రెవెన్యూ భూమాయ!

ABN , First Publish Date - 2022-08-17T06:14:45+05:30 IST

మండలంలోని నాన్‌-షెడ్యూల్డు ప్రాంతంలో భూములకు సంబంధించి సెటిల్‌మెంట్‌ ఫేర్‌ అడంగల్‌(ఎస్‌ఎఫ్‌ఏ) రికార్డులు అందుబాటులో లేకపోవడంతో గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కయ్యారు.

రెవెన్యూ భూమాయ!
భీమవరంలో జిరాయితీగా భావించి స్థానికేతరులు కొనుగోలు చేసిన భూమి. తరువాత ఈ సర్వే నంబరు 22ఏ జాబితాలో వుంది

అనంతగిరి మండలం నాన్‌షెడ్యూల్డు పంచాయతీల్లో ఎస్‌ఎఫ్‌ఏలు గల్లంతు

అప్పట్లో రెవెన్యూ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు కుమ్మక్కు

డి.పట్టా భూములు ఆన్‌లైన్‌లో జిరాయితీగా మార్పు

స్థానిక గిరిజనుల నుంచి కారుచౌకగా కొనుగోలు

అనంతరం ఇతర ప్రాంతాల వారికి అధిక ధరకు విక్రయం

రిజిస్ట్రేషన్‌కు అభ్యంతరం లేకపోవడంతో జిరాయితీగానే నమ్మిన కొనుగోలుదారులు

సమగ్ర భూ సర్వే కోసం 22ఏ జాబితాను విడుదల చేసిన ప్రభుత్వం

పలు సర్వే నంబర్లు ఈ జాబితాలో ఉండడంతో లబోదిబోమంటున్న కొనుగోలుదారులు

 

అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీ సరియాపల్లి రెవెన్యూలో సర్వే నంబరు 92 పూర్తిగా డి.ఫారం భూములు. కానీ దీనిలో 3.92 ఎకరాలను అనువంశిక జిరాయితీ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో చూపారు. సంబంధిత పట్టాదారులైన గిరిజన రైతుల నుంచి మైదాన ప్రాంతానికి చెందిన సుధాకర్‌ వ్యక్తి కొనుగోలు చేశాడు. అనంతరం రెవెన్యూ అధికారులు కొనుగోలుదారుని వివరాలను వెబ్‌ల్యాండ్‌  నమోదు చేశారు. కానీ ఇటీవల ప్రకటించిన 22ఏ జాబితాలో ఈ సర్వే నంబరు చేర్చడంతో అవి డి.పట్టా భూములను తెలిసి, కొనుగోలుదారుడు లబోదిబోమంటున్నాడు. 

విశాఖకు చెందిన జనసేన పార్టీ నాయకుడొకరు సరియాపల్లి రెవెన్యూలో జిరాయితీ భూములు అమ్మకానికి వున్నట్టు బ్రోకర్‌ చెప్పడంతో కొంతకాలం క్రితం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. తరువాత ఇవి డి.పట్టా భూములని తెలియడంతో అమ్మకానికి పెట్టాడు. కొనుగోలుదారులకు మాత్రం జిరాయితీగా చెప్పి, వారి నుంచి రూ.25 లక్షల అడ్వాన్స్‌గా తీసుకుని సేల్‌ అగ్రిమెంట్‌  చేసుకున్నాడు. కొద్ది రోజుల తరువాత కొనుగోలుదారులు రిజిస్ర్టేషన్‌కు వెళ్లగా.. ఆ సర్వే నంబరులో వున్న భూములు 22ఏ జాబితాలో వున్నట్టు అధికారులు చెప్పారు. అడ్వాన్స్‌ సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో కొనుగోలుదారులు సదరు నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ తరహా అక్రమాలు, మోసాలు అనంతగిరి మండలంలోని నాన్‌-షెడ్యూల్డు పంచాయతీల్లో యథేచ్ఛగా సాగాయి.


అనంతగిరి, ఆగస్టు 16: మండలంలోని నాన్‌-షెడ్యూల్డు ప్రాంతంలో భూములకు సంబంధించి సెటిల్‌మెంట్‌ ఫేర్‌ అడంగల్‌(ఎస్‌ఎఫ్‌ఏ) రికార్డులు అందుబాటులో లేకపోవడంతో గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కయ్యారు. స్థానిక గిరిజనులతోపాటు స్థానికేతరులకు, మాజీ సైనికులకు డి.పట్టాలు జారీ చేశారు. తరువాత కొన్ని సర్వే నంబర్లలోని భూములను రెవెన్యూ రికార్డుల్లో జిరాయితీలుగా మార్చేశారు. ఈ విషయం తెలియక ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు నాన్‌-షెడ్యూల్డు ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. ఇటీవల ప్రకటించిన 22ఏ జాబితాలో ఆయా సర్వే నంబర్లు వుండడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.

అనంతగిరి మండలంలో 24 గ్రామ పంచాయతీలకుగాను 19 పంచాయతీలు షెడ్యూల్డు ఏరియాలో వున్నాయి. మిగిలిన రొంపల్లి, గరుగుబిల్లి, గుమ్మకోట, భీంపోలు, ఎన్‌ఆర్‌పురం పంచాయతీలు మండల వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు విజయనగరం జిల్లా సాలూరు తాలూకాలో వుండేవి. 1985లో మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు ఈ పంచాయతీలను అనంతగిరి మండలంలో చేర్చారు. మండలంలో మిగిలిన ప్రాంతమంతా 1/70 చట్టం అమలవుతుండగా, ఈ ఐదు పంచాయతీల్లో నాన్‌-షెడ్యూల్డు ఏరియాలో వున్నాయి. మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు ఈ పంచాయతీలకు సంబంధించిన భూముల రికార్డులు సాలూరు నుంచి అనంతగిరి మండలానికి చేరాయి. కానీ కొంతకాలం తరువాత మొత్తం రికార్డులన్నీ గల్లంతైనట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 1/70 చట్టం ఇక్కడ వర్తించకపోవడం, ప్రభుత్వ భూములు అధికంగా వుండడంతో ఇతర ప్రాంతాలకు చెందన వ్యక్తులు భారీగా భూములు కొనుగోలు చేశారు. అదే విధంగా మాజీ సైనికోద్యోగులు, స్థానిక గిరిజనులకు డి.పట్టాలను రెవెన్యూ అధికారులు జారీ చేశారు. అనంతరం   రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, అప్పటి రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయ్యారు. పలు గ్రామాల్లో డి.పట్టా భూములను జిరాయితీలుగా రికార్డుల్లో మార్చేశారు. అనంతరం డి.పట్టాదారులకు తృణమో ఫణమో ముట్టజెప్పి వాటిని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. మరికొన్నిచోట్ల మధ్యవర్తులుగా వుండి మైదాన ప్రాంతానికి చెందిన పలువురి చేత భూములను కొనుగోలు చేయించారు. రెవెన్యూ రికార్డుల్లో, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో జిరాయితీ అని వుండడంతో కొనుగోలుదారులు కూడా నమ్మారు. ఈ నేపథ్యంలో గత ఏడాది సమగ్ర భూముల రీసర్వే చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం 22ఏ జాబితాలో వున్న భూముల వివరాలను వెల్లడించింది.  అనంతగిరి మండలంలోని నాన్‌-షెడ్యూల్డు పంచాయతీల్లో పలు సర్వే నంబర్లు ఈ జాబితాలో వున్నాయి. దీంతో ఆయా భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు లబోదిబోమంటున్నారు. 

ఎస్‌ఎఫ్‌ఏ లేకపోవడమే...

ఏ భూమి ఎవరిది అనేది తేల్చడానికి సెటిల్‌మెంట్‌ ఫేర్‌ అడంగల్‌(ఎస్‌ఎఫ్‌ఏ) ప్రామాణికం. కానీ మండలంలోని సరియాపల్లి, భీమవరం, నందకోట, బిల్లకోట, శింగవరం, కొండవెంకటాపురం, రొంపల్లి, బూరుగు, సొట్టాడివలస, తదితర రెవెన్యూ గ్రామాల్లో ఎస్‌ఎఫ్‌ఏ రికార్డులు సుమారు 15 ఏళ్ల క్రితం గల్లంతైనట్టు తెలిసింది. ఈ రికార్డులు ఏమయ్యాయి అన్నదానిపై ఇప్పటివరకు ఏ అధికారి కూడా విచారణ చేపట్టలేదు. దీంతో పొట్టి అడంగల్‌ను, ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (ఎఫ్‌ఎంబీ)ను ప్రామాణికంగా తీసుకుని భూముల స్వరూపాలను నిర్ధారిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన అప్పటి రెవెన్యూ అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు క్ముమ్మక్కై డి.పట్టా భూములను ఆన్‌లైన్‌లో జిరాయతీ భూములుగా నమోదు చేశారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులుమారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని పలు రెవెన్యూ గ్రామాల్లో ఎస్‌ఎఫ్‌ఏ రికార్డులు అందుబాటులో లేకపోయినప్పటికీ రెవెన్యూ రికార్డులను క్రమబద్ధీకరించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.


Updated Date - 2022-08-17T06:14:45+05:30 IST