NRI: వృద్ధాప్యంలో కోట్లు కొల్లగొట్టిన జంట.. చిన్న లోపాన్ని ఆసరాగా చేసుకుని.. వీరి కథ వింటే షాకైపోవాల్సిందే..

ABN , First Publish Date - 2022-08-20T01:39:16+05:30 IST

లాటరీ‌లో గెలవాలంటే అదృష్టం ఉండాలా..? అంటే అవునని చాలా మంది చెబుతారు. కాలం కలిసొస్తేనే జాక్ పాట్ తగులుతుందని బల్ల గుద్దీ మరీ వాదిస్తారు. కానీ.. అమెరికాలోని ఓ వృద్ధ జంట మాత్రం లెక్కలేసి మరీ లక్‌ను సొంతం చేసుకుంది.

NRI: వృద్ధాప్యంలో కోట్లు కొల్లగొట్టిన జంట.. చిన్న లోపాన్ని ఆసరాగా చేసుకుని..  వీరి కథ వింటే షాకైపోవాల్సిందే..

ఎన్నారై డెస్క్: లాటరీ‌ గెలవాలంటే అదృష్టం ఉండాలా..? అంటే అవునని చాలా మంది చెబుతారు. కాలం కలిసొస్తేనే జాక్‌పాట్ తగులుతుందని బల్ల గుద్దీ మరీ వాదిస్తారు. కానీ.. అమెరికాలోని ఓ వృద్ధ జంట మాత్రం లెక్కలేసి మరీ లక్‌ను సొంతం చేసుకుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసి కోట్లు కొల్లగొట్టింది. ఇటీవలే వారి జీవితం ఆధారంగా ఓ సినిమా రూపుదిద్దుకుంది.  జెర్రీ అండ్ మార్జ్ గో లార్జ్(Jerry and Marge go large) పేరిట నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్రిటిక్స్ మెప్పు కూడా పొందింది. ప్రఖ్యాత నటుడు బ్రయన్ క్రాన్‌స్టన్ (Bryan Cranston) ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించారు. అసలు ఈ సినిమాకు ఆధారమైన ఆ వృద్ధ జంట కథేంటంటే.. 


జెర్రీ సెల్బీ, మార్జ్ సెల్బీ దంపతులు మిషిగన్‌(Michigan) రాష్ట్రంలో నివసిస్తుంటారు. వారు 2003లోనే ఉద్యోగ విరమణ చేశారు. ఇక కుటుంబ పెద్ద జెర్రీకి గణితంపై మంచి పట్టుంది. లాటరీ ఆట మొత్తం అంకెల గారడీ అని నమ్ముతారు. కాస్తంత నిశితంగా పరిశీలిస్తే.. ఎప్పుడు గెలుపు ఇంటి తలుపు తట్టుతుందో చెప్పేయచ్చంటారు.  ఇక రిటైర్మెంట్ తరువాత..ఆయన విన్‌ఫాల్(Winfall) లాటరీల ఒరవడిని గమనించారు. స్థానికంగా నిర్వహించే ఈ లాటరీలో జాక్‌పాట్ ఎలా తగిలిందీ,  ఒక్కో టిక్కెట్‌కు ఖర్చు ఎంత పెట్టాలి, ఎవరు ఎప్పుడు ఓడిపోతున్నారు..? ఎవరికీ జాక్‌పాట్ రాని సందర్భంలో ఏం జరుగుతుంది..  తదితర అంశాలను జాగ్రత్తగా పరిశీలించారు. ఓ క్రమ పద్ధతిలో టిక్కెట్లు కొంటే లాటరీలో గెలుపొందే అవకాశాలు మెరుగవుతాయన్న నిర్ధారణకు వచ్చారు.  పక్కాగా లెక్కలు వేసి టిక్కెట్లు కొన్నారు. ఈ క్రమంలో ఆయన అంచనాలు నిజమవడంతో క్రమంగా కనకవర్షం మొదలైంది. 


లాటరీలో గెలుపు ఓటముల తీరు తెన్నుల్లో ఓ ఒరవడి తన కంట పడిందని జెర్రీ చెప్పుకొచ్చారు. అదే తనపై కనకవర్షం కురిపించిందన్నారు. సాధారణంగా లాటరీ సంస్థలు ఇటువంటి వాటికి ఆస్కారం లేని విధంగా ఆటను రూపొందిస్తాయి. కానీ..విన్‌ఫాల్ విషయంలో మాత్రం ఇలా జరగకపోవడంతో లాటరీలో లోపం జెర్రీ కంట పడింది. దీన్ని జెర్రీ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ప్రతి ఆరు వారాలకు ఒకసారి తాను ఎంతో కొంత గెలుచుకునే వాణ్ణి అని ఆయన చెప్పుకొచ్చారు. మొదట్లో కొంత డబ్బు కోల్పోయానని చెప్పారు. ఆ తరువాత.. ఆటను జాగ్రత్తగా పరిశీలించి విజయం అందుకున్నానని అన్నారు. మొదటి సారి రూ.1.75 లక్షల(సుమారు 2200 డాలర్లు) కోసం జెర్రీ లాటరీ ఆడితే ఆయన అంచనాలు తప్పాయి. చివరకు రూ. 4 వేల నష్టం వచ్చింది. రెండోమారు దాదాపు మూడు లక్షల కోసం ప్రయత్నిస్తే ఏకంగా రూ.5 లక్షలు ఒళ్లోపడింది. ఇక మూడో మారు కూడా 12 లక్షలు చేతికందింది. 


దీంతో.. జెర్రీలో ఉత్సాహం మరింత పెరిగింది. మెల్లగా పెద్ద మొత్తంలో ఖర్చు చేసేవారు.  తొలుత ఈ కథంతా భార్యకు తెలియకుండానే జెర్రీ నడిపిచ్చేవారు. రిటైర్‌మెంట్ తరువాత వచ్చిన సొమ్మంతా లాటరీలపై ఖర్చు చేసేవారు. టిక్కెట్లపై పెట్టిన పెట్టుబడికంటే ఎక్కువే సంపాదించేవారు. ఇలాంటి వరుస విజయాలతో ఆయనలో ధైర్యం పెరిగింది. విషయం భార్యకు చెప్పారు. గణిత శాస్త్రంలో జెర్రీకున్న ప్రావీణ్యంపై ఆయన భార్యకు గొప్ప నమ్మకం. దీంతో.. విషయం తెలిసిన వెంటనే ఆమె కూడా రంగంలోకి దిగారు. అలా.. ఆ జంట కోట్లు కొల్లగొట్టారు. ఇలా మొత్తం 26 మిలియన్ డాలర్లను వారు సంపాదించారు. ఇంత భారీ మొత్తంలో ఆర్జిస్తుండటంతో కొందరికి అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అయితే.. వారు చట్టపరమైన తప్పేదీ చేయకపోవడంతో ఎటువంటి సమస్యా ఎదురు కాలేదు. చిన్న నోటిలెక్క వేసి లాటరీలో జరుగుతున్నదేమిటో కనిపెట్టేశానని అప్పట్లో జెర్రీ చెప్పుకొచ్చారు. ఇది ఇతరులెవరి కంటా పడకపోవడం ఆశ్చర్యమేనని వ్యాఖ్యానించారు. అయితే.. ఆ జంట తమ డబ్బంతా మనవలు, మనవరాళ్లు చదువులు ఇతర అవసరాలపై ఖర్చు చేసింది. డబ్బు కంటే కూడా లాటరీలో విజయమే తమకు ఎక్కువ కిక్ ఇచ్చిందని ఆ దంపతులు చెప్పుకొచ్చారు.  



Updated Date - 2022-08-20T01:39:16+05:30 IST