కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి రేవంత్‌ సారీ

ABN , First Publish Date - 2022-08-14T07:36:35+05:30 IST

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం బహిరంగ క్షమాపణ చెప్పారు.

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి రేవంత్‌ సారీ

అద్దంకి వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ బహిరంగ క్షమాపణ

మరోసారి అద్దంకి దయాకర్‌ క్షమాపణలు

రేవంత్‌కు కరోనా?.. మునుగోడులో పాదయాత్ర రద్దు 

మాణిక్కం ఠాగూర్‌ను మార్చే అవకాశం?


హైదరాబాద్‌,ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం బహిరంగ క్షమాపణ చెప్పారు. చండూరు బహిరంగ సభలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌.. వెంకట్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ ఈ క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొంటూ ట్విటర్‌లో వీడియోను పోస్ట్‌ చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యలు, భాష ఎవరికీ మంచిది కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించి, రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన వెంకట్‌రెడ్డిని ఇలా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదన్నారు. బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్‌పై తదుపరి చర్యల కోసం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ చిన్నారెడ్డికి మరో సారి సూచించినట్లు తెలిపారు. మరోవైపు అద్దంకి దయాకర్‌ మరోసారి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెప్పారు. చండూరులో చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం ఔన్నత్యంతో తన తరఫున వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెప్పారని తెలిపారు. తనను సోదరభావంతో క్షమించి పార్టీ కోసం వెంకట్‌రెడ్డి పని చేయాలని కోరారు. 

రేవంత్‌కు కరోనా?

 రేవంత్‌రెడ్డి శనివారం అనారోగ్యానికి గురయ్యారు. కరోనా లక్షణాలుగా అనుమానం రావడంతో నమూనాలను పరీక్షలకు పంపారు. రేవంత్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఏఐసీసీ పిలుపు మేరకు ఆజాదీకా గౌరవ్‌ యాత్రలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో చేపట్టాల్సిన పాదయాత్రను ఆయన రద్దు చేసుకున్నారు. 

Updated Date - 2022-08-14T07:36:35+05:30 IST