నాపై నిఘా, పవన్‌పై పగ: రఘురామ

ABN , First Publish Date - 2022-02-27T20:03:39+05:30 IST

వైసీపీ ప్రభుత్వానికి ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కొరకరాని కొయ్యగా మారారు. స్వపక్షాన్ని ఎప్పటికప్పుడు విమర్శిస్తూ

నాపై నిఘా, పవన్‌పై పగ: రఘురామ

ఢిల్లీ: వైసీపీ ప్రభుత్వానికి ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కొరకరాని కొయ్యగా మారారు. స్వపక్షాన్ని ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారారు. ప్రతిరోజు రచ్చబండ పేరుతో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. ఏపీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘నాపై నిఘా, పవన్‌పై పగ జగనన్నకి ఎందుకు?.. భీమ్లానాయక్‌లో పవన్‌ అద్భుతంగా నటించారు. పవన్‌ యాక్షన్‌ చేస్తే.. మంత్రి పేర్నినాని ఓవర్‌ యాక్షన్‌ చేశారు. కొన్ని చోట్ల థియేటర్లు బంద్ చేశారు.. అరాచకాలు సృష్టించారు. అవసరం లేకపోయినా సినిమా విషయంలో సీఎం జగన్ అల్లరి పాలయ్యారు. జగన్ వైఖరితో మా పార్టీ దెబ్బతింటుంది’’ అని రఘురామ విమర్శలు సంధించారు. 


ఎంపీ రఘురామరాజు కదలికలపై ఏపీ సీబీసీఐడీ నిఘా పెట్టింది. రఘురామరాజు ఇంటి దగ్గర ఏపీ ఐబీ అధికారులు కాపుకాశారు. ఐబీ అధికారుల కళ్లుగప్పి ఆయన ఢిల్లీ చేరుకున్నారు.  గతంలో దాఖలైన కేసులో విచారణకు రావాలంటూ సీబీసీఐడీ నోటీసులు జారీ చేసింది. తనకు ఆరోగ్యం బాగాలేదంటూ విచారణకు రఘురామ హాజరుకాలేదు. పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయని సీబీసీఐడీకి సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి రఘురామకృష్ణరాజు ఢిల్లీలోనే ఉన్నారు. 


మరోవైపు జనసేనానిగా జగన్‌ ప్రభుత్వాన్ని పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా విమర్శిస్తున్నారు. తనను విమర్శించడాన్ని సహించలేని జగన్‌ ఇప్పుడు ‘భీమ్లా నాయక్‌’పై పడ్డారు. పవన్‌ కల్యాణ్‌, రానా నటించిన ‘భీమ్లా నాయక్‌’ సినిమా శుక్రవారం విడుదలైంది. అంతే, రెవెన్యూ అధికారులు అందరూ తమ పనులు వదిలేసి సదరు చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లలో తనిఖీలకు బయలుదేరారు. ఫలానా సినిమా విడుదల సందర్భంగా తనిఖీలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలలో పేర్కొన్నారంటే పాలకుల నైజం ఏమిటో తెలుస్తుంది. ‘భీమ్లా నాయక్‌’కు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఆ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అన్న టాక్‌ సొంతం చేసుకుంది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించిన పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పలు థియేటర్ల వద్ద ఆందోళన చేశారు.


Updated Date - 2022-02-27T20:03:39+05:30 IST