Abn logo
Jul 26 2021 @ 03:22AM

‘స్కిల్‌’పై గ్రిల్‌!

  • నాడు నైపుణ్యాలు పెంచిన ప్రాజెక్టుపై పగ!
  • ఫోరెన్సిక్‌ ఆడిట్‌ పేరిట హడావుడి తవ్వకాలు
  • ఏదో జరిగినట్టు చూపేందుకు తంటాలు
  • కలిసి వివరణకూ అనుమతించని వైనం

సర్కారు ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. దీనినుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి గత ప్రభుత్వంలో వచ్చిన సంస్థలను, ప్రాజెక్టులను ఇబ్బందిపెట్టడం సర్కారు పనిగా పెట్టుకొన్నట్టు కనిపిస్తోంది. నిన్న ఫైబర్‌నెట్‌..తాజాగా స్కిల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు! యువతలో నైపుణ్యం పెంచి.. ఆత్మవిశ్వాసంలో అవకాశాలను అందుకునే స్థాయికి తెచ్చిన ఈ ప్రాజెక్టును, నిర్వహించిన సీమెన్స్‌ సంస్థ కృషిని చూసీ ఓర్వలేకపోతోంది. దీనిలోనూ అడ్డగోలు వ్యవహారం జరిగిందని చెప్పే హడావుడి మొదలయింది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): నైపుణ్యాలున్న మానవ వనరులు ఉంటేనే రాష్ట్రానికి  పెట్టుబడులు వస్తాయి. కొత్త పరిశ్రమలు వచ్చి ఉద్యోగాల ను సృష్టిస్తాయి. ఈ ఆలోచనతోనే నాటి టీడీపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సం స్థను(స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌)ఏర్పాటు చేసింది. పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే రాష్ట్రంలోని యువత, విద్యార్థులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యా ల్లో శిక్షణ ఇవ్వాలి. ఇంజనీరింగ్‌, ఇతర కోర్సులు చదివినవారికి ప్రాక్టికల్‌ జ్ఞానం అందించాలి. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థను ఈ లక్ష్యాలతో ముందుకుతెచ్చారు. నైపుణ్య శిక్షణ, జాబ్‌ ఓరియంటేషన్‌ కల్పించేందుకు ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకమైన సీమెన్స్‌ ప్రాజెక్టు ముందుకొచ్చింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ.. సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ అనే సంస్థలతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిం ది. తయారీ రంగం, ఐటీ, ఐటీఈఎస్‌ తదితర రంగాల్లోని పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను నిరుద్యోగ యువత, విద్యార్థులకు అందించారు. ఈ ప్రాజె క్టు అనుకున్న లక్ష్యం మేరకే సాగింది. 2020 మార్చినాటికి మొత్తం 2,11,984 మంది నిరుద్యోగ యువత, విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందినవారిలో 6,500 మంది ని ఏపీఎ్‌సఎ్‌సడీసీ వివిధ తయారీ, సేవా రంగం పరిశ్రమల్లో ఉద్యోగులుగా చేర్చింది. ఇలా శిక్షణ పొందిన 15వేలమందికి పైగా విద్యార్థులు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ల్లో వివిధ కంపెనీల్లో ఉద్యోగులుగా ఎంపికయ్యారు. మరోవైపు కొవిడ్‌లో కూడా ఈ టీఎ్‌సడీఐల(టెక్నికల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాలు ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమం కొనసాగింది. 18,500 మందికి శిక్షణ ఇచ్చారు.


ఖర్చులో 90శాతం సీమెన్స్‌దే..

నైపుణ్యాభివృద్ధికోసం ప్రాజెక్టులో భాగంగా ఒక సెంట ర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పడం.. దానికింద 5 టెక్నికల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌(టీఎ్‌సఐడీ) కేంద్రాలు ఏర్పాటుచేయ డం కీలకమైనవి. ఈ కేంద్రాల్లో యువత, విద్యార్థులకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రంలో అప్పటికే ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలలను దీనికోసం ఉపయోగించుకున్నారు. ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పి..దాని పరిధిలో 5 కళాశాలలను ఎంపికచేశారు. ఈ కళాశాలల్లోనే టీఎ్‌సడీఐలు ఏర్పాటు చేశారు. ఇలా ఆరు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేసి వాటి పర్యవేక్షణ కింద 34టీఎ్‌సడీఐలను ఏర్పాటుచేశారు. పదేళ్లపాటు ఈ ప్రాజెక్టు అమల్లో ఉంటుంది. నిబంధనల ప్రకారం తొలి మూడేళ్లు సీమెన్స్‌ కంపెనీయే ఈ ప్రాజెక్టు నిర్వహణ చేసింది. అనంతరం టీఎ్‌సడీఐ కేంద్రాలను ఏర్పాటుచేసుకున్న కళాశాలలే వాటిని నిర్వహిస్తున్నాయి. సీమెన్స్‌తో కలిసి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 90% సీమెన్స్‌ సంస్థే భరిస్తుంది. 10% మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. 


ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌-దాని పర్యవేక్షణలోని 5 టీఎ్‌సడీఐల ఏర్పాటుకు రూ.546.84 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందులో 90% సీమెన్స్‌-డిజైన్‌ టెక్‌ సంస్థలు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఇచ్చాయి. అంటే రూ. 491.84కోట్లు ఆ సంస్థలే చేకూర్చా యి. మిగతా 10% ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇలాంటి 6 కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ వాటాగా అవసరమైన రూ.370.78కోట్లను ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ మేరకు 2015 జూన్‌ 30న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. శిక్షణ ఇచ్చేవారి ఖర్చు, నిర్వహణ ఖర్చును మూడేళ్లపాటు సీమెన్స్‌-డిజైన్‌టెక్‌ క ంపెనీలే భరించాయి. 2015 డిసెంబరులో మొత్తం ప్రభు త్వ వాటా ఖర్చు  రూ.370.78 కోట్లలో.. సగం రూ.185 కోట్లను విడుదల చేసింది. మిగిలిన 50ు నిధుల్ని ప్రాజెక్టు పురోగతి, అదేవిధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక ప్రసిద్ద సంస్థతో మొత్తం ప్రాజెక్టు వాస్తవ విలువ ఎంతో అంచనా వేయించాకే ఇస్తామన్న షరతు పెట్టారు. 3 దశాబ్దాలుగా శిక్షణ రంగంలో సేవలందిస్తున్న సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ).. ప్రాజెక్టు వాస్తవ విలువ మూల్యాంకనం జరిపి 18.3.2016న నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ప్రాజెక్టు ఖర్చు సహేతుకంగానే ఉందని స్పష్టం చేసింది. దీంతోమిగిలిన రూ.185కోట్లు చెల్లించారు.


ప్రతిదీ పక్కాగా..

సీమెన్స్‌ ప్రాజెక్టు పర్యవేక్షణకు ఐఏఎస్‌ అధికారుల కమిటీ, అదేవిధంగా టెక్నికల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్స్‌ను ఏయే ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటుచేయాలన్న దానిపై మరో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీలో నాటి మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఐఏఎస్‌ అధికారులు ఎస్‌.ఎ్‌స.రావత్‌, ముద్దాడ రవిచంద్ర, ఉదయలక్ష్మి, మరో అధికారి గంటా సుబ్బారావు, ఏపీఎ్‌సఎ్‌సడీసీ తరఫున కె.లక్ష్మీనారాయణ, సీమెన్స్‌ ప్రతినిధిగా ప్రకాశ్‌ టొలానీ, డిజైన్‌టెక్‌ ప్రతినిధిగా సచిన్‌ చౌగులేలను నియమించింది. అదేవిధంగా డీఎ్‌సడీఐల ఎంపికకు అజయ్‌జైన్‌, ఎస్‌.ఎ్‌స.రావత్‌, గంటా సుబ్బారావు, ఉదయలక్ష్మి, కె.లక్ష్మీనారాయణలను నియమించింది. ఈ కమిటీ ఎంపిక చేసిన ఇంజనీరింగ్‌ కళాశాలలను మళ్లీ సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ ప్రతినిధులు కూడా సందర్శించారు. నిబంధనలకు అనుగుణంగా తరగతి గదులు, అదేవిధంగా హాస్టల్‌ వసతి, ఇతర సౌకర్యాలు లేకుంటే...ఆ కళాశాల బదులుగా మరోదాన్ని ఎంపికచేయాలనే షరతు పెట్టారు. ఎంపికైన ఇంజనీరింగ్‌ కళాశాలలు ఏపీఎ్‌సఎ్‌సడీసీతో ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారమే తమ కళాశాలల్లో ఏర్పాటుచేసిన కేంద్రాలు, టీఎ్‌సడీఐలను నిర్వహించాల్సి ఉంటుంది.

ఫోరెన్సిక్‌ తవ్వకాలు షురూ

లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపయోగపడిన ప్రాజెక్టుపై ఏదో ఒక మరక వేయడానికి, రాజకీయ కుంపట్లోకి లాగడానికి ప్రత్యేకమైన  అం శాలతో కూడిన టార్గెట్లు ఇచ్చి ఓ ప్రైవేటు సంస్థతో సీమెన్స్‌ ప్రాజెక్టుపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించారు. ఈ ప్రాజెక్టును తీసుకురావడంలో ఉన్న లోపాలు? విధానపరమైన లోపాలు, నిధుల వినియోగంలో జరిగిన తప్పులు? నిధుల వినియోగ విధానంపై విశ్లేషణతోపాటు, ఇతర అక్రమాలు, తప్పుడు ప్రకటనలు, పాలనా పరమైన విధానాలు, అంతర్గత పాలసీల విశ్లేషణలు తేల్చాలని ముందుగానే దిశానిర్దేశం చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ తదితర సంస్థలు ఇచ్చిన రిపోర్టులు, నివేదికలను పరిశీలించిన తర్వాత ఫోరెన్సిక్‌ ఆడిట్‌ పేరిట తన రిపోర్టును వెల్లడించింది. అయితే, తనకున్న పరిమితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టు ఆస్తులను ఎక్కడా భౌతిక పరిశీలన చేయలేకపోయానని ఆ సంస్థ తెలిపింది. కాగా, సీమెన్స్‌ ప్రాజెక్టులో ప్రభు త్వం తన వాటాగా విడుదల చేసిన నిధులను మౌలిక సదుపాయాలు, లాబ్‌లు, సాఫ్ట్‌వేర్‌, ఇతర వనరులు సమకూర్చుకునేందుకు ఖర్చుపెట్టారు. రూ.241 కోట్లను డిజైన్‌ టెక్‌కు విడుదల చేయగా, ఆ సంస్థ షెల్‌కంపెనీలకు దారి మళ్లించిందని ఫోరె న్సిక్‌ ఆడిట్‌లో ఆరోపించారు. సీఐడీతో విచారణ జరపాలని కోరింది. ప్రాజెక్టును, అది సృష్టించిన ఆస్తులను భౌతిక పరిశీలన చేయకుండానే, నిధులను దారిమళ్లించారని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి? అంటే మొత్తం ప్రాజెక్టు బోగస్‌ అని ప్రచారం చేయడం దీని ఉద్దేశమా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 


సీఎంకు డిజైన్‌టెక్‌ కంపెనీ లేఖ

నైపుణ్యాభివృద్ధిలో తప్పులు జరిగాయని ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో తేలినందున సీఐడీ విచారణ జరిపించాలని ఆ సంస్థ ప్రతినిధి కోరడంపై సీమెన్స్‌ ప్రాజెక్టులో ముఖ్య భాగస్వామి డిజైన్‌టెక్‌ సంస్థ స్పందించింది. సందేహాలను నివృత్తిచేసేందుకు, అప్పటి విషయాలపై వివరణ ఇచ్చేందుకు తన కు అవకాశం ఇవ్వాలని సంస్థ చైర్మన్‌, ఎండీ వికాస్‌ కన్వేల్కర్‌ ఈ నెల 13న సీఎం జగన్‌కి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం ఇంత వరకు స్పందించనేలేదు. ఆడిట్‌ రిపోర్టులోని అంశాలపై డిజైన్‌టెక్‌ ఏం చెబుతుందో వినడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం.