజిత్‌ బాషా సూచించారు.

పసుపు రైతులకు పంటబీమా రాలేదు

తోట్లవల్లూరు మండలంలో ఈ-క్రాప్‌ నమోదు కాకపోవడంతో 600 మంది రైతులకు పసుపు పంటబీమా  నగదు చేతికి అందలేదని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ-క్రాప్‌లో స్పష్టంగా లేకపోవడంతో ఒక్కో రైతు లక్ష రూపాయల పంటబీమా కోల్పోయాడని, పలుమార్లు ఈ అంశంపై అధికారులకు తెలియజేసినా ఫలితం లేదన్నారు. 

మిల్లర్ల మాయను అడ్డుకోండి

మిల్లర్లు మాయచేసి రైతులను నిలువునా ముంచుతున్నారని జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు పట్టపు నాని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బంటుమిల్లిలో నివాసం ఉంటానని, అక్కడి రైస్‌ మిల్లుల యజమానులు బయటి జిల్లాల నుంచి లారీలకొద్దీ ధాన్యాన్ని తెచ్చి నకిలీ రైతుల పేర్లతో బియ్యం చూపుతున్నారని, బిల్లులు చేసుకుంటున్నారన్నారు. ఒక మిల్లుకు రెండు కోట్ల రూపాయల మేర బ్యాంకు గ్యారెంటీ ఉంటే స్థానిక రైతులకు కోటి రూపాయల బిల్లులు చేసి, మిగిలినవి తమకు నచ్చిన రైతుల పేర్లతో చేసుకుంటున్నారని, ఈ అంశంపై రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌  నాయకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మిల్లర్లు చేస్తున్న మోసం కారణంగా మూడు నెలలకు కూడా రైతులకు బిల్లులు అందట్లేదని, పెట్టుబడికి అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ తరహా మోసాలపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటుచేసి విచారణ  చేయించాలని కోరారు. అనంతరం కృష్ణాడెల్టాకు రెండు పంటలకు కావాల్సిన నీటి వివరాలను నీటి పారుదల శాఖ ఎస్‌ఈ జి.గోపాల్‌ వెల్లడించారు. పంటల వివరాలు, ఎరువులు, రుణాలు తదితర అంశాలను జిల్లా వ్యవ సాయశాఖ అధికారి మనోహర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, జేసీ మహేశ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ జన్ను రాఘవ, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-19T06:16:43+05:30 IST