రెవె న్యూ భూ మాయ!?

ABN , First Publish Date - 2021-05-08T04:57:36+05:30 IST

సర్కారు భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే కాసులకు కక్కుర్తిపడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెట్టారు.

రెవె న్యూ భూ మాయ!?
గబ్బాడలో మెయిన్‌ రోడ్డును ఆనుకొని ఉన్న 3.54 సెంట్ల భూమి

ప్రభుత్వ పోరంబోకు జిరాయితీగా రికార్డులు మార్పు

గబ్బాడలో రూ.10 కోట్లు విలువ చేసే భూమి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ధారాదత్తం

అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్థుల ఆరోపణ


నర్సీపట్నం, మే 7: సర్కారు భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే కాసులకు కక్కుర్తిపడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెట్టారు. నర్సీపట్నం మండలం గబ్బాడలో జరిగిన ఈ భూ బాగోతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో మెయిన్‌ రోడ్డును ఆనుకుని 71/1 సర్వే నంబర్‌లో గల 3.73 ఎకరాల ప్రభుత్వ భూమిని 1979లో సబ్‌ డివిజన్‌ చేశారు. వాటిలో సర్వే నంబర్‌ 71/4లో 2.76 ఎకరాలు, 71/5లో 19 సెంట్లు పంట కాలువగా, 71/6లో 78 సెంట్లుగా విభజించారు. ఇందులో పంట కాలువ భాగం 19 సెంట్లు విడిచిపెట్టి 71/4లో 2.76 ఎకరాలు, 71/6లో 78 సెంట్లు కలిపి 3.54 ఎకరాలు ఎక్స్‌ సర్వీస్‌మన్‌ కోటా కింద సత్యనారాయణ భార్య లక్ష్మికి గతంలో డి.పట్టా ఇచ్చినట్టు సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగళ్‌ ఆధారంగా తెలుస్తోంది. లక్ష్మి తదనంతరం వారసులెవరూ లేకపోవడంతో చాలా సంవత్సరాలు ఆ భూమి ఖాళీగా ఉంది.


రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను!


మెయిన్‌ రోడ్డును ఆనుకొని వున్న ఈ భూమిపై కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను పడింది. వారికి రెవెన్యూ అధికారులు పూర్తి సహకారం అందించారు. డి.పట్టాదారునికి వారసులు వున్నట్టు ఫ్యామిలీ నంబరు సర్టిఫికెట్‌ సృష్టించినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. నర్సీపట్నం ఆర్డీవోగా సూర్యారావు వున్న సమయంలో రికార్డులు తారుమారు చేసి, మిలట్రీ కోటాలో ఇచ్చిన డి.పట్టా భూమిని వెబ్‌ల్యాండ్‌లో జిరాయితీగా మార్చారని గబ్బాడ మాజీ సర్పంచ్‌ మాకిరెడ్డి పోతురాజు ఆరోపిస్తున్నారు. 71/4లోని 2.76 ఎకరాలను 92 సెంట్లు చొప్పున, 71/6లోని 78 సెంట్లు భూమిని 26 సెంట్లు చొప్పున ముగ్గురు వ్యక్తులు పంచుకున్నారు. ఇటీవల భూమి చదును చేసి ఫెన్సింగ్‌ వేస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ వివాదంపై గబ్బాడ వీఆర్‌వో విచారణ జరిపి తహసీల్దార్‌కు నివేదిక అందజేశారని, అయితే చర్యలు తీసుకోవడంలో ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.


ఏజెన్సీకి సమీపంలో ఉండడంతో భూమి మంచి ధర


ఇదిలావుంటే, గబ్బాడ సమీపంలో వున్న ఏటిగైరంపేట దాటిన తర్వాత విశాఖ ఏజెన్సీ ప్రారంభమవుతుంది. పర్యాటకంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు లంబసింగి వంటి ప్రదేశాలు ఆంధ్రా ఊటీగా పేరుగాంచాయి. ఈ నేపథ్యంలో నర్సీపట్నం-చింతపల్లి రోడ్డుకు ఇరువైపులా వున్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గబ్బాడ, ఏటిగైరంపేట వరకు భూమి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గబ్బాడలో వివాదంలో వున్న సదరు భూమి విలువ సుమారు రూ.10 కోట్లు వుంటుందని పలువురు గ్రామస్థులు చెపుతున్నారు. ప్రభుత్వ భూమిని నర్సీపట్నానికి చెందిన పలువురు హస్తగతం చేసుకుంటున్నారని రెవెన్యూ అదికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఇటీవల నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ మౌర్యకు పలువురు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. డి.పట్టా భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్‌ జయను వివరణ కోరగా, గబ్బాడ భూమిపై ఫిర్యాదు అందిందని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2021-05-08T04:57:36+05:30 IST