ఇళ్ల కూల్చివేతకు రెవెన్యూ సిబ్బంది యత్నం

ABN , First Publish Date - 2021-03-05T06:42:57+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదన్న కక్షతో తమ ఇళ్లు కూల్చివేతకు ఆ పార్టీ నాయకులు రెవెన్యూ సిబ్బందిని ఉసిగొల్పారని మండల పరిధిలోని కేదరివానిపాలెం వాసులు ఆరోపిస్తున్నారు.

ఇళ్ల కూల్చివేతకు రెవెన్యూ సిబ్బంది యత్నం
ఎక్సకవేటర్‌ను అడ్డుకుంటున్న కేదరివానిపాలెం వాసులు

అడ్డుకున్న కేదరివానిపాలెం వాసులు

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని కక్ష సాధిస్తున్నారని ఆరోపణ

పెందుర్తి, మార్చి 4: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదన్న కక్షతో తమ ఇళ్లు కూల్చివేతకు ఆ పార్టీ నాయకులు రెవెన్యూ సిబ్బందిని ఉసిగొల్పారని మండల పరిధిలోని కేదరివానిపాలెం వాసులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా నివాసముంటున్న ఆ ఇళ్లను ఆక్రమణలను పేర్కొంటూ గురువారం రెవెన్యూ సిబ్బంది ఎక్సకవేటర్‌ సహాయంతో తొలగించేందుకు ప్రయత్నించడంతో వారు అడ్డుకున్నారు. రైతుల మిగులు భూముల స్థలాల్లో  ఏళ్ల తరబడి కుటుంబాలతో ఇక్కడ ఇళ్లు, షెడ్లు నిర్మించుకుని నివసిస్తున్నామని, పంచాయతీకి ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని వారు చెప్పారు. ప్రభుత్వ నిధులతో రోడ్లు వేశారని, ఇప్పుడు ఆక్రమణలని పేర్కొంటూ ఆస్తులను కూలిస్తే నిరాశ్రయులవుతామని బాధితులు వాపోయారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థికి ఓటు వేయకపోతే దౌర్జన్యానికి పాల్పడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బందితో వాదనలకు దిగారు. తర్జనభర్జనల అనంతరం చేసేది లేక రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగారు. ఎస్సార్‌పురం సర్పంచ్‌ దూది విజయలక్ష్మివెంకటరమణ అధ్వర్యంలో నివాసితులు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌ పైల రామారావుకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2021-03-05T06:42:57+05:30 IST