రెవెన్యూ ప్రక్షాళన

ABN , First Publish Date - 2022-05-31T04:59:56+05:30 IST

జిల్లాలో భారీ సంఖ్యలో తహసీల్దార్ల బదిలీలు జరిగాయి.

రెవెన్యూ ప్రక్షాళన

  • తహసీల్దార్ల మూకుమ్మడి బదిలీలు
  • 17 మంది తహసీల్దార్లకు స్థానచలనం 
  • వీరితో పాటు నలుగురు డిప్యూటీ తహసీల్దార్లు బదిలీ 
  • త్వరలో మరికొందరు..


 (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : జిల్లాలో భారీ సంఖ్యలో తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. పరిపాలన సౌలభ్యం కోసం మూకుమ్మడి బదిలీలు చేసినట్లు చెబుతున్నప్పటికీ వీరిలో కొందరిపై ఉన్నతస్థాయికి ఫిర్యాదులు అందడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి బదిలీలపై నిషేధం అమల్లో ఉండడంతో డిప్యూటేషన్ల పేరుతో బదిలీలు చేశారు. కొందరు తహసీల్దార్లపై ఫిర్యాదులు అందడంతో ఈ ఆకస్మిక బదిలీలు జరిగినట్లు సమాచారం. 17మంది తహసీల్దార్లు, నలుగురు డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  షాబాద్‌ తహసీల్దార్‌ అమర్‌లింగంగౌడ్‌ను కలెక్టరేట్‌కు బదిలీచేశారు. ఆయన స్థానంలో  శంకరపల్లి తహసీల్దార్‌ టి.సైదులును నియమించారు. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న నయీముద్దీన్‌ను శంకరపల్లి తహసీల్దార్‌గా నియమించారు. మొయినాబాద్‌ తహసీల్దార్‌ అనితారెడ్డిని అబ్ధుల్లాపూర్‌మెట్‌కు బదిలీ చేశారు. ఆమె స్థానంలో చేవెళ్ల తహసీల్దార్‌గా పనిచేస్తున్న అశోక్‌కుమార్‌ను నియమించారు.  మంచాల తహసీల్దార్‌ దేవూజాను మాడ్గుల్‌కు బదిలీ చేశారు. మాడ్గుల్‌లో పనిచేస్తున్న కె. కృష్ణను తలకొండపల్లికి బదిలీ చేశారు. తలకొండపల్లిలో పనిచేస్తున్న వై.శ్రీనివా్‌సను చేవెళ్లకు బదిలీ చేశారు. సరూర్‌నగర్‌లో పనిచేస్తున్న రామ్మోహన్‌ను ఇబ్రహీంపట్నంకు బదిలీ చేశారు. ఇక్కడ  పనిచేస్తున్న అనితను మంచాలకు బదిలీ చేశారు. కలెక్టరేట్‌ హెచ్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న జయశ్రీని సరూర్‌నగర్‌ తహసీల్దార్‌గా నియమించారు. అబ్ధుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ బి.వెంకటేశ్వర్లును కలెక్టరేట్‌ డి సెక్షన్‌కు బదిలీ చేశారు. హయత్‌నగర్‌ తహసీల్దార్‌ సుచరితను యాచారానికి బదిలీ చేశారు. యాచారంలో పనిచేస్తున్న మహమూద్‌అలీని కందుకూరు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో డీఏఓగా నియమించారు.  కందుకూరు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న డి. సంధ్యారాణిని హయత్‌నగర్‌ తహసీల్దార్‌గా  బదిలీ చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న తౌఫిక్‌ మహ్మద్‌ను కొందర్గు తహసీల్దార్‌గా నియమించారు. ఇదిలాఉంటే కొందరు తహసీల్దార్ల బదిలీల వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు సమాచారం. ఉదాహరణకు నగరశివార్లలో పనిచేస్తున్న ఓ తహసీల్దార్‌ కోటరీ ఏర్పాటు చేసుకున్న భూవివాదాలకు సంబంధించిన సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. కొన్నికేసుల్లో భూమి విలువ ఆధారంగానే వసూళ్లకు తెగబడినట్లు సమాచారం. సాయంత్రం ఓ ఫామ్‌హౌ్‌సలో దందాలు నిర్వహించే సదరు తహసీల్దార్‌  ఇటీవల ఓ  కేసులో నజరానాగా పేరొందిన  ప్రముఖ క్లబ్‌ నుంచి సభ్యత్వం కూడా తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఇలా మరికొందరిపై ఫిర్యాదులు రావడంతోనే ఆకస్మిక బదిలీలు చేసినట్లు తెలిసింది. 


డిప్యూటీ తహసీల్దార్లు 

తహసీల్దార్లతోపాటు పలువురు డిప్యూటీ తహసీల్దార్లను కూడా బదిలీ చేశారు. హయత్‌నగర్‌ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎన్‌.కృష్ణయ్యను చేవెళ్ల ఎలక్షన్‌ సెల్‌కు బదిలీ చేశారు. కందుకూరులో  డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న టి.శ్రీధర్‌ను మహేశ్వరం ఎలక్షన్‌ సెల్‌కు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న మహ్మద్‌ తాజుద్ధీన్‌ను కందుకూరు డిప్యూటీ తహసీల్ధార్‌గా నియమించారు.  అలాగే చేవెళ్ల తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న శంషుద్దీన్‌ను హయత్‌నగర్‌ డిప్యూటీ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. ఇదిలాఉంటే మరికొందరు తహసీల్దార్లను కూడా త్వరలోనే బదిలీ చేయనున్నట్లు సమాచారం. 


Updated Date - 2022-05-31T04:59:56+05:30 IST