Railway Station‌లో చాయ్ అమ్మిన వ్యక్తిని యువకులు ప్రధానిని చేశారు: Revanth reddy

ABN , First Publish Date - 2022-06-24T19:38:10+05:30 IST

ప్రధాని మోదీ అనాలోచితా నిర్ణయం వల్ల లక్షలాది మంది యువకులు ఆందోళన చేపట్టారని రేవంత్ రెడ్డి అన్నారు.

Railway Station‌లో చాయ్ అమ్మిన వ్యక్తిని యువకులు ప్రధానిని చేశారు: Revanth reddy

హైదరాబాద్ (Hyderabad): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendramodi) అనాలోచితా నిర్ణయం వల్ల లక్షలాది మంది యువకులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న యువకులతో ఆయన ములాఖ‌త్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 18 నుండి 25 ఏళ్ల లోపు ఉన్న 25 కోట్లు మంది యువకులు ప్రధానిగా మోదీని ఎన్నుకున్నారన్నారు. రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్మిన వ్యక్తిని ఇదే యువకులు ప్రధానిని చేశారన్నారు. అలాంటి యువకుల పట్ల ఇదేనా ప్రధాని చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు చట్ట సభల్లో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే  బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.


అగ్నిపత్ స్కీమ్ దేశ భద్రతను  ప్రమాదంలో నెట్టిందని, ఈ హడావిడి నిర్ణయం వల్ల కోట్లాది మంది యువకులు దేశానికి భద్రత లేదని భావించి ఆందోళన బాట పట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిప్రత్ పథకంలో నాలుగేళ్లు పని చేసి ఇంటికి వెళ్తే  కనీసం మాజీ సైనికుడు హోదా కూడా దక్కక పోవడం దారుణమన్నారు. ఈ పథకంలో సైనికుడిగా పనిచేసి వచ్చిన యువకుడికి కనీస పెన్షన్ అవకాశం కూడా ఉండదన్నారు. జీవితంలో అడుగు పెట్టక ముందే ఈ స్కీం వల్ల యువత భవిష్యత్ ముగుస్తుందన్నారు. అనాలోచిత చర్యల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉందన్నారు. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేసిన ఆర్మీ పరీక్ష తిరిగి పెట్టాలని డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్లో కేవలం నిరసనకు మాత్రమే వెళ్ళామని యువకులు చెబుతున్నారని, మరి ఈ కేసులో  నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించిన వారు వేరే ఉన్నారని, అమాయకులను జైల్లో పెట్టారని, ఇంత గుడ్డిగా ఎలా 307 ఐపీసీ ఎలా పెడతారన్నారు. ఈ సెక్షన్ల ప్రకారం ఇంకెన్నడు వాళ్లకు ఉద్యోగాలు రావన్నారు. కోట్లాది మంది యువకుల తరపున నిలబడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. నరేంద్ర మోదీ తీసుకు వచ్చిన దిక్కు మాలిన ఈ అగ్నిపత్ స్కీమ్‌ను రద్దు చేయిస్తామన్నారు.


రాకేష్ అనే యువకుడు చనిపోతే టీఆర్ఎస్ నేతలు ఆ శవన్ని మోశారని, రాజకీయంగా ఆయన మరణాన్ని వాడుకున్నారని రేవంత్ విమర్శించారు. అరెస్టు అయినా వారి తరపున న్యాయవాదులను నియమించి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. వారి తల్లిదండ్రులకు అండగా ఉంటామని, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సహాయం చేయాలని, ఈ కేసులో విచారణ ఆలస్యం అయితే వారి భవిష్యత్ దెబ్బ తింటుందని, వెంటనే కేసుల విచారణ జరగాలని, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. 307 సెక్షన్ లాంటి కేసులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. కేసులను ఎదుర్కొంటున్న వారికి న్యాయ సలహా కోసం  ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టామని, పార్లమెంట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 27న అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు, దీక్షలు చేపడతమని, 27న నర్సంపేటలో రాకేష్ కుటుంబ సభ్యులను పరార్శించి అక్కడే నిరసన తెలుపుతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2022-06-24T19:38:10+05:30 IST