అశ్విన్‌ ‘రిటైర్డ్‌ అవుట్‌’ వెనుక..

ABN , First Publish Date - 2022-04-12T10:29:38+05:30 IST

ఆధునిక క్రికెట్‌లో మైదానంలో ఆడే ఆటతోపాటు.. మైండ్‌గేమ్‌ కూడా ఎంతో కీలకం. క్రికెట్‌లో సరికొత్త ఒరవడి సృష్టించిన టీ20లకు క్రేజ్‌ పెరిగాక.. పరిస్థితులకు తగ్టట్టుగా వ్యూహాలు..

అశ్విన్‌ ‘రిటైర్డ్‌ అవుట్‌’ వెనుక..

న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్‌లో మైదానంలో ఆడే ఆటతోపాటు.. మైండ్‌గేమ్‌ కూడా ఎంతో కీలకం. క్రికెట్‌లో సరికొత్త ఒరవడి సృష్టించిన టీ20లకు క్రేజ్‌ పెరిగాక.. పరిస్థితులకు తగ్టట్టుగా వ్యూహాలు మార్చడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా అదేస్థాయిలో పెరిగింది. ఐపీఎల్‌లో ఆదివారం లఖ్‌నవూతో మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు అశ్విన్‌ తీసుకున్న అలాంటి సంచలనాత్మక నిర్ణయం.. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అశ్విన్‌ 23 బంతుల్లో 28 పరుగులు చేసిన అనంతరం 18.2 ఓవర్‌లో ‘రిటైర్డ్‌ అవుట్‌’గా వెనుదిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్‌ పరాగ్‌ 4 బంతుల్లో 8 పరుగులు చేశాడు. అయితే, ఎలాంటి గాయం కాకుండా అశ్విన్‌ మైదానాన్ని వీడడంతో.. ఏ జరిగిందో వీక్షకులకు ఓపట్టాన అర్థం కాలేదు.


ఎందుకంటే ఇలాంటి రూల్‌ ఒకటుందని చాలా మందికి తెలియకపోవడమే అందుకు కారణం. ఐపీఎల్‌లో తొలి రిటైర్డ్‌ అవుట్‌గా అశ్విన్‌ సరికొత్త చరిత్ర సృష్టించినా.. అదంతా గేమ్‌ ప్లాన్‌లో భాగమేనని రాజస్థాన్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. జట్టు అవసరాలమేరకు ‘రిటైర్డ్‌’ ఎత్తుగడను అమలు చేయాలని సీజన్‌ ఆరంభానికి ముందే చర్చించినట్టు చెప్పింది. అందరి సమ్మతితోనే ఈ ప్లాన్‌ను అమలు చేసినట్టు పేర్కొంది. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ 3 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత గేమ్‌ప్లాన్‌ వర్కవుట్‌ అయినట్టుగానే అనిపిస్తోంది. ‘అశ్విన్‌ రిటైర్డ్‌ అవుట్‌ కావడం టీ20 క్రికెట్‌లో ఓ సరికొత్త వ్యూహం. 21వ శతాబ్దపు క్రికెట్‌లో నవీన రీతిలో ఆలోచించాల్సిన అవసరాన్ని కల్పిస్తుంద’ని వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు ఇయాన్‌ బిషప్‌ ట్వీట్‌ చేశాడు. 


నిబంధనలు ఏం చెబుతున్నాయి..

ఎంసీసీ రూల్‌ 25.4.1 ప్రకారం బాల్‌ డెడ్‌ అయిన తర్వాత అంపైర్‌కు సమాచారం అందించి.. బ్యాటర్‌ ‘రిటైర్డ్‌ అవుట్‌’ కావచ్చు. కానీ, అతడు మళ్లీ బ్యాటింగ్‌కు రావడానికి వీల్లేదు. తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే ప్రత్యర్థి కెప్టెన్‌ అంగీకారంతో తిరిగి ఆడే అవకాశం ఉంటుంది. అదే గాయపడడం లేదా అనారోగ్యం లాంటి కారణాల రీత్యా మైదానం వీడితే (రూల్‌ 25.4.2) మాత్రం మళ్లీ ఆడే చాన్స్‌ ఉంటుంది. ఒకవేళ క్రీజులోకి రాలేక పోతే ‘రిటైర్డ్‌-నాటౌట్‌’గా నమోదు చేస్తారు. 


వికెట్‌ త్యాగం చేశాడు

 జట్టు ప్రయోజనాల కోసం అశ్విన్‌ తన వికెట్‌ను త్యాగం చేశాడు. రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరుగుతానని అతడు.. మైదానం నుంచే మమ్మల్ని అడిగాడు. దీంతో మేము అప్పటికప్పుడు చర్చించుకొని ఈ నిర్ణయం తీసుకొన్నాం.         

రాజస్థాన్‌ కోచ్‌, డైరెక్టర్‌ సంగక్కర

Updated Date - 2022-04-12T10:29:38+05:30 IST