రాష్ట్రంలో రివర్స్‌ పాలన

ABN , First Publish Date - 2022-07-03T06:05:33+05:30 IST

రాష్ట్రంలో ప్రజాకంటక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

రాష్ట్రంలో రివర్స్‌ పాలన
ఎమ్మిగనూరులో ర్యాలీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు

ఎమ్మిగనూరు, జూలై 2: రాష్ట్రంలో ప్రజాకంటక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ ఎద్దుల బండితో శనివారం నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక శివ సర్కిల్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తూ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. చార్జీలు, ధరలు తగ్గాలంటే జగన దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. బస్టాండ్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా   జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన అనేక హామీలు ఇచ్చి నేడు వాటిని అమలు చేయలేక అన్ని రకాల వస్తువుల ధరలు పెంచడమే కాకుండా... రెండుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారని విమర్శించారు. రెండోసారి ఆర్టీసీ చార్జీలు పెంచటం వల్ల ప్రజలపై దాదాపు రూ.2,175 కోట్ల భారం పడుతోందన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో సామాన్య ప్రజలు బస్సుల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ఎద్దుల బండ్లపై ప్రయాణం సాగించే రోజులు వచ్చాయన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సుల్లోకి ఎక్కి ప్రయాణికులకు కరపత్రాలను పంచి పెట్టారు. చార్జీల పెంపుతో ఎంతమేర భారం పడుతుందో వివరించారు బస్టాండ్‌లో ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను కలిసి కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వైపీఎం కొండయ్య చౌదరి, కౌన్సిలర్లు రామదాసు గౌడ్‌, వీజీఏ దయాసాగర్‌, పట్టణ అధ్యక్షుడు సుందరరాజు, మైనార్టీ ప్రెసిడెంట్‌ కేఎండీ ఫారుక్‌, నాయకులు మాల్లాకలీముల్లా, దాదా, మల్లి, మధు, జయన్న, నాగేష్‌ ఆచారి, బచ్చాల రంగన్న తదితరులు పాల్గొన్నారు.

కల్లూరు: వైసీపీ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత డిమాండ్‌ చేశారు. శనివారం ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గౌరు చరిత బస్సులో ప్రయాణం చేశారు. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ కోశాధి కారి పీయూ మాదన్న, టీడీపీ కల్లూరు మండల అధ్యక్షుడు రామాంజినేయులు, తిరుమలేష్‌ రెడ్డి, దేవేందర్‌ రెడ్డి, బీచుపల్లి, కాశీం, పి.కొట్టాల రంగారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-07-03T06:05:33+05:30 IST