లక్ష మందితో దండోరా మోగిస్తాం

ABN , First Publish Date - 2021-07-26T08:09:14+05:30 IST

క్విట్‌ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 9న ఇంద్రవెల్లి గడ్డపై లక్ష మంది దళిత, గిరిజనులతో దండు కట్టి దండోరా మోగిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

లక్ష మందితో   దండోరా మోగిస్తాం

9న ఇంద్రవెల్లి నుంచి ప్రారంభం

ఉప ఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్‌కు పథకాలు గుర్తొస్తాయి

హుజూరాబాద్‌లో దళిత బంధు అమలు 

చేస్తే మిగతా నియోజకవర్గాల మాటేంటి?

కాంగ్రెస్‌ జెండా మోసేవాళ్లే నా బంధువులు: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌

మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో భేటీ


హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): క్విట్‌ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 9న ఇంద్రవెల్లి గడ్డపై లక్ష మంది దళిత, గిరిజనులతో దండు కట్టి దండోరా మోగిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ సీనియర్‌ నేత కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు నాయకత్వంలో సెప్టెంబరు 17వ తేదీ వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని చిరాన్‌ ఫోర్ట్‌లో ఆదివారం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావును రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంచిర్యాల జిల్లా పార్టీ నేతలతో అక్కడే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు పథకాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. దళిత బంధు పథకం హుజూరాబాద్‌లో మా త్రమే అమలు చేస్తే మిగతా 118 నియోజకవర్గాల్లోని దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దళితులను మోసం చేసి ఓట్లు డబ్బాలో వేసుకుంటామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలోని 1.35 కోట్ల మంది దళిత, గిరిజనులకూ ఈ పథకం వర్తింపజేయాల్సిందేనన్నారు. కాగా, ప్రేమ్‌సాగర్‌రావుతో తనకు ఎలాంటి విభేదాలూ లేవని, టీపీసీసీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని రేవంత్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ జెండా దించకుండా మోసిన వారే తన బంధువులని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ రేవంత్‌ సారఽథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్తా పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలని సూచించారు. 


20 నెలల్లో పీడ వదులుతుంది

రానున్న 20 నెలల్లో తెలంగాణకు పట్టిన పీడ వదులుతుందని, ఈలోగా ప్రజలందరూ తుది దశ ఉద్యమానికి కార్యోన్ముఖులు కావాలని రేవంత్‌రెడ్డి కోరారు. బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తుది దశ ఉద్యమంలో పాల్గొనే ప్రతి తెలంగాణ బిడ్డను ఆశీర్వదించాలని, తెలంగాణ సమాజాన్ని ముందుకు నడిపించడానికి అవసరమైన మనోధైర్యాన్ని కల్పించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నగరాన్ని పట్టిపీడిస్తున్న వరదల నుంచి ప్రజలను కాపాడాలని వేడుకున్నట్లు చెప్పారు. స్వయం పాలన, స్వేచ్ఛ కోసం కలలుగన్న తెలంగాణ ప్రజానీకం మరో మహోద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాగా, శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీడిమెట్లకు చెందిన ముప్పిడి వంశీకృష్ణ అనే వ్యక్తి మరణించగా.. ఆయన కుటుంబాన్ని రేవంత్‌ పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. 

Updated Date - 2021-07-26T08:09:14+05:30 IST