అందని రెవెన్యూ సేవలు!

ABN , First Publish Date - 2020-07-07T09:42:19+05:30 IST

జిల్లాలో రెవెన్యూ సేవలు అం దక జనం విలవిల్లాడుతున్నారు. ఎవరు ఏ పనిపై వెళ్లినా ఇళ్ల పట్టాల పంపిణీ అనంతరమే రావాలనే సమాధానం

అందని రెవెన్యూ సేవలు!

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో

అధికారులు, సిబ్బంది తలమునకలు

మిగిలిన పనులన్నీ పెండింగ్‌

ఆన్‌లైన్‌లో భూముల వివరాల సవరణ కూడా...

పంట రుణాలు అందక రైతుల అవస్థలు

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు ప్రజల పాట్లు

మొక్కుబడి తంతుగా మీ కోసం కార్యక్రమం 

చాలాచోట్ల రశీదులు కూడా ఇవ్వని వైనం 


నర్సీపట్నం, జూలై 6: జిల్లాలో రెవెన్యూ సేవలు అందక జనం విలవిల్లాడుతున్నారు. ఎవరు ఏ పనిపై వెళ్లినా ఇళ్ల పట్టాల పంపిణీ అనంతరమే రావాలనే సమాధానం వినిపిస్తోంది. సుమారు ఐదు నెలలుగా ఇదే పరిస్థితి కార్యాలయాల్లో కనిపిస్తోంది. 

గ్రామ, మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులను ఎవరిని కదిపినా ఇళ్ల పట్టాల పంపిణీకి భూముల సేకరణతో బిజీ అంటున్నారు. ఇందులో తలమునకలైపోవడంతో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కూడా మొక్కుబడితంతుగా మమ అనిపిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడమే తప్ప, వాటిపై తీసుకుంటున్న చర్యలు ఏమిటో ఎవరికీ తెలియడం లేదు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మినహా మరెక్కడా ఫిర్యాదులకు కనీసం రశీదులు కూడా ఇవ్వడం లేదు. 


పూర్తిగా నిలిచిన సేవలు 

ఈ నేపథ్యంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, వెబ్‌ల్యాండ్‌లో సవరణలు, ఆదాయ, స్థిర, నివాస, కుల తదితర ధ్రువీకరణ పత్రాల జారీ దాదాపుగా నిలిచిపోయాయి. ఏ పనులపై రెవెన్యూ కార్యాలయాలను జనం సంప్రతించినా, ఇళ్ల పట్టాల పంపిణీ తరువాతే అంటూ సమాధానం వస్తోంది.  గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సర్వేయర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు, ఆర్డీవోలూ ఇలా అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది వారి పరిధిలో ఇళ్ల స్థలాల పట్టాల కోసం భూముల సేకరణ, లేఅవుట్‌లు వేయడం, రహదారుల ఏర్పాటు తదితర పనులపైనే దృష్టి సారించారు.


మరోవైపు అర్హులందరికీ పంపిణీ చేసేందుకు వీలుగా ఇళ్ల పట్టాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ కార్యాలయాల్లోనే లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో కంటిమీద కునుకు లేకుండా శ్రమించాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ నెల ఎనిమిదో తేదీన నిర్వహించాల్సి వుండగా న్యాయపరమైన సమస్యల కారణంగా వాయిదా పడింది. ఈ కార్యక్రమం ఎప్పుడు పూర్తవుతుందా అని లబ్ధిదారుల కంటే రెవెన్యూ శాఖ ఉద్యోగులే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


సమీక్షలతో ఉక్కిరిబిక్కిరి 

జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఇళ్ల స్థలాల ఎంపిక, ఇతర పనులపై ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం పూర్తయితే తప్ప తాము ఇతర అంశాలపై దృష్టిసారించలేమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో భూముల వివరాలు సక్రమంగా నమోదుకాకపోవడం వల్ల బ్యాంకుల్లో పంట రుణాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాల కోసం యువత, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఇప్పటికే ప్రతి మండలంలో భూముల సర్వే, సబ్‌ డివిజన్‌లకు సంబంధించిన వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వేయర్లు వాటి వంక కన్నెత్తి కూడా చూడడం లేదు. అయితే ఈ నెల ఎనిమిదో తేదీన జరగాల్సిన ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం వచ్చే నెలకు వాయిదా పడినందున, ఇప్పుడైనా అధికారులు, సిబ్బంది మిగిలిన వాటిపై దృష్టి పెడతారా? లేక గతంలో మాదిరిగానే వ్యవహరిస్తారా చూడాల్సి ఉంది.

Updated Date - 2020-07-07T09:42:19+05:30 IST