6,300 మెగావాట్ల సామర్థ్యంతో రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్కేంద్రాలు!

ABN , First Publish Date - 2021-10-19T08:06:49+05:30 IST

రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ ప్రతిపాదించిన 6,300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ జల విద్యుత్కేంద్రాల నిర్మాణాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఏపీ జెన్కో సీలేరులో

6,300 మెగావాట్ల సామర్థ్యంతో రివర్స్‌ పంపింగ్‌  విద్యుత్కేంద్రాలు!

  • సీలేరులో 1,350 మె.వా. ప్రాజెక్టుకు సన్నాహాలు
  • ఇంధన శాఖ అధికారులకు సీఎం ఆదేశం
  • పవర్‌ ప్లాంట్లలో బొగ్గు కొరత రాకూడదు
  • సరుకు రవాణా షిప్పులు వినియోగించండి
  • సింగరేణి బొగ్గుపై తెలంగాణ సీఎంవోతో మాట్లాడండి: ముఖ్యమంత్రి  జగన్‌


అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ ప్రతిపాదించిన 6,300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ జల విద్యుత్కేంద్రాల నిర్మాణాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఏపీ జెన్కో సీలేరులో రివర్స్‌ పంపింగ్‌ విధానంలో నిర్మించదలచిన 1,350 మెగావాట్ల జల విద్యుత్కేంద్రం పనులు త్వరలో ప్రారంభించేందుకు సన్నాహక చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నిరంతరాయంగా కరెంటు సరఫరా కోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష జరిపారు. ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌, ఏపీ జెన్కో సీఎండీ శ్రీధర్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. బొగ్గు, విద్యుత్‌ సరఫరాకు కొరత రాకుండా చూడాలని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. బొగ్గు కొరత సమస్యను అధిగమించేందుకు అత్యవసర ప్రణాళికలు అమలు చేయాలన్నారు.


అవాంతరాలు లేకుండా నిరంతరం కరెంటు సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో అధికారులు వివరించారు. మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి ఆదనంగా రోజూ రెండు ర్యాకులు వస్తున్నాయని జెన్కో అధికారులు తెలిపారు. థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్ల దాకా పెంచామన్నారు. విద్యుత్కేంద్రాల్లో బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని  సీఎం ఆదేశించారు. కోల్‌ ఇండియా అధికారులతో సంప్రదింపులు జరపాలన్నారు. సింగరేణి కాలరీస్‌ నుంచి బొగ్గు కొనుగోలుపై దృష్టి సారించాలని చెప్పారు. తెలంగాణ సొంత అవసరాల కోసం, కర్ణాటక అవసరాల కోసం సింగరేణి బొగ్గు వెళ్తోందని అధికారులు తెలుపగా.. ఈ విషయమై తెలంగాణ సీఎంవోతోనూ, సింగరేణి అధికారులతోనూ సంప్రదింపులు జరపాలని సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డిని జగన్‌ ఆదేశించారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పుల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచనలు చేయాలన్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు కలసి వస్తాయని చెప్పారు. పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తోందని అధికారులు అన్నారు. మూడేళ్ల కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకుంటే.. యూనిట్‌ రూ.3.75కే వస్తుందని వివరించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో  యూనిట్‌ రూ.6.50 పలుకుతోందని చెప్పారు. కావలసిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని సీఎం ఆదేశించారు.


విదేశీ బొగ్గు కొనుగోళ్లకు షార్ట్‌ టెండర్లు!

రాష్ట్రంలో జెన్కో థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో ప్రస్తుతం ఒకట్రెండు రోజులకు మాత్రమే సరిపడా ఉన్న బొగ్గు నిల్వలను పెంచుకునేందుకు రాష్ట్ర ఇంధన శాఖ సన్నద్ధమైంది. సీఎం సమీక్ష తర్వాత.. విదేశీ బొగ్గును కొనుగోలు చేసేందుకు స్వల్పవ్యవధి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. అయితే విదేశీ బొగ్గు ధరలు అందుబాటులో ఉంటే కొనుగోలు చేస్తామని.. లేదంటే టెండర్లు రద్దు చేస్తామని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే సింగరేణి, మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి బొగ్గు సరఫరాను మెరుగుపరచుకునేందుకు కోల్‌ ఇండియాతో సంప్రదింపులు జరపాలని ఇంధనశాఖ నిర్ణయించింది.

Updated Date - 2021-10-19T08:06:49+05:30 IST