రెవెన్యూ శాఖలో పునఃకేటాయింపుల పర్వం

ABN , First Publish Date - 2021-08-12T05:28:35+05:30 IST

రెవెన్యూ శాఖలో డిప్యూటీతహసీల్దార్‌, తహసీల్దార్‌ క్యాడర్‌లో అధికారుల పోస్టింగ్స్‌ ప్రక్రియలో పెద్దఎత్తున మతలబులు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రెవెన్యూ శాఖలో పునఃకేటాయింపుల పర్వం

తొలుత జోన్‌-3లోనే కొందరికి సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు

ఇంకొందరికి వేరే జిల్లాల్లో నియామకాలు

గుంటూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖలో డిప్యూటీతహసీల్దార్‌, తహసీల్దార్‌ క్యాడర్‌లో అధికారుల పోస్టింగ్స్‌ ప్రక్రియలో పెద్దఎత్తున మతలబులు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఈ రెండు కేటిగిరీల్లో ఉద్యోగోన్నతులు పొందుతున్న అధికారుల్లో కొంతమందిని జోన్‌-3లోనే సొంత జిల్లాకు, కొందరిని వేరేజిల్లాకు కేటాయించి పోస్టింగ్‌ చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల్లోనే రీఎలాట్‌మెంట్‌ పేరుతో వేరే జిల్లాలో నియమించిన వారిలో కొంతమందిని తిరిగి సొంత జిల్లాలో కొలువుదీరేలా చేస్తున్నారు. తొలుత వేరేజిల్లాకు ఎందుకు కేటాయించారు, ఇప్పుడెందుకు వారికి తిరిగి ఇక్కడ పోస్టింగ్‌ కల్పిస్తున్నారో స్పష్టమైన కారణాలను చెప్పడం లేదు. ఈ తతంగం వెనక పెద్ద బాగోతమే నడుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. 

రెవెన్యూ శాఖలో జోన్‌-3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.  తొలుత డిప్యూటీ తహసీల్దార్‌ క్యాడర్‌లో ఉన్నవారికి తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. తొలుత ఏడుగురు డీటీలకు జిల్లాలోనే ఉద్యోగోన్నతిపై తహసీల్దార్లుగా నియమించారు. ఆ సందర్భంలోనే మరో ఎనిమిది మందిని ప్రకాశం జిల్లాకు తహసీల్దార్లుగా కేటాయించారు. కొద్దిరోజుల్లోనే  వారిలో ముగ్గురిని గుంటూరుజిల్లాకు రీఎలాట్‌మెంట్‌ చేశారు. ఇదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి తొలుత పోస్టింగ్‌ అయిన వారు తిరిగి సొంత జిల్లాల్లో కొలువులు తెచ్చుకొన్నారు. సహజంగా రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నవారిని మాత్రమే జోన్‌-3లో సొంత జిల్లాకు కేటాయిస్తారు. అలాంటిది రిటైర్‌మెంట్‌ కావడానికి ఇంకా ఐదు నుంచి పదేళ్ల సర్వీసున్న వారినికూడా నియమించడం పలు అనుమానాలకు తావిస్తోంది. 


లంచాలు... సిఫార్సులు


పోస్టింగ్‌ల కోసం సచివాలయం స్థాయిలోనే పెద్దఎత్తున పైరవీలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ క్లియరెన్స్‌ అయిన తర్వాత ఇక్కడ పోస్టింగ్‌ కోసం కొంతమంది నేతల ఆమోదం తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో తెరవెనక రహస్య ఒప్పందాలు జరుగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గనులు, రియల్‌ఎస్టేట్‌ వెంచర్లు ఉన్న మండలాల్లో పోస్టింగ్‌ల కోసం కొందరు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. 


సుప్రీం కోర్టు తీర్పుతో...


ఇదిలావుంటే గతంలో ఇద్దరు డీటీలను గుంటూరు జిల్లాకు రీఎలాట్‌ చేశారు. దానిపై సుప్రీంకోర్టు స్టేటస్‌ కో విధించింది. ఇప్పుడు జీఏడీ నుంచి వచ్చిన ఉత్తర్వులతో వారిని గుంటూరు జిల్లాలోనే కొనసాగిస్తూ తాజాగా సీసీఎల్‌ఏ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. 2018లో ఏపీపీఎస్‌సీ విడుదల చేసిన ర్యాంకు లిస్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగి గత నెల 14న తీర్పు వెలువడింది. ఏపీపీఎస్‌సీ విడుదల చేసిన ర్యాంకు లిస్టునే సుప్రీం కోర్టు ఖరారు చేసిందని పేర్కొంటూ జీఏడీ నుంచి సమాచారం వచ్చింది. ఆ మేరకు మరో ముగ్గురు డీటీలు ఎన్‌.వాసు, పి.వసంతరావు, కె.రవికుమార్‌లను విధుల్లో చేరేలా అనుమతించాలని సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటివరకు తహసీల్దార్‌గా ఉన్న ఆర్‌.సునీల్‌ని విధుల నుంచి రిలీవింగ్‌ చేసి వాణిజ్య పన్నుల శాఖకి తిరిగి పంపించాల్సిందిగా బుధవారం సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీచేసింది. 


Updated Date - 2021-08-12T05:28:35+05:30 IST