రెవెన్యూ పెత్తనమా..?.. వైద్య ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి

ABN , First Publish Date - 2020-07-04T20:29:20+05:30 IST

అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తున్న వేళ సమన్వయంగా పని చేయాల్సిన రెండు కీలక శాఖల మధ్య యుద్ధం ప్రారంభమైంది. జేసీ డాక్టర్‌ సిరి, ట్రైనీ కలెక్టర్‌ సూర్య వైద్యశాఖను, డీఎంహెచ్‌ఓను

రెవెన్యూ పెత్తనమా..?.. వైద్య ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి

రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన వైద్య ఉద్యోగులు

కరోనాపై సమీక్షలో డీఎంహెచ్‌ఓను జేసీ అవమానించడంపై ఆగ్రహం

క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌


అనంతపురం వైద్యం (ఆంధ్రజ్యోతి) : అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తున్న వేళ సమన్వయంగా పని చేయాల్సిన రెండు కీలక శాఖల మధ్య యుద్ధం ప్రారంభమైంది. జేసీ డాక్టర్‌ సిరి, ట్రైనీ కలెక్టర్‌ సూర్య వైద్యశాఖను, డీఎంహెచ్‌ఓను అ వమానకరంగా మాట్లాడారని భావించి వందలాది మంది వైద్య ఉద్యోగులు శుక్రవారం రోడ్డెక్కి నిరసన తెలి పారు. అసలే కరోనా అల్లాడుతున్న జిల్లాలో వైద్య, రెవె న్యూ శాఖల మధ్య ఏర్పడిన వివాదం ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. 


అసలేం జరిగిందంటే...

శుక్రవారం జేసీ డాక్టర్‌ సిరి, ట్రైనీ కలెక్టర్‌ సూర్య జిల్లా వైద్యశాఖ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయం లో డీఎంహెచ్‌ఓ చాంబర్‌లోనే ఉన్నా రు. ఆ ఇద్దరు ఉన్నతాధి కారులు కుర్చీ ల్లో కూర్చొని డీఎంహెచ్‌ఓను నిలబెట్టి కరోనాపై సమీక్ష చేశారు. ఆయన పనితీరుతో పాటు వైద్య శాఖ పనితీరుపైనా విమర్శలు చేసి తీవ్ర అసంతృప్తి వ్య క్తం చేసినట్లు వైద్య ఉద్యోగులు చెబుతున్నారు.  తీవ్ర మనస్తాపం చెందిన డీఎంహెచ్‌ఓ ‘మా చేతకాదు... మీరే చేయించండి’ అంటూ సమీక్ష నుంచి వెళ్లిపోయారని తెలి సింది. ఈ విషయం బయటకు పొక్కడంతో వైద్యశాఖ ఉద్యోగులు రెవెన్యూ ఉన్నతాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనబాట పట్టారు. వందలాది మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా వైద్యశాఖ, జిల్లా సర్వజనాస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 


ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్యవర్గాలను జేసీ, ట్రైనీ కలెక్టర్‌ అవమానంగా మాట్లాడటం దారుణమని రాస్తారోకో చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు వైద్య ఉద్యోగులు ఈ నిరసన కొనసాగించారు. జేసీ, ట్రైనీ కలెక్టర్‌ వైద్య శాఖకు క్షమాపణ చెప్పాలని లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వైద్య ఉద్యోగులు హెచ్చరించారు. శనివారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా.. శుక్రవారం రాత్రి కొందరు ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించగా.. ఆందోళన బాట చేపట్టడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమస్యను తాను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. 


ఆది నుంచి ఆధిపత్య పోరే....

జిల్లాలో కరోనా నియంత్రణ విషయంలో రెవెన్యూ, వైద్య శాఖల మధ్య ఆది నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఆర్థికపరమైన విషయాలతో పాటు వసతులు, సౌకర్యాలు, ఇతరత్రా పరికరాల కొనుగోలు బాధ్యత లన్నీ రెవెన్యూ అధికారుల చేతుల్లోనే కొనసాగుతూ వ స్తోంది. అయితే కరోనా కేసులు పెరిగినప్పుడు మాత్రం ఈ అధికారులు వైద్యశాఖాధికారులు, వైద్యులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెట్టి మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారని ముందు నుంచి వైద్యశాఖ వర్గాలు ఆరో పి స్తున్నాయి. జిల్లా కీలక ఉన్నతాధికారి ఇదే విషయంలో  జిల్లా వైద్యాధికారిపై అనేకసార్లు ఆగ్రహం వ్యక్తం చేసి దురుసుగా మాట్లాడారన్న ప్రచారం సాగుతూ వస్తోంది. ఆ నేపథ్యంలోనే వైద్యశాఖ ఉన్నతాధికారి మానసిక ఒత్తిడితో మంచినీళ్లకు బదులు శస్త్ర చికిత్సకు వినియోగించే కెమికల్స్‌ను తాగారు. అప్పుడు ఇది పెద్ద దుమారం రేపింది. ఆ తరువాత జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి ఈ సమస్యను సద్దుమణిగించారు. ఇప్పుడు మళ్లీ జేసీ డాక్టర్‌ సిరి సమీక్షలో అదే జిల్లా వైద్యాధికారిపై చులకనగా మాట్లాడారని వివాదం తలెత్తింది. ఇప్పుడు నేరుగా రెవెన్యూ వర్సెస్‌ వైద్య శాఖ మధ్య పోరుకు కారణమైంది.


క్వారంటైన్‌లు, ఐసొలేషన్‌, కొవిడ్‌-19 ఆస్పత్రులలో అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించడంలో రెవెన్యూ అధికారులే బాధ్యత వహిస్తూ వస్తున్నారు. అవసరమైన క్వారంటైన్‌లు చూడటం, అందులో కరోనా రోగులకు సరిపడ బెడ్లు, ఆహారం, నీళ్లు వంటి వసతులు ఈ అధికారులే చూస్తూ వస్తున్నారు. అయితే ఆ కోవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌లు ఐసొలేషన్‌లో ఉంటున్న బాధితులకు అవసరమైన వైద్యసేవలు మాత్రం వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది అందిస్తున్నారు. ఈ చికి త్సలకు సంబంధించిన పర్యవేక్షణను వైద్యశాఖాధికారులు చూస్తూ వస్తున్నారు. అయితే కొవిడ్‌-19 ఆస్పత్రులు, క్వారంటైన్‌లలో అవసరం మేరకు వసతులు కల్పించడం లోనూ రోగులకు నిబంధనల మేరకు ఆహారం, ఇతరత్రా సౌకర్యాలు అందించడంలోనూ రెవెన్యూ అధికారులు సక్ర మంగా చేయడం లేదని వైద్యవర్గాలు ఆది నుంచి ఆరోపి స్తున్నాయి. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 5 వేల బెడ్లు సిద్ధం చేశామని చెబుతున్నారు. కానీ వైద్యవర్గాలు చెబుతున్న సమాచారం మేరకు... జిల్లా లో ఇప్పటి వరకూ కేవలం 1200 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. దీంతో కరోనా బాధితులను ఆయా కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌లలో ఉంచడానికి కూడా సరిపడటం లేదనే విమర్శలు విని పిస్తున్నాయి.   

Updated Date - 2020-07-04T20:29:20+05:30 IST