రిటైర్డ్‌ ఆర్మీ జవాను హత్య...

ABN , First Publish Date - 2021-07-27T05:12:06+05:30 IST

శ్రీకాకుళం నగరంలో సోమవారం కలకలం రేగింది. ఓ రిటైర్డ్‌ ఆర్మీ జవానును గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు ఓ ఫోన్‌కాల్‌ రావడంతో హుటాహుటిన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి అయినా.. ఇంటికి చేరుకోకపోవడంతో భార్య లలిత కంగారు పడి ఆయనకు ఫోన్‌ చేసింది. స్పందన లేకపోవడంతో స్థానికులకు సమాచారం ఇచ్చింది. మల్లేశ్వరరావు కోసం స్థానికులు గాలించారు. ఈ క్రమంలో విజయాదిత్య పార్కులో బెంచ్‌పై మల్లేశ్వరరావు మృతదేహం కనిపించింది.

రిటైర్డ్‌ ఆర్మీ జవాను హత్య...
మల్లేశ్వరరావు మృతదేహం

- మెడకు ఉచ్చు బిగించి... ప్రాణం తీసిన దుండగులు

- విజయాదిత్య పార్కులో మృతదేహం 

- శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూలై 26: శ్రీకాకుళం నగరంలో సోమవారం కలకలం రేగింది. ఓ రిటైర్డ్‌ ఆర్మీ జవానును గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరానికి ఆనుకుని ఉన్న సీపన్నాయుడుపేటకు చెందిన రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ చౌదరి మల్లేశ్వరరావు(47) హత్యకు గురయ్యారు. జాతీయ రహదారికి సమీపంలో ‘మీ-సేవ’ కేంద్రాన్ని నిర్వహిస్తూ.. కుటుంబంతో జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య లలిత, ఇంటర్మీడియట్‌ చదువుతున్న కొడుకు, డిగ్రీ చదువుతున్న కుమార్తె ఉన్నారు. మల్లేశ్వరరావు తమ్ముడు విజయవాడలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి మల్లేశ్వరరావు.. తన తమ్ముడిని విజయవాడ పంపించేందుకు శ్రీకాకుళంలో ట్రావెల్స్‌ బస్సు ఎక్కించి.. ఇంటికి తిరిగి వచ్చేశారు. రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు ఓ ఫోన్‌కాల్‌ రావడంతో హుటాహుటిన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి అయినా.. ఇంటికి చేరుకోకపోవడంతో భార్య లలిత కంగారు పడి ఆయనకు ఫోన్‌ చేసింది. స్పందన లేకపోవడంతో స్థానికులకు సమాచారం ఇచ్చింది. మల్లేశ్వరరావు  కోసం స్థానికులు గాలించారు. ఈ క్రమంలో విజయాదిత్య పార్కులో బెంచ్‌పై మల్లేశ్వరరావు మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మల్లేశ్వరరావు మృతదేహంపై తీవ్రగాయాలు ఉన్నాయి. మెడ చుట్టూ తాడును బిగించి.. హత్య చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో హత్యగా నిర్ధారించారు. రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి  చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి కొద్ది దూరంలో మల్లేశ్వరరావు చెప్పులు, సెల్‌ఫోన్‌ లభ్యమయ్యాయి. చివరిసారిగా మల్లేశ్వరరావుకు వచ్చిన ఫోన్‌కాల్స్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై టూటౌన్‌ సీఐ ప్రసాద్‌ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-07-27T05:12:06+05:30 IST