రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉండాలి

ABN , First Publish Date - 2022-05-28T05:11:01+05:30 IST

రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను గుర్తించి, రికార్డులను పక్కాగా తయారు చేసి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సూచించారు.

రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉండాలి
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జేసీ తమీమ్‌ అన్సారియా

తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల శిక్షణలో జేసీ తమీమ్‌ అన్సారియా  సచివాలయాల్లో మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ తప్పనిసరి

మదనపల్లె టౌన్‌, మే 27: రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను గుర్తించి, రికార్డులను పక్కాగా తయారు చేసి  తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా సూచించారు. శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో ఆర్డీవో ఎంఎస్‌ మురళి ఆధ్వర్యంలో డివిజన్‌లోని తహసీల్దార్లు, డీటీలు, ఎంపికచేసిన వీఆర్‌వోలకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మా ట్లాడుతూ ప్రతి ఒక్కరు విధినిర్వహణలో ఆషామాషిగా వ్యవహరించవద్దన్నారు. ప్రభుత్వ భూములును గుర్తించి వాటిలో తప్పులు లేకుండా రికార్డులు నమోదు చేయడంతో పాటు ఏవైనా సందేహాలు వుంటే సీసీఎల్‌ఏ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. పాసుపుస్తకాలు మ్యుటేషన్‌లో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలన్నారు. డ్రాఫ్ట్‌ లాండ్‌ రికార్డులను(డీఎల్‌ఆర్‌) ప్రక్రియలో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొచ్చాక, తుది గా రికార్డుల్లోకి ఎక్కించాలన్నారు. ఆర్‌వోఆర్‌, అడంగల్‌ను సక్రమంగా నిర్వహిస్తూ భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దశాబ్దాల తరువాత నిర్వహిస్తున్న భూముల రీసర్వేలో పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. 

సచివాలయాల్లో మూవ్‌మొంట్‌ రిజిస్టర్‌ తప్పనిసరి

గ్రామ సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లేటప్పుడు మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో తప్పకుండా నమోదు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కొండామరిపల్లె, బసినికొండ సచివాలయాలను జేసీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బసినికొండలో గ్రామ మహిళా పోలీసు రిజిస్టర్‌ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు విజిటర్స్‌ రిజిస్టర్‌లో నమోదు చేశారు. సంక్షేమపథకాలులబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో లీలామాధవి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T05:11:01+05:30 IST