Abn logo
May 11 2021 @ 00:37AM

సింగరేణిలో ‘విరమణ’ గందరగోళం.. అమలుకునోచని రాష్ట్ర ప్రభుత్వ ‘పెంపు’ ఉత్తర్వులు

 ‘కోల్‌ఇండియా’లో 60ఏళ్లకే ఉద్యోగ విరమణ 

 దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానం

 అయోమయంలో రిటైర్మెంట్‌ ‘వయసు’

 సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల నిర్ణయమే కీలకం

ఇల్లెందు, మే 10: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ రంగసంస్థల కార్మికులకు సైతం ఉద్యోగ విరమణ వయస్సు 61ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ సింగరేణి కాలరీస్‌లో వయోపరిమితి పెంపు అంశం గందరగోళంగా మారింది. ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్‌సీ 30శాతం ఫిట్‌మెంట్‌తోపాటు ఉద్యోగవిరమణ వయస్సును 61ఏళ్లకు పెంచుతూ మార్చి30నుంచే అమల్లోకి తెచ్చింది. కానీ ఈ ఉత్తర్వులు ఆర్టీసీ, సింగరేణిలో అమలు కావడం లేదు. దేశవ్యాప్తంగా కోల్‌ఇండియా అనుబంద బొగ్గు ఉత్పాదక సంస్థల అన్నింటిలోనూ అధికారులు, కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సు 60ఏళ్లుగా గత కొన్నిదశాబ్దాలుగా అమలులో ఉంది. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 58ఏళ్లుగా ఉద్యోగ విరమణ వయస్సును ప్రకటించిన తరుణంలో సింగరేణిలో కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. కోల్‌మైన్స్‌ యాక్టు ప్రకారం బొగ్గుగనుల్లో నియమకాలకు 18ఏళ్ల కనీస వయస్సు, 60ఏళ్లకు రిటైర్మెంట్‌గా ఉన్నందున సింగరేణిలో కోల్‌ఇండియా విధానమే అమలు చేయాలని  కార్మికసంఘాలు పట్టాబట్టాయి. దాంతో అప్పటినుంచి సింగరేణిలో 60ఏళ్ల కాలపరిమితి కొనసాగుతోంది.   కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన డైరెక్టర్లతోపాటు మొత్తం 10మందితో కూడిన సింగరేణి కాలరీస్‌ బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్స్‌ రూపొందించే విధివిధానాలతో సింగరేణి కాలరీస్‌ చైర్మన్‌ సింగరేణిలో కార్యనిర్వాహక అధికారాలు అమలు చేస్తుంటారు.  

అయోమయంలో రిటైర్మెంట్‌ వయసు పెంపుదల

రాష్ట్రంలో మార్చినుంచి అమలులోకి తెచ్చిన 61ఏళ్ల రిటైర్మెంట్‌ విధానం సింగరేణిలో అమలు కావడం లేదు. బోర్డ్‌ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆమోదం లేకపోవడంతో 61ఏళ్ల పరిమితి అమలు కావడం లేదు. ఫలితంగా గత రెండు నెలలకాలంలో అనేక మంది కార్మికులు, అధికారులు సైతం రిటైర్‌ అయ్యారు. అంతేగాక మరో ఏడాది కాలంలో రిటైర్‌ కావాల్సిన ఉద్యోగులు, కార్మికులకు సైతం గత వారం రోజులుగా యజమాన్యం నోటీసులు జారీ చేస్తుండటం గమనార్హం.  

విద్యాసంస్థల్లోనూ గందరగోళమే 

కోల్‌బెల్ట్‌లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిటైర్మెంట్‌  వయసు పెంపుదలపై కూడా యజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వర్తింప చేసిన అనేక ప్రయోజనాలు సింగరేణి పాఠశాలల్లో అమలు కావట్లేదు. ఎయిడెడ్‌ సిబ్బందికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం సర్వీసు నిబంధనలు వర్తింపజేస్తూ ప్రభుత్వం అనేక సౌలభ్యాలు కల్పిస్తున్నా అన్‌ఎయిడెడ్‌ సిబ్బందికి మాత్రం సింగరేణి టెర్మినల్‌ బెనిఫిట్స్‌ మాత్రమే చెల్లిస్తుండటం గమనార్హం. ఇటీవల కాంట్రాక్టు బోధన, బోధనేతర సిబ్బందిని సైతం పాఠశాలల్లో గణనీయంగా నియమించారు. అయితే వీరెవరికి ప్రభుత్వం పెంచిన 61ఏళ్ల వయోపరిమితి పెంపుదల అమలు చేస్తూ ఆదేశాలు జారీచేయకపోవడంతో గత రెండు నెలలుగా రిటైర్‌ కావాల్సిన బోధన బోధనేతర సిబ్బంది త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం మీద సింగరేణి బోర్టుఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశం జరిగిన తరువాతనే వయోపరిమితులు పెంపుదలపై సింగరేణి కాలరీస్‌లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 


Advertisement