రిటైర్మెంట్‌ ప్రణాళిక పక్కాగా..

ABN , First Publish Date - 2021-02-21T07:24:58+05:30 IST

పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం పెద్ద మొత్తంలో పోగేసుకోవాలనుకునే వారు.. సరైన పెట్టుబడి పథకాలను ఎంచుకోవడం ఎంతో కీలకం. రిస్క్‌, రిటర్నులు, స్థిరత్వం, పన్నులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు రిటైర్మెంట్‌ లక్ష్యాలను సాధించగలిగే పెట్టుబడి సాధనాన్ని...

రిటైర్మెంట్‌ ప్రణాళిక పక్కాగా..

  • యులిప్స్‌.. ఎన్‌పీఎస్‌.. ఈక్విటీ ఫండ్స్‌.. ఈపీఎఫ్‌ 
  • పదవీ విరమణ ప్లానింగ్‌కు ఎందులో పెట్టుబడి మేలు..?

పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం పెద్ద మొత్తంలో పోగేసుకోవాలనుకునే వారు.. సరైన పెట్టుబడి పథకాలను ఎంచుకోవడం ఎంతో కీలకం. రిస్క్‌, రిటర్నులు, స్థిరత్వం, పన్నులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు రిటైర్మెంట్‌ లక్ష్యాలను సాధించగలిగే పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవాలి. మెరుగైన ప్రతిఫలాల కోసం ఏళ్ల తరబడి ఓపిక, పెట్టుబడుల్లో క్రమశిక్షణ ఎంతో అవసరం. అంతేకాదు, భవిష్యత్‌లో చోటుచేసుకునే ఆకస్మిక, విధానపరమైన మార్పులకు అనుగుణంగా పెట్టుబడుల్లో సర్దుబాట్లు చేసుకోగలిగే నేర్పు, సమయస్ఫూర్తీ ముఖ్యమే. పదవీ విరమణ నిధి ప్రణాళికకు ఉపయోగపడే కొన్ని పెట్టుబడి పథకాల వివరాలు.. 



యూనిట్‌ లింక్డ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ పాలసీ

పెట్టుబడులపై రిటర్నులు పంచడంతో పాటు జీవిత బీమా కవరేజీ కల్పించగలిగే ఆర్థిక సాధనమే యూనిట్‌ లింక్డ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్లాన్స్‌ (యులి్‌ప్స్‌). అంతేకాదు, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 80సీ ప్రకారంగా.. రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపూ పొందే అవకాశం ఉంటుంది. ఇంతక్రితం సమ్‌అష్యూర్డ్‌లో ప్రీమియం 10 శాతానికి మించనంత వరకు యులి్‌ప్సకు ఎలాంటి పన్ను లేదు. కానీ, వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించే యులిప్‌ పెట్టుబడులపై ఇక పన్ను చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్‌ 2021-22 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా ఏదేని ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక మూలధన ఆర్జన (ఎల్‌టీసీజీ) రూ.లక్ష దాటితే, ఆ మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.2.5 లక్షలకు మించిన వార్షిక ప్రీమియం యులి్‌ప్సకు సైతం ఇదే పన్ను వర్తించనుంది. కాబట్టి, పన్ను ఆదా కోసం మీరు ప్రధానంగా యులి్‌పలపైనే ఆధారపడుతున్నట్లయితే, మీ వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించుతున్నట్లయితే మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరింత మెరుగైన రిటర్నులు, పన్ను రాయితీ కల్పించే పథకాలపై దృష్టిపెట్టడం మేలు. 


ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ 

అధిక రిస్క్‌, రిటర్నులతో కూడిన ఆర్థిక సాధనమిది. రిస్క్‌ తీసుకోగలిగే వెసులుబాటు ఉన్నట్లయితే, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులపై దీర్ఘకాలంలో అధిక రిటర్నులు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఫండ్ల రిటర్నుల రేటు పూర్తిగా స్టాక్‌ మార్కెట్‌ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మీ వయసు, రిస్క్‌ను భరించగలిగే సామర్థ్యం, ఆశిస్తున్న రిటర్నుల ఆధారంగా ఈక్విటీ ఫండ్లలో ఎంత పెట్టుబడులు పెట్టాలనేది నిర్ణయించుకోవాలి. అయితే, రిటైర్మెంట్‌ వయసు దగ్గరపడే కొద్దీ రిస్క్‌ను తగ్గించుకునేందుకు ఇందులోని పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటూ రావడం ఉత్తమం.  


నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ 

రిటైర్మెంట్‌ ప్లానింగ్‌లో పూర్తిగా ఈక్విటీ లేదా డెట్‌ సాధనాలపై ఆధారపడటం తగదు. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) మీకు ఈక్విటీతో పాటు డెట్‌ సాధనాల్లోనూ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తుంది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై సెక్షన్‌ 80సీ ప్రకారం ఏటా రూ.1.5 లక్షలతో పాటు సెక్షన్‌ 80సీసీడీ కింద మరో రూ.50వేల వరకు పన్ను మినహాయింపు అవకాశం లభిస్తుంది. అలాగే, పదవీ విరమణ తర్వాత ఎన్‌పీఎస్‌ నిధి నుంచి 60 శాతం వరకు ఉపసంహరణపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా 40 శాతం సొమ్మును మాత్రం తప్పనిసరిగా యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఆ పథకాలపై లభించే వార్షిక ఆదాయంపై మీకు వర్తించే ఐటీ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెట్టుబడుల్లో వెసులుబాటు, ప్రతిఫలాల పరంగా చూస్తే ఎన్‌పీఎస్‌ మంచి ఎంపిక అవుతుంది. కానీ, రిటైర్మెంట్‌ తర్వాత మెచ్యూరిటీ సొమ్మును పూర్తిగా ఉపసంహరించుకోలేకపోవడంతో పాటు యాన్యుటీ పథకాల్లో తప్పక పెట్టాల్సిన పెట్టుబడిపై పన్ను చెల్లించాల్సి రావడం మాత్రం కొంత ప్రతికూలమే. 


ప్రావిడెంట్‌ ఫండ్‌ 

పెట్టుబడుల భద్రత, రిటర్నులపరంగా వేతన జీవులకు ప్రావిడెండ్‌ ఫండ్‌ ఉత్తమ పొదుపు మార్గం. ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకులు ఆఫర్‌ చేసే వడ్డీ రేటు 6.5 శాతం లోపే. అదే, ఎంప్లాయీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) చెల్లిస్తున్న వార్షిక వడ్డీ 8.5 శాతంగా ఉంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్స్‌ (పీపీఎఫ్‌) సైతం ఏటా 7.9 శాతం మేర వడ్డీ చెలిస్తున్నాయి. పైగా,  పీఎఫ్‌ ఖాతాలో జమ చేసే సొమ్ముపై సెక్షన్‌ 80 సీ ప్రకారం పన్ను రాయితీ కూడా పొందవచ్చు. కాకపోతే, ఈ ఏప్రిల్‌ 1 నుంచి పీఎఫ్‌ ఖాతాలో జమయ్యే వార్షిక సొమ్ము రూ.2.5 లక్షలకు మించితే దానిపై లభించే వడ్డీపై పన్ను వసూలు చేయనున్నట్లు ఈ సారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. 



తుదిపలుకు

రిటైర్మెంట్‌ ప్లానింగ్‌లో మెరుగైన, స్థిరమైన ప్రతిఫలాల కోసం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో సమతుల్యతను పాటించాలి. యులిప్స్‌, ఎన్‌పీఎస్‌, ఈపీఎఫ్‌, ఈక్విటీ ఫండ్లతోపాటు డెట్‌ పథకాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం, రియల్‌ ఎస్టేట్‌లోనూ పెట్టుబడులు పెట్టగలిగితే దీర్ఘకాలంలో అధిక ప్రతిఫలాలు అందుకోవచ్చు. 

- అదిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌ 

Updated Date - 2021-02-21T07:24:58+05:30 IST