62 ఏళ్లకు రిటైర్మెంట్‌

ABN , First Publish Date - 2022-01-08T07:51:59+05:30 IST

‘‘మంచి ఫిట్‌మెంట్‌ ఇవ్వండి! హెచ్‌ఆర్‌ఏ తగ్గించకండి’’ అని

62  ఏళ్లకు రిటైర్మెంట్‌

  • పైసల్లేక  పెంపునకు కారణం అదే..
  • పదవీ విరమణ ప్రయోజనాలు రెండేళ్లువాయిదా
  • సంఘాల నేతలను మచ్చిక చేసుకునే వ్యూహం?
  • కొత్త కొలువులు, పదోన్నతులూ మరింత ఆలస్యం
  • ప్రేమ ఉంటే పెండింగ్‌ సొమ్ములివ్వాలని డిమాండ్‌



‘అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తాం’ అని ఎన్నికల ముందు ప్రకటించిన జగన్‌... ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రెండున్నరేళ్ల తర్వాత, ఈ సమస్యను మరో ఆరు నెలలు దాట వేశారు. రిటైర్మెంట్‌ వయసు పెంచుతున్నట్లు సీఎం చెప్పగానే... ఉద్యోగ సంఘాల నేతలు బాగా హర్షం వ్యక్తం చేశారు. ఫిట్‌మెంట్‌ సంగతి పక్కనపెడితే... మిగిలినవన్నీ బాగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. 


అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ‘‘మంచి ఫిట్‌మెంట్‌ ఇవ్వండి! హెచ్‌ఆర్‌ఏ తగ్గించకండి’’ అని ఉద్యోగులంతా కోరుకుంటుండగా... వారెవరూ ఆశించని, ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వం పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచేసింది. ‘‘ఉద్యోగుల సమస్యలపట్ల మా ప్రభుత్వం గుండె, మనసుతో స్పందిస్తుంది. మీ అనుభవాన్ని మరింత వాడుకుంటాం’’ అని చెబుతూ ముఖ్యమంత్రి జగన్‌ పదవీ  విరమణ వయసు పెంపు ప్రకటన చేశారు. ఇది చేసింది తమపై ప్రేమతో కాదని, పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వలేక సతమతమవుతూ, చెల్లింపులను రెండేళ్లు వాయిదా వేసేందుకే రిటైర్మెంట్‌ వయసును పెంచారని ఉద్యోగులు ముక్తకంఠంతో చెబుతున్నారు. దీని వెనుక ఉద్యోగ సంఘాల నాయకులను మచ్చిక చేసుకునే వ్యూహం కూడా ఉందని అనుమానిస్తున్నారు. ‘‘పదవీ విరమణ వయసు పెంపుపై ప్రకటన చేయగానే ఉద్యోగ సంఘాల నేతలు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. వారిలో అత్యధికులు రిటైర్మెంట్‌కు చాలా దగ్గర్లో ఉండటమే దీనికి కారణం’’ అని చెబుతున్నారు. తమపై నిజం గా ప్రేమ ఉంటే ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్‌, జీఎల్‌ఐ, పీఎఫ్‌, గ్రాట్యుటీ ఇతర ప్రయోజనాలు దాదాపు రూ.2200 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. 


అసలు కారణం ఇదే...

ప్రతినెలా జీతాలు, పెన్షన్ల చెల్లింపునకు సర్కారు సతమతమవుతోంది. ఈ క్రమంలో రిటైర్‌ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలనూ అందించలేకపోతోంది. ఒక్కో ఉద్యోగికి రిటైర్మెంట్‌ ప్రయోజనాలు లక్షల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా వారు సర్వీసులో పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, ఈఎల్స్‌  రూపంలో దాచుకున్న సొమ్మే! ప్రభుత్వం వైపు నుంచి గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది. పదవీ విరమణ వయసు పెంపుద్వారా... రెండేళ్లపాటు ఈ చెల్లింపులను వాయిదా వేసిందని ఉద్యోగులు చెబుతున్నారు. ‘‘2024లోపు రిటైర్‌ అయ్యే ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంది. వారందరికీ ఆర్థిక ప్రయోజనాలు అందించలేని దిక్కుతోచని స్థితిలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండేళ్లు ఉద్యోగులకు పైసా ఇవ్వకుండా నెట్టుకొచ్చేందుకు వేసిన ప్లాన్‌ ఇది’’ అని బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న వేల కోట్ల రూపాయలు వాడేసిందని, ఇప్పుడు వాటిని వెనక్కి తిరిగిచ్చే శక్తిలేక... మళ్లీ ఎన్నికల వరకు తప్పించుకునే ఉద్దేశంతోనే రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచిందని పేర్కొంటున్నారు. 



అప్పుడు 58 నుంచి 60కి....

చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే... రిటైర్‌ర్మెంట్‌ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో అందరూ దీనిని స్వాగతించారు. అయితే... ఇప్పుడు జగన్‌ సర్కారు ఎలాంటి సంకేతాలు పంపించకుండానే, ఎవరూ అడక్కుండానే పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేసింది. తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 61 ఏళ్లు. డాక్టర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్‌ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉందని చెబుతున్నారు. ‘అనుభవాన్ని ఉపయోగించుకుంటాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నప్పటికీ... అది వైద్యులు, ప్రొఫెసర్ల వంటి కొందరి విషయంలోనే సహేతుకంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఉద్యోగులకు డబ్బులివ్వలేక రిటైర్మెంట్‌ వయసును పెంచారని అభిప్రాయపడుతున్నారు.




కొత్త కొలువులు క్లోజ్‌..

ఉద్యోగాలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని... ఏటా క్రమం తప్పకుండా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని జగన్‌ సర్కారు గతంలో హామీ ఇచ్చింది. ‘62 ఏళ్ల’తో దీనినీ అటకెక్కించినట్లేనని చెబుతున్నారు. కొలువులు ఖాళీ కావు కాబట్టి... కొత్తగా ఉద్యోగాలూ రావు. గ్రూప్స్‌ ఉద్యోగాలు, గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌, ఇంజనీరింగ్‌ విభాగాల్లో నియామకాలు మళ్లీ ఎన్నికల వరకు చేపట్టబోయేది లేదంటూ చెప్పకనే చెప్పినట్లే! మరోవైపు... ఉద్యోగుల పదోన్నతులపైనా దీని ప్రభావం పడుతుంది. దీనివల్ల ఏళ్లతరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశ తప్పదు.


Updated Date - 2022-01-08T07:51:59+05:30 IST