మిడతల దండును తరిమికొట్టండి

ABN , First Publish Date - 2020-11-29T07:34:23+05:30 IST

‘‘ఏడేళ్లుగా దోచుకున్నది సరిపోలేదని టీఆర్‌ఎస్‌ నాయకులు మిడత దండువలె మళ్లీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మనపై పడి దోచుకునేందుకు వచ్చారు. వారిని తరిమికొట్టి నగరానికి పట్టిన గులాబీ చీడను వదిలించండి’’

మిడతల దండును తరిమికొట్టండి

నగరానికి పట్టిన గులాబీ చీడను వదిలించండి

టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం మ్యాచ్‌ ఫిక్సింగ్‌:  రేవంత్‌


ఉప్పల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏడేళ్లుగా దోచుకున్నది సరిపోలేదని టీఆర్‌ఎస్‌ నాయకులు మిడత దండువలె మళ్లీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మనపై పడి దోచుకునేందుకు వచ్చారు. వారిని తరిమికొట్టి నగరానికి పట్టిన గులాబీ చీడను వదిలించండి’’ అని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన ఉప్పల్‌ రోడ్‌ షోలో ప్రసంగించారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లయితే కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో పడుకుంటే టీఆర్‌ఎస్‌ గెలవాలి కదా..? మరి ఎందుకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నగరంపై మిడతల దండువలె దండెత్తి ప్రచారం చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టే కేసీఆర్‌కు భయం పట్టుకుందని అన్నారు. నగరానికి రూ.67 వేల కోట్లు ఖర్చుపెట్టామని చెబుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ నిధులు ఎవరి జేబులకు పోయాయో చెప్పాలని ప్రశ్నించారు.


కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి చిల్లి గవ్వ తేలేదు కానీ, ఇప్పుడు కార్పొరేటర్లుగా గెలిపిస్తే కేంద్రం నిధులు తెస్తామని చెబితే హైదరాబాద్‌ ప్రజలు నమ్మరని చెప్పారు. మతం పేరుతో చిచ్చు పెడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశించి అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు కలిసి ఎంఐఎంను అడ్డుపెట్టుకొని ఆడుతున్న నాటకాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఆ మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ 20 ఏళ్ల కాలంలో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే వారి అండతో ప్రశ్నించే గొంతుకనై కడుపులో పేగులు తేగేదాకా పేదోళ్ల కోసం ప్రభుత్వంతో కొట్లాడతానని రేవంత్‌ హామీ ఇచ్చారు.


ప్రధాని పర్యటనకు నాకూ ఆహ్వానం లేదు

ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి స్థానిక ఎంపీనైన తనకూ ఆహ్వానం అందలేదని, ఇది ప్రజాప్రతినిధిని అవమానించడమేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది సంప్రదాయాలకు విరుద్ధమని, ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లి నిరసన తెలియజేస్తానన్నారు.

Updated Date - 2020-11-29T07:34:23+05:30 IST