మద్యంపై ‘రివర్స్‌’ గేర్‌

ABN , First Publish Date - 2021-08-02T08:02:37+05:30 IST

మద్యం అమ్మకాల విషయంలో వైసీపీ ప్రభుత్వం ‘రివర్స్‌’ బాటలో వెళ్తోంది. దశలవారీగా మద్య నిషేధమంటూ పదేపదే చెప్పిన సర్కారు.. అందుకు విరుద్ధంగా మద్యం

మద్యంపై ‘రివర్స్‌’ గేర్‌

పర్యాటకం పేరుతో కొత్తగా 41 షాపులు

త్వరలో మరికొన్ని.. ‘వాక్‌ ఇన్‌ స్టోర్స్‌’ కూడా

ఆదాయం పెంచుకోవడమే సర్కారు లక్ష్యం 

దశలవారీ నిషేధానికి విరుద్ధంగా దూకుడు


అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): మద్యం అమ్మకాల విషయంలో వైసీపీ ప్రభుత్వం ‘రివర్స్‌’ బాటలో వెళ్తోంది. దశలవారీగా మద్య నిషేధమంటూ పదేపదే చెప్పిన సర్కారు.. అందుకు విరుద్ధంగా మద్యం షాపులను తగ్గించడానికి బదులు పెంచుకుంటూ వెళ్తోంది. పర్యాటక ప్రాంతా ల్లో కొత్తగా 41 షాపులను అందుబాటులోకి తెచ్చింది. ఆదివారం ఈ షాపులను ఎక్సైజ్‌శాఖ ప్రారంభించింది. పదిరోజుల కిందట రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ ఎక్సైజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వెంటనే పర్యాటక ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


ఆ వెంటనే జిల్లాల్లో అధికారులు రంగంలోకి దిగి పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ షాపులు పెట్టొచ్చు అనేదానిపై కసరత్తు ప్రారంభించారు. సరిగ్గా పది రోజుల్లోనే మొత్తం కార్యాచరణ పూర్తిచేసి షాపులు ప్రారంభించేశారు. కర్నూలు జిల్లాలో బెలూం గుహలు, గుంటూరు జిల్లాలో అమరావతి, ఉండవల్లి, కృష్ణాజిల్లాలో కొండపల్లి, ఇబ్రహీంపట్నం, విశాఖపట్నం జిల్లాలో అరకు, పాడేరు, లంబసింగి, ఎన్‌ఏడీ జంక్షన్‌, ఆనందపురం ప్రాంతాలతో పాటు అనేక చోట్ల పర్యాటకం పేరుతో ఈ షాపులను ఏర్పాటుచేశారు.


ఇప్పటికే రాష్ట్రంలో 2,934 ప్రభుత్వ మద్యంషాపులు ఉన్నాయి. వాటికి అదనంగా సుమారు 300 షాపులు ప్రారంభించాలని ఎక్సైజ్‌ యోచించింది. అందులో భాగంగా ఇప్పుడు 41 షాపులను పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. త్వరలో మరిన్ని కొత్త మద్యంషాపులు పర్యాటకం పేరుతో తెరుచుకోనున్నాయి. తద్వారా మద్యం అమ్మకాలను ఇంకా పెంచి ఆదాయం రాబట్టుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాటితో పాటు ప్రీమియం రకం బ్రాండ్లు మాత్రమే అమ్మేందుకు వీలుగా వాక్‌ ఇన్‌ స్టోర్స్‌ పేరుతో మరికొన్ని షాపులను ప్రారంభించనుంది. ఇప్పటికే సుమారు 21 వాక్‌ ఇన్‌ స్టోర్స్‌ ఉండగా, మరో 50కి పైగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. మొత్తంగా వివిధ మార్గాల ద్వారా మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ చర్యలతో స్పష్టమవుతోంది. తాజాగా పర్యాటక ప్రాంతాల్లో ప్రారంభించిన షాపులను ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సబీసీఎల్‌) నిర్వహిస్తుంది. కానీ నిర్వహణ బాధ్యతను త్వరలోనే పూర్తిగా పర్యాటకశాఖకే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త షాపులను పర్యాటక షాపులుగా చూపించి, ఎక్సైజ్‌ షాపులు మాత్రం 2934 మాత్రమే ఉన్నాయని చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పర్యాటక ప్రాంతాల్లో 21 కొత్త బార్లకు వైసీపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.


ఇంత వేగం ఎందుకు..?

ప్రభుత్వం ఏదైనా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే  సుదీర్ఘకాలం కసరత్తు చేస్తుంది. కానీ మద్యం షాపుల విషయంలో మాత్రం పది రోజుల్లోనే ఏర్పాటు చేయడంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. పర్యాటక ప్రాంతాల్లో షాపులకు గతంలో అనుమతులు వచ్చాయని, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే గతంలోనే అనుమతులు వచ్చినా నిషేధం పాలసీకి విరుద్ధమని ఇంతకాలం వాటిని ఏర్పాటు చేయలేదు. కానీ స్పెషల్‌ సీఎస్‌ ఆదేశించిన పది రోజుల్లోనే ఆగమేఘాలపై షాపులు ఏర్పాటు చేయడం పట్ల ఎక్సైజ్‌ వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇంత హడావిడిగా షాపులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కిందిస్థాయి అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-08-02T08:02:37+05:30 IST