విశ్రాంత ఉపాధ్యాయుడికి టోకరా

ABN , First Publish Date - 2022-05-19T05:53:23+05:30 IST

నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస సెంటర్‌లో ఉన్న ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీఎం కేంద్రంలో విశ్రాంత ఉపాధ్యాయుడికి చేదు అనుభవం ఎదురైంది.

విశ్రాంత ఉపాధ్యాయుడికి టోకరా

  1.  ఏటీఎం కార్డు మార్చి రూ.40 వేలు స్వాహా 


నంద్యాల (నూనెపల్లె), మే 18: నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస సెంటర్‌లో ఉన్న ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీఎం కేంద్రంలో విశ్రాంత ఉపాధ్యాయుడికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం నూతన ఏటీఎం కార్డుకు పిన్‌ నెంబర్‌ జనరేట్‌ చేసుకునేందుకు వచ్చి గుర్తు తెలియని వ్యక్తి చేతిలో మోసపోయాడు. విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు నూతన ఏటీఎం కార్డుకు పిన్‌ నెంబర్‌ జనరేట్‌ చేసుకునేందుకు ప్రధాన శాఖ ఏటీఎం కేంద్రానికి వచ్చాడు. మొదట ఏటీఎం కేంద్రం సెక్యూరిటీ గార్డుతో పిన్‌ జనరేట్‌ చేయగా, తన దగ్గర ఉన్న చిన్న మొబైల్‌కు ఓటీపీ నెంబర్‌ రాలేదు. దీంతో పక్కనే ఉన్న గుర్తు తెలియని యువకుడికి కార్డు ఇచ్చి పిన్‌ జనరేట్‌ చేయమని అడిగాడు. బ్యాంకు వద్దే ఉన్న మరో ప్రభుత్వ ఉపాధ్యా యుడు జ్ఞాన మద్దయ్య విషయం గమనించి సెల్‌ఫోన్‌ సమస్య కారణంతో ఓటీపీ నెంబర్‌ రావడం లేదని గ్రహించి విశ్రాంత ఉపాధ్యాయుడి సీమ్‌ కార్డును మద్దయ్య సెల్‌ఫోన్‌లో వేసి ఓటీపీ చెప్పాడు. తర్వాత తిరిగి సీమ్‌ కార్డును శ్రీనివాసరావుకు అప్పగించాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం కార్డును మార్చి శ్రీనివాసరావుకు ఇచ్చాడు. ఏటీఎం కార్డుతో లోనికి వెళ్లి నగదు తీసుకునేందుకు ప్రయత్నించగా కార్డు బ్లాక్‌ అని సమాచారం వచ్చింది. కార్డును పరిశీలించగా తనది కాదని తెలిసింది. వెంటనే బ్యాంకు లోనికి వెళ్లి తన అకౌంట్‌ నెంబర్‌ను హోల్డ్‌లో పెట్టి ఏటీఎంను రద్దు చేసుకున్నాడు. ఖాతాలోని నగదును సరిచూసుకోగా 3 నిమిషాల వ్యవధిలో 4సార్లు రూ.40వేలు నగదును గుర్తు తెలియని వ్యక్తి డ్రా చేసినట్లు బ్యాంకు అధికారి చెప్పారు. దీంతో ఖంగుతిన్న విశ్రాంత ఉపాధ్యాయుడు వన్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే స్టేట్‌బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ ప్రసాదరెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఏటీఎం కేంద్రంలోని సీసీ పుటేజీలో తారసలాడిన ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫొటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2022-05-19T05:53:23+05:30 IST