రెవెన్యూ రూటే...సెప‘రేటు’!

ABN , First Publish Date - 2021-06-17T03:54:07+05:30 IST

ఇలా రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతోంది. ప్రతి పనికీ ఓ రేటును నిర్ణయించి వసూళ్లు చేయడం సిబ్బందికి అలవాటుగా మారిపోయింది. పని కోసం కార్యాలయానికి వెళ్లేవారి వద్ద లంచాలు గుంజుతున్నారు. వీఆర్వోలు, సర్వేయర్లే చక్రం తిప్పుతున్నారు. చేయి తడిపితే తప్ప రెవెన్యూ ఉద్యోగులు పని చేయరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రెవెన్యూ రూటే...సెప‘రేటు’!


చక్రం తిప్పుతున్న వీఆర్వోలు, సర్వేయర్లు

 ప్రతి పనికీ ఓ ధర

పాలక పెద్దల అండతోనే వసూళ్లు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

- రణస్థలం మండలం పైడిభీమవరం వీఆర్వో అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు గత నెలలో అరెస్టు చేశారు. 

- టెక్కలిలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆయన ఇటీవలే మృతి చెందారు. 

- వజ్రపుకొత్తూరు, మందస, పాతపట్నం మండలాల్లో రెవెన్యూ ఉద్యోగులు కూడా గతంలో లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కారు. 

- తాజాగా మంగళవారం ఎచ్చెర్ల మండలం భగీరథపురం వీఆర్వో మ్యుటేషన్‌ కోసం రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 

... ఇలా రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతోంది. ప్రతి పనికీ ఓ రేటును నిర్ణయించి వసూళ్లు చేయడం సిబ్బందికి అలవాటుగా మారిపోయింది. పని కోసం కార్యాలయానికి వెళ్లేవారి వద్ద లంచాలు గుంజుతున్నారు. వీఆర్వోలు, సర్వేయర్లే చక్రం తిప్పుతున్నారు. చేయి తడిపితే తప్ప రెవెన్యూ ఉద్యోగులు పని చేయరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తహసీల్దారు కార్యాలయాల్లో కొందరు దిగువ స్థాయి ఉద్యోగులు.. పాలక పెద్దల సహకారంతోనే అందినంత దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తూ ఆ శాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో రెవెన్యూ సిబ్బంది అవినీతికి అడ్డుకట్ట పడకపోవడం చర్చనీయాంశమవుతోంది.


 భూముల ధరలు పెరగడంతో....

జిల్లాలో భూముల మార్కెట్‌ విలువ అమాంతంగా పెరిగింది. దీంతో ఎక్కడికక్కడ భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. క్షేత్ర స్థాయిలో ఈ వివాదాలను చక్కబెట్టాల్సిన మండల స్థాయి రెవెన్యూ అధికారులు.. ఆ బాధ్యతలను  వీఆర్వోలు, సర్వేయర్లకు అప్పగిస్తున్నారు. దీంతో వారు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి, రెవెన్యూ డివిజన్లలో మొత్తం 454 మంది వీఆర్వోలు, 34 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నారనే నెపంతో ఒక్కరికే రెండు మూడు పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. ఈ అదనపు బాధ్యతలు వారికి అదనపు ఆదాయాన్ని చేకూర్చే వనరులుగా మారిపోయాయి. కొందరు వీఆర్వోలు, సర్వేయర్లు ఏళ్ల తరబడి ఒకే మండలం లేదా ఆ పక్క మండలాల్లోనే తిష్ఠ వేస్తున్నారు. భూ కబ్జా ముఠాలతో చేతులు కలిపి సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాల్లో  తమకు అందిన వాటాల్లో కొంతమొత్తం సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులకు చేరుతున్నట్లు తెలిసింది.  


 భూ కబ్జాదారులతో కుమ్మక్కు

వీఆర్వోలు, సర్వేయర్లు వారి పరిధిలో ఎక్కడ ప్రభుత్వ, బంజరు, పోరంబోకు భూములు, గ్రామ కంఠాలు ఉన్నాయో తెలుసుకొని భూ కబ్జాదారులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆ భూములు ఆక్రమణకు గురైన తరువాత కబ్జాదారుల నుంచి రూ.లక్షలు గుంజుతారు. అంతేకాకుండా రెండు వర్గాల మధ్య వివాదాస్పద భూముల విషయంలో జోక్యం చేసుకుంటారు. అవి ప్రభుత్వ భూములైతే వీఆర్వోలు, సర్వేయర్లే తెరవెనుక ఉండి ఫిర్యాదులు చేయిస్తారు. ఫిర్యాదు అందగానే అక్కడ వాలిపోయి ఇది ప్రభుత్వ భూమి అంటూ రెండు వర్గాల నుంచి లంచాలు దండుకోవడానికి అలవాటుపడ్డారు. శ్రీకాకుళం, రణస్థలం, ఎచ్చెర్ల, నరసన్నపేట, టెక్కలిలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న  ప్రాంతాల్లో ఇటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. 


 వెబ్‌ల్యాండ్‌ మాయాజాలం...

ప్రభుత్వ, ప్రైవేటు, ఇతరత్రా సంస్థలకు కేటాయించిన అన్ని రకాల భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో ఉంటాయి. దీన్ని కూడా కొందరు వీఆర్వోలు, సర్వేయర్లు సొమ్ము చేసుకొంటున్నారు. రూరల్‌ మండలాల్లో పట్టాదారు పాసుపుస్తకాల జారీకి రూ.2వేల వంతున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వెబ్‌ ల్యాండ్‌లో తప్పుల సవరణకు, కుటుంబ పెద్దల నుంచి వారసత్వ ఆస్తి బదలాయింపు (మ్యుటేషన్‌) కోసం ధర నిర్ణయించి దండుకుంటారు. దీనిపై ఉన్నతాధికారులు కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొత్తగా వచ్చిన కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2021-06-17T03:54:07+05:30 IST