ఒక్క కలం పోటు చాలు!

ABN , First Publish Date - 2022-01-20T07:01:56+05:30 IST

ఉద్యోగుల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తున్న జీవో 317 విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి నాటకమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ నాటకంలో సూత్రధారి..

ఒక్క కలం పోటు చాలు!

317 జీవోను కేంద్రం రద్దు చేయొచ్చు 

అధికారం ఇస్తేనే చేస్తామంటున్న బండి 

ఈ నాటకంలో సూత్రధారి బీజేపీ,

పాత్రధారి టీఆర్‌ఎస్‌.. రేవంత్‌ ధ్వజం


హైదరాబాద్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తున్న జీవో 317 విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి నాటకమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ నాటకంలో సూత్రధారి బీజేపీ అయితే, పాత్రధారి టీఆర్‌ఎస్‌ అన్నారు. తమకు అధికారం ఇస్తే 317 జీవోను రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అంటున్నారని, వాస్తవానికి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే ఇచ్చిన ఈ జీవోను కేంద్రం ఒక్క కలం పోటుతో ఆపేయవచ్చని అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఉపాధ్యాయ సంఘం నేత గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రభుత్వ వైఖరి వల్ల ప్రగతి భవన్‌ను ముట్టడించే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా రేవంత్‌ అన్నారు. జీవో 317 ద్వారా స్థానికులను స్థానికేతరులుగా మార్చి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీనియర్లు, జూనియర్ల మధ్యన విభజన తెచ్చాచ్చారన్నారు. ఉద్యోగులు, టీచర్లకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని చెప్పారు. 317 జీవో రద్దయ్యే వరకు పార్టీ తరపున పోరాటాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. 


600 మండలాల్లో బలపడితే అధికారం మనదే

రాష్ట్ర వ్యాప్తంగా 600 మండలాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపడితే అధికారంలోకి వస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు మండలాలను ప్రాతిపదికగా తీసుకుని సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయ కర్తలకు సూచించారు.  కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్తలతో బుధవారం ఇందిరా భవన్‌లో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. మండలంలో 10 వేలు, నియోజకవర్గంలో 50 వేలు, లోక్‌సభ నియోజకవర్గంలో 3.5 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించిన వారికి రాహుల్‌గాంధీతో సన్మానం చేయిస్తానని చెప్పారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తామన్నారు. 

Updated Date - 2022-01-20T07:01:56+05:30 IST