వాస్తవాలకు దూరంగా విపరీత వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-18T06:08:49+05:30 IST

న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన కుసంస్కారులపై కేసులు పెట్టడాన్ని చంద్రు తప్పుపట్టడం ఆశ్చర్యం కలిగించింది. సీఎంను తిట్టారనో, మంత్రిని తిట్టారనో....

వాస్తవాలకు దూరంగా విపరీత వ్యాఖ్యలు

న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన కుసంస్కారులపై కేసులు పెట్టడాన్ని చంద్రు తప్పుపట్టడం ఆశ్చర్యం కలిగించింది. సీఎంను తిట్టారనో, మంత్రిని తిట్టారనో ఏకంగా దేశ ద్రోహ కేసులే పెడుతున్నప్పుడు, న్యాయమూర్తులను తిడితే కనీసం వ్యవస్థ విశ్వసనీయత నిలబెట్టడానికైనా చర్యలు తీసుకోవద్దా?


మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు అంటే ప్రగతిశీల శక్తులకు అపారమైన గౌరవం. పౌర హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఉద్యమకారులకు ఆయన స్ఫూర్తి. అయితే జస్టిస్‌ చంద్రు విజయవాడ వేదికగా ఇటీవల చేసిన వ్యాఖ్యలు మాత్రం నిస్సంకోచంగా వివాదాస్పదమైనవి. ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలపై సంపూర్ణ అవగాహనతో ఆ వ్యాఖ్యలు చేసినట్లు అనిపించడం లేదు. న్యాయస్థానాల్లో ‘పిల్’ వేస్తే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదని, కోర్టు ఆదేశాలతో తప్ప ప్రజాప్రయోజనాలు పరిరక్షింపబడటం లేదని ఏపీసీఎల్ఏ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ వివరించిన పరిస్థితిని కూడా చంద్రు పట్టించుకోకుండా ముందుగా సిద్ధం చేసుకొని వచ్చిన ప్రసంగాన్నే ఇక్కడ చేశారని అనిపిస్తున్నది.


చంద్రు అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపక్షాలతో పోరాటాలు చేయాలో, ప్రతిపక్షమే ప్రభుత్వంతో పోరాటం చేయాలో అప్రస్తుతం కానీ, ఈ ప్రభుత్వం న్యాయస్థానాలలో మాత్రం పోరాడవలసి వస్తున్నది. న్యాయస్థానాలలో పోరాటాన్ని న్యాయవ్యవస్థతో పోరాటంగా ఎలా చిత్రీకరిస్తారు? ఆయినా న్యాయస్థానాలలో పోరాడాల్సిన పరిస్థితికి బాధ్యులెవరు? లోపభూయిష్టమైన, ఏకపక్షమైన, నిరంకుశమైన విధానాలు అమలుచేస్తున్న ప్రభుత్వమా! లేదా! వాటిని న్యాయస్థానాలలో తప్ప అడ్డుకోలేకపోతున్న ప్రజలదా? మేధావులదా? ప్రతిపక్ష నేతలదా? లేదా న్యాయవ్యవస్థదా? మీరే అన్నట్లు.. హైకోర్టు తీర్పు చెప్పక ముందరే, మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటూ ‘లోపాల’ను పరిహరించి సమగ్రంగా మళ్లీ ఇదే బిల్లును పెడతామని ప్రభుత్వం చేసిన ప్రకటనలోనే ‘లోపం ప్రభుత్వానిదే’నని అర్థమవుతోంది కదా!.


ఇక ప్రతి అంశంలోనూ ఒక కోర్టు వ్యతిరేక తీర్పు ఇస్తే మరో కోర్టుకు, ఆ కోర్టూ అలాగే తీర్పు ఇస్తే బెంచ్‌కూ వెళుతున్నది ప్రభుత్వమే కదా! కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలో పదుల సంఖ్యలో వ్యతిరేక తీర్పులు వచ్చిన ప్రభుత్వానికి మీ అన్యాపదేశ వత్తాసు ఆశ్చర్యం కలిగిస్తున్నది. మీరు పుట్టి పెరిగిన తమిళనాడు రాష్ట్రంలో మాతృభాషలో చదువును ఎత్తి వేస్తే మీరు ఊరుకుంటారా? కానీ ఇక్కడ మళ్లీ తెలుగు మీడియం తెచ్చుకోవడానికి ప్రజలు కోర్టుకే వెళ్లవలసి వచ్చింది. ఒక విద్యార్థి, యువజన వామపక్ష నేతగా ఉన్నప్పుడు గానీ న్యాయవాదిగా ఉన్న కాలంలో కానీ రాజ్యహింసపై పోరాటం చేసిన మీరు ఇప్పుడు పరోక్షంగానైనా ఒక ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం వేదన కలిగిస్తున్నది.


హైకోర్టు విచారణలో ఉన్న మూడు రాజధానుల అంశంపై జస్టిస్‌ చంద్రు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగానూ అనిపించాయి. అమరావతి రాజధాని అంశంపై సంపూర్ణ అవగాహనతోనే ఆయన వ్యాఖ్యలు చేశారా! అనే అనుమానం వస్తున్నది. రాజధాని కేసులపై విచారణ చేస్తున్న హైకోర్టు బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపాన్ని ధర్మాసనం తిరస్కరించడాన్ని ఆయన ప్రశ్నించడంలో కూడా ఔచిత్యం కనపడడం లేదు. వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్డియే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వమే రద్దు చేసి, హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేయడానికి అదే కారణమన్న భావనను ఆయన వ్యక్తం చేయడం అసంబద్ధంగానూ ఉన్నది. అమరావతి భూకుంభకోణం ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పిన న్యాయమూర్తులను, ప్రతిపక్షాలను ఒకే గాటన కట్టేసి బహిరంగంగా మీడియాలో తిట్లు శాపనార్థాలతో వ్యాఖ్యానిస్తే ఇక వ్యవస్థల విశ్వసనీయత ఎక్కడ నిలబడుతుంది? న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన కుసంస్కారులపై కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టడం ఆశ్చర్యం కలిగించింది. సీఎంను తిట్టారనో, మంత్రిని తిట్టారనో దేశ ద్రోహ కేసులు పెడుతున్నప్పుడు, న్యాయమూర్తులను తిడితే కనీసం వ్యవస్థ విశ్వసనీయత నిలబెట్టడానికైనా చర్యలు తీసుకోవద్దా? పౌరుడికైనా వ్యవస్థకైనా విశ్వసనీయత అనేది ఒక గౌరవం. మనుగడకు అది అవసరం. రాజ్యాంగానికి కట్టుబడకుండా ఏ వ్యవస్థలు వ్యవహరించినా తప్పే. రాజ్యాంగం ప్రకారం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న జీవోలను నిలుపుదల చేసి వాటి రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించే అధికారం న్యాయవ్యవస్థలకు లేదా? 


భారత రాజ్యాంగం కల్పించిన మానవహక్కులు, పౌర హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అనుభవిస్తున్నారా లేదా అనే విషయాన్ని చంద్రు పరిశీలించి ప్రస్తావించాల్సి ఉంది. గత ప్రభుత్వం లో కానీ ఇప్పుడు కానీ మానవహక్కులపై దాడి జరుగుతూనే ఉంది. అప్పుడు ఎక్కువా? ఇప్పుడు ఎక్కువా? అనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఈ ప్రభుత్వం కూడా అరెస్టులు చేస్తూనే ఉంది. దళితులపైనే ఎస్‌.సి, ఎస్‌.టి. అట్రాసిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ క్రింద అక్రమ కేసులు బనాయించిన ఉదంతాలు రాష్ట్రంలో ఉన్నాయి. వైద్య సేవలకు తగిన వసతులు లేవని విమర్శించిన ఒక ప్రభుత్వ డాక్టర్‌ సుధాకర్‌ ను పిచ్చివాడిని చేసి చివరకు చనిపోయేలా చేసిన ఉదంతాన్ని చంద్రు పూర్తిగా తెలుసుకుని తీరాలి. ఒక యంపి ని చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. గత ప్రభుత్వం తమతో చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించి భూములను, సాగును కోల్పోయి పోరాడుతున్న రైతులపై రెండేళ్లుగా సాగిస్తున్న ప్రభుత్వ నిర్భందకాండను జస్టిస్‌ చంద్రు చూడవలసి ఉంది. -ఇవన్నీ మేథావులు ఆయనను గౌరవంగా అడుగుతున్న ప్రశ్నలు, వేడుతున్న కోర్కెలు. 


చంద్రుగారూ.. సామాన్యుడు తమకు జరుగుతున్న అన్యాయాన్ని, అప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానాల్లో ప్రశ్నిస్తే తప్పా? రాజ్యాంగాన్ని కాలరాస్తున్న నాయకులను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న నాయకులను ప్రశ్నించడం తప్పా? అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పి, తర్వాత అదే అసెంబ్లీ సాక్షిగా మాట మార్చి రాష్ట్రాన్ని అధోగతి పాల్జే‍స్తున్న నాయకులను మీరయితే ఏమంటారు? రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య విభేదాలు, కుల రాజకీయాలు సృష్టిస్తున్న నాయకులను ప్రశ్నించకూడదా? ‘మా ఊరిలో మమ్మల్ని బందీగా ఉంచిన వారికి ఎటువంటి శిక్ష వేస్తారు? మా ప్రాంతాన్ని శ్మశానంగా ముద్రవేసి, భవిష్యత్‌ అగమ్యగోచరమై ఆందోళన చేస్తున్న వారిని పెయిడ్‌ ఆర్టిస్టులుగా తూలనాడుతున్న వారిని ఏమనాలి? మేమూ మానవులమే కదా! మావీ మానవహక్కులే కదా’ అని అమరావతి రైతులు మిమ్మల్ని వినయపూర్వకంగా ప్రశ్నిస్తున్నారు.


కొండబాబు

సీనియర్‌ జర్నలిస్ట్‌

Updated Date - 2021-12-18T06:08:49+05:30 IST