Abn logo
Sep 25 2021 @ 17:49PM

పెళ్లి ఫిక్స్ అయ్యాక కనబడకుండా పోయిన యువతి.. 117 రోజుల తర్వాత వెలుగులోకి షాకింగ్ నిజాలు

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఓ యువతి అకస్మాత్తుగా కనబడకుండాపోయింది. నెలలు గడిచినా ఆమె జాడ తెలియలేదు. అనుమానితుల్ని పోలీసులు పలుమార్లు విచారించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో విసుగు చెందిన ఆ యువతి తండ్రి.. హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. యువతి తల్లిదండ్రులకు షాకింగ్ విషయం చెప్పారు. మధ్యప్రదేశ్‌లో చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన నందికిషోర్ వంశకర్, సుధా దంపతులకు నలుగురు పిల్లలు. ఇందులో ఖుష్బూ వంశకర్ (24) అనే అమ్మాయి అందిరి కంటే చిన్నది. కొద్ది రోజుల క్రితం నందికిషోర్ దంపతులు ఖుష్బూ వంశకర్‌కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ సంబంధం చూసి, ఖాయం కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మే 31 నుంచి ఖుష్బూ వంశకర్ కనబడకుండా పోయింది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి ఫోన్‌కాల్ వివరాలను పరిశీలించారు. ఆకాశ్ బెన్ అనే వ్యక్తితో సుమారు అరగంటపాటు మాట్లాడిన తర్వాతే ఖుష్బూ వంశకర్ కనబకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆకాశ్ బెన్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిచి సుమారు నాలుగు సార్లు విచారించారు. అయిన ఫలితం లేకపోవడంతో.. ఇతర కేసుల గొడవలో పడి పోలీసులు ఈ  కేసు విచారణ వేగాన్ని కాస్త తగ్గించారు. ఈ నేపథ్యంలో ఖుష్బూ వంశకర్ కనబడకుండా పోయి నెలలు గడిచాయి. పోలీసుల వైఖరితో విసుగు చెందిన యువతి తల్లిదండ్రులు.. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎస్పీ రంగంలోకి దిగి.. ఈ కేసును క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. 


ఈ క్రమంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సెప్టెంబర్ 23న ఆకాశ్ బెన్‌.. క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి పద్ధతులు ఉపయోగించారో కానీ.. ఖుష్బూ వంశకర్ కనబడకుండా పోయి 117 రోజులు గడిచిన తర్వాత ఆకాశ్ బెన్ నుంచి నిజాలు కక్కించారు. తాను, ఖుష్బూ వంశకర్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ఖుష్బూ వంశకర్ తల్లిదండ్రులు ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపాడు. దీంతో తాను ఆగ్రహానికి గురైనట్లు చెప్పాడు. మే 31న ఖుష్బూ వంశకర్‌కు ఫోన్ చేసి, ఇంటి నుంచి బయటకు రప్పించినట్లు వెల్లడించాడు. ఓ రెండస్థుల బంగ్లాలోకి తీసుకెళ్లి.. తల్లిదండ్రులు కుదుర్చిన పెళ్లిన చేసుకోద్దంటూ ఖుష్బూ వంశకర్‌ను కోరినట్లు చెప్పాడు. అయితే దానికి ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో పొడిచి చంపేసినట్లు వెల్లడించాడు. శవాన్ని కూడా అక్కడే దాచి ఉంచినట్లు పేర్కొన్నాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అస్థిపంజరం ఖుష్బూ వంశకర్‌దేనా కాదా అని నిర్ధారించుకునేందుకు సాంపిల్స్‌ను డీఎన్ఏ పరీక్ష కోసం పంపించారు. ఇదిలా ఉంటే.. తమ కూతురు ఇక లేదన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...