దీర్ఘకాలంగా రెవెన్యూ సమస్యలు పెండింగ్‌

ABN , First Publish Date - 2022-05-19T04:56:24+05:30 IST

రెవెన్యూ సమస్యలను పరిష్కరించటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మాముళ్లు ఇచ్చిన వారికి మేలు చేకూర్చేలా రెవెన్యూ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తూ ఇతరులకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల అద్దంకి నియోజకవర్గంలో రెండు సార్లు బాపట్ల జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పర్యటించగా రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

దీర్ఘకాలంగా రెవెన్యూ సమస్యలు పెండింగ్‌
బొమ్మనంపాడులో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

మాముళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు

కలెక్టర్‌ ఎదుట కన్నీటి పర్యంతమవుతున్న బాధితులు 

  ప్రత్యేక స్పందనతోనే 

సమస్యలకు పరిష్కారం అంటున్న ప్రజలు

అద్దంకి, మే18: రెవెన్యూ సమస్యలను  పరిష్కరించటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మాముళ్లు  ఇచ్చిన వారికి మేలు చేకూర్చేలా రెవెన్యూ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తూ ఇతరులకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల అద్దంకి నియోజకవర్గంలో రెండు సార్లు బాపట్ల జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పర్యటించగా రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. బొమ్మనంపాడులో ఉపాధిహామీ పనుల పరిశీలనకు వచ్చిన సమయంలో ఆ గ్రామ రైతులందరూ  వీఆర్‌వో పై ఫిర్యాదు చేశారు. భూమి పట్టాదారు పాసుపుస్తకం కోసం వీఆర్వో రూ.3 వేల రూపాయలు లంచం తీసుకోవటంతో పాటు మళ్లీ అదనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేసిన విషయాన్ని ఓ రైతు కన్నీటి  పర్యంతమవుతూ కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఇక అదే సమయంలో మరికొందరు మహిళలు, రైతులు కూడా తమ భూ సమస్యలను  కలెక్టర్‌ దృష్టికి తీసుకు రాగా, ఆ మరుసటి  రోజే గ్రామంలో ప్రత్యేక స్పందన  కార్య క్రమం ఏర్పాటు చేయించారు. ప్రత్యేక స్పందనకు 20 మంది రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేశారు. 

 మంగళవారం రాత్రి సంతమాగులూరు మండలం చవటిపాలెం  లో పల్లె నిద్ర కార్యక్రమానికి  కలెక్టర్‌  విజయకృష్ణన్‌తో పాటు పలు శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంతమాగులూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రధానంగా మహిళా రైతులు కూడా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమవుతూ దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వివరించారు. ప్రధానంగా ఏల్చూరులో సుమారు 100 మంది ఎస్టీ కుటుంబాలకు చాలా కాలం క్రితం 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారు.  అయితే వాళ్లకు ఇంతవరకు పొజిషన్‌ చూపించలేదు. ఇక ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణం చేసే క్రమంలో అవే స్థలాలను సెంటున్నర చొప్పున ఇచే ్చ ప్రతిపాదన పెట్టారు. 

కుందుర్రు గ్రామంలో ఓ మహిళకు సంబంధించిన భూమిని  రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి వేరే వ్యక్తుల పేర్లతో ఆన్‌లైన్‌ చేశారు.

సంతమాగులూరులో అన్నదమ్ములకు సంబంధించిన భూమి పంపిణీకి  సంబంధించి వారిలో ఒకరికి సగం హక్కు కల్పిస్తూ  ఆన్‌లైన్‌ చేసిన అధికారులు మరొకరి విషయంలో తిరస్కరించారు. భాగపంపిణీ దస్తావేజు కావాలని మెలిక పెట్టారు.

తంగేడుమల్లిలో 8 మంది ఎస్టీ కుటుంబాలు సుమారు 80 సంవత్సరాలుగా 4 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. వారికి ఇంతవరకు భూమి హక్కు పత్రాలు ఇవ్వలేదు.  ఇలా అన్ని గ్రామాలలో రెవెన్యూ సంబంధిత సమస్యలు పేరుకు పోయాయి. వాటి పరిష్కారం కోసం స్థానిక అధికారులు దృష్టి పెట్టకపోగా సమస్యలు సృష్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక భూముల ఆన్‌లైన్‌ విషయంలో మాముళ్లు తీసుకొని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మండలానికి ఒక రోజు  చొప్పున జిల్లా అధికారులతో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తే అత్యధికశాతం  సమస్యలు  పరిష్కారం  అవుతాయని  పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ భూ సమస్యలు, రైతు సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధకనబరుస్తున్నందున త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉందని పలువురు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 



Updated Date - 2022-05-19T04:56:24+05:30 IST