ఆదా రివర్స్‌!

ABN , First Publish Date - 2022-05-24T08:10:27+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ ‘రివర్స్‌’లో సాగుతున్నాయి. ఈత కాయ ఇచ్చి తాటికాయ తీసుకున్నట్లుగా.. రివర్స్‌ టెండరింగ్‌లో

ఆదా రివర్స్‌!

పోలవరం టెండర్లలో మాయాజాలం

రూ.223 కోట్లు తక్కువకు ఖరారు

తర్వాత గుట్టుచప్పుడు కాకుండా

369 కోట్ల మేర అంచనాలు పెంపు

గత ప్రభుత్వంలో కంటే 146 కోట్లు అధికం

నాడు  ఆదా చేశామని గొప్పలు

ఊరూవాడా జగన్‌ అండ్‌ కో ప్రచారం

నేడు  పెదవి విప్పని సర్కారు పెద్దలు

వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు

ఒప్పందం ప్రకారం నిరుడే పనులు పూర్తి కావాలి

కానీ ఎడతెగని జాప్యం.. ఇప్పుడు కొత్త టైం టేబుల్‌

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పూర్తయ్యేది 2023 జూన్‌లోనే

ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షలో అధికారుల స్పష్టీకరణ


పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ మొత్తం సీఎం జగన్‌ మాయాజాలంగా తేలిపోయింది. గత ప్రభుత్వ హయాంలో అంచనాలు భారీగా పెంచారంటూ రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రూ.680 కోట్లు ఆదా చేశామని ఇప్పటికీ గొప్పలు చెబుతుంటారు. కానీ ప్రాజెక్టు అంచనాలను చడీ చప్పుడు లేకుండా పెంచేశారు. అలా పెంచాక గానీ పనులు ప్రారంభం కాలేదని అధికారులే పేర్కొనడం గమనార్హం. పెంచిన అంచనాలను.. కాంట్రాక్టు సంస్థతో చేసుకున్న ఒప్పందాలను బయటకు పొక్కనివ్వడంలేదు. అంచనాలు పెంచినా పనులు ముందుకు సాగడం లేదు. నిర్మాణం సా...గుతూనే ఉంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ ‘రివర్స్‌’లో సాగుతున్నాయి. ఈత కాయ ఇచ్చి తాటికాయ తీసుకున్నట్లుగా.. రివర్స్‌ టెండరింగ్‌లో కేవలం రూ.223.32 కోట్లను మిగిల్చి.. తాజాగా రూ.369.61 కోట్ల మేర అంచనాలను ప్రభుత్వం పెంచేసింది. అంటే.. గత ప్రభుత్వ హయాంలో కంటే.. రూ.146.29 కోట్లు అధికం. అంటే రివర్స్‌ టెండరింగ్‌తో ఖజానాకు ఆదా అయిందేమీ లేకపోగా.. ఖర్చు అదనంగా పెరిగిందన్నమాట. ప్రాజెక్టులో మిగిలిన రూ.1,771.44 కోట్ల విలువైన ప్రధాన పనులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్‌ టెండర్‌ పిలిచారు. మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ రూ.1,548.12 కోట్లకు 24 నెలల్లో (రెండేళ్లలో) పూర్తి చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖతో 2019 నవంబరు 8వ తేదీన ఒప్పందం చేసుకుంది. అంటే రూ.223.32 కోట్లు తక్కువకు పనులు చేయడానికి అంగీకరించిందన్న మాట. అది జరిగిన ఏడాదికి సీఎం 2020 నవంబరు 11వ తేదీన జల వనరుల శాఖపై సమీక్ష జరిపారు. నిర్మాణ సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం.. స్పిల్‌వేను 2021 మే నాటికి పూర్తి చేస్తుందని అధికారులు వెల్లడించారు. రేడియల్‌ గేట్ల బిగింపు 2021 ఏప్రిల్‌ నాటికి పూర్తవుతుందని.. అప్రోచ్‌ చానల్‌, స్పిల్‌ చానల్‌ పనులు 2021 మార్చి నాటికే పూర్తవుతుందని.. కాఫర్‌ డ్యాం పనులు 2021 డిసెంబరు నాటికి, పవర్‌ హౌస్‌ ఫౌండేషన్‌ 2021 మే నాటికి పూర్తవుతాయని తెలిపారు. గ్యాప్‌-2, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం పనులు 2020 నవంబరులో ప్రారంభించి నిరుడు డిసెంబరు నాటికి పూర్తి చేయాలి. కానీ ఇవేమీ జరగలేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పూర్తి చేసేందుకే 2023 జూన్‌ దాకా సమ యం పడుతుందని ఈ నెల 10న ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో అధికారులు స్పష్టం చేశారు. వాస్తవానికి రివ ర్స్‌ టెండరింగ్‌ ప్రతిపాదనలు చేస్తున్నప్పుడే.. వద్దని.. అంచనాలు పెరిగిపోతాయని.. పనుల పూర్తిలో తీవ్ర జాప్యం జరుగుతుందని  కేంద్రం గట్టిగా హెచ్చరించింది. అయితే జగన్‌ ప్రభుత్వం లెక్కచేయలేదు. అలాగే ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీ వేదికగా 2021 ఖరీ్‌ఫలోనే పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అంతా రివర్స్‌ అయింది. కేంద్రం చెప్పిందే నిజమైంది.


మారిన షెడ్యూల్‌..

ఈ నెల 10న సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో.. పనులకు సంబంధించి జల వనరుల శాఖ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నిర్మాణ సంస్థతో రూ.1,548.13 కోట్లకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రూ.1,917. 74 కోట్లకు పెంచుతూ తాజాగా ఒప్పందాన్ని చేసుకోవడంతో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. తాజాగా ప్రధాన పనుల కాలపరిమితిని వివరించారు. ‘స్పిల్‌వే పనులు ఈ నెలాఖరులోగా పూర్తవుతాయి. అప్రోచ్‌ చానల్‌, కాంక్రీట్‌ డ్యాం, గ్యాప్‌-3 పనులు వచ్చే నెలలో, దిగువ కాఫర్‌ డ్యాం జూలై నాటికి పూర్తవుతాయి. స్పిల్‌ చానల్‌ పనులు, ఈసీఆర్‌ఎఫ్‌, గ్యాప్‌-1 పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి, గ్యాప్‌-2 పనులు వచ్చే ఏడాది డిసెంబరుకు పూర్తి చేయగలం’ అని వివరించారు. ఈ సమాచారాన్ని పరిశీలిస్తే.. అంచనా వ్య యం పెరిగింది.. అదేవిధంగా పనులు పూర్తి చేయడంలో జాప్యమూ కనిపిస్తోంది. ఈ సమాచారంలో పనుల పురోగతి ని వివరిస్తూ.. చిన్న ‘స్టార్‌’ మార్క్‌ వేసి.. అంచనాలు పెంచామని చెప్పడం గమనార్హం. వాస్తవానికి పోలవరంలో మిగిలిన పనులకు, పోలవరం జల విద్యుత్కేంద్రానికీ కలిపి జగన్‌ సర్కారు టెండర్లు పిలిచింది. జల విద్యుత్కేంద్రం నిర్మాణ బాధ్యత ఏపీ జెన్కోది. కానీ జల వనరుల శాఖ టెండర్లు ఆహ్వానించి.. ఆ ప్రక్రియను జెన్కోకు వదిలేసింది.  రివర్స్‌ టెండరింగ్‌లో ఆదా చేశామని ఆనాడు జగన్‌, ఆయన మంత్రులు ప్రచారం చేశారు. సీఎం ఇప్పటికీ రివర్స్‌ టెండర్‌లో రూ.680 కోట్ల దాకా ఆదా చేశామనే చెబుతున్నారు. కానీ టెండర్‌ ఖరారు తర్వాత పెంచిన అంచనాలపై కిమ్మనడం లేదు.

Updated Date - 2022-05-24T08:10:27+05:30 IST