రేవంత్‌రెడ్డి పని తీరు మారాలి

ABN , First Publish Date - 2021-12-28T07:40:17+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నడిపిస్తున్న

రేవంత్‌రెడ్డి పని తీరు మారాలి

  • పార్టీ లైన్‌లో ఆయన పని చేయట్లేదు..
  • వ్యక్తిగత ఇమేజ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు
  • రాష్ట్రంలో పార్టీ.. కార్పొరేట్‌ ఆఫీస్‌లా ఉంది
  • ఇందులో కుట్ర ఉంది.. విచారణ చేపట్టండి
  • తీరు మార్చుకోమని రేవంత్‌ను ఆదేశించండి
  • లేదంటే టీపీసీసీ అధ్యక్షుడినే మార్చేయండి
  • సోనియా, రాహుల్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ


హైదరాబాద్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నడిపిస్తున్న తీరుపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేవంత్‌ పనితీరును(స్టైల్‌ ఆఫ్‌ ఫంక్షనింగ్‌) మార్చుకునేలా, నాయకులందరినీ కలుపుకొనిపోయి పార్టీని బలోపేతం చేసేలా ఆదేశించాలంటూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కోరారు. లేని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ లైన్‌లో పనిచేస్తూ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురాగలిగే నాయకుడిని కొత్త చీఫ్‌గా నియమించాలన్నారు. ఈ మేరకు సోమవారం  సోనియా, రాహుల్‌కు జగ్గారెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు.


గతంలో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి తాను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పొత్తులో ఒకసారి, కాంగ్రెస్‌ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని లేఖలో తెలిపారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నానని పేర్కొన్నారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి.. పార్టీ బలోపేతం కోసం తామంతా రేవంత్‌తో కలిసి పని చేస్తున్నామన్నారు. అయితే, దురదృష్టవశాత్తూ రేవంత్‌రెడ్డి పార్టీ లైన్‌లో పని చేయకుండా, వ్యక్తిగత ఇమేజ్‌ పెంచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇది పార్టీ నేతలకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. పార్టీ తరఫున చేపట్టే కార్యక్రమాలను రేవంత్‌ తమతో చర్చించకుండానే మీడియాను ఇంటికి పిలిపించుకుని ప్రకటిస్తున్నారని, ఒక సీనియర్‌ నేతగా దీన్ని అవమానకరంగా భావిస్తున్నాని పేర్కొన్నారు. 


జిల్లాలో నేనొక్కడినే ఎమ్మెల్యేను..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో తాను ఒక్కడినే పార్టీ ఎమ్మెల్యేనని సోనియాకు రాసిన లేఖలో జగ్గారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌ కూడా ఈ పది నియోజకవర్గాల్లోనే ఉందన్నారు.


ధాన్యం సేకరణకు సంబంధించి కేసీఆర్‌ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో కార్యక్రమం నిర్వహిస్తానంటూ నాలుగు రోజుల కిందట జరిగిన ఇక పత్రికా సమావేశంలో ప్రకటించారని తెలిపారు. రైతుల సమస్యలపై ఉద్యమించడం మంచిదేనని, తానూ ఈ సమస్యపైన ఉద్యమిస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. అయితే రైతులకు సంబంధించిన అంశంపైన ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పర్యటనకు వస్తూ తనకు సమాచారం ఇవ్వకపోవడం తప్పు అని  పేర్కొన్నారు. ఒక కార్పొరేట్‌ ఆఫీస్‌ మాదిరిగా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తీరు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో ఏదో కుట్ర జరుగుతోందని, దీనిపై  విచారణ జరిపించాలని లేఖలో కోరారు. 




పార్టీకి ఇది ప్రమాదకరం

తెలంగాణలో కాంగ్రెస్‌ ఉంటేనే తాము రాజకీయంగా బతుకుతామని, కానీ దురదృష్టవశాత్తూ సీనియర్‌ నేతలను సమన్వయం చేసుకొని ముందుకెళ్లడంలో రేవంత్‌ విఫలమయ్యారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇది పార్టీకి, వ్యక్తిగతంగా తమకు నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ కారణంగానే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో 3వేల ఓట్లకే పరిమితమయ్యామని గుర్తు చేశారు.


ఇటీవల 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఒక్క దాంట్లోనూ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా.. డీసీసీలకే నిర్ణయాధికారం ఇవ్వడాన్ని జగ్గారెడ్డి తప్పుపట్టారు. చివరకు రేవంత్‌ సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లోనూ, ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరిలోనూ అభ్యర్థిని పెట్టలేదని గుర్తు చేశారు.


తాను ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తన భార్య నిర్మలా జగ్గారెడ్డిని ఎమ్మెల్సీగా అభ్యర్థిగా నిలిపి.. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 231 ఓట్లను పూర్తిగా వేయించుకున్నానని వెల్లడించారు. సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చామని పేర్కొన్నారు.  గ్రామ, మండల స్థాయిలో పని చేసే అలవాటు రేవంత్‌కు లేదని, బహిరంగ సభల్లో స్టార్‌లీడర్‌గా పబ్లిసిటీ చేసుకునే తత్వమే ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇది ప్రమాదకరమన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలన్న ఉద్దేశంతోనే సోనియా దృష్టికి ఈ అంశాలను తీసుకొస్తున్నానని, రేవంత్‌తో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి విభేదాలు లేవని వివరించారు. తన మాటలు కొందరికి నచ్చవని, అలాంటి వారితోనే కాంగ్రెస్‌ పార్టీకి నష్టమని వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-12-28T07:40:17+05:30 IST