chennai: రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ హత్య

ABN , First Publish Date - 2021-10-20T15:38:59+05:30 IST

కడలూరు పట్టణంలో దారుణ హత్య జరిగింది. మద్యం కోసం అడిగినంత డబ్బు ఇవ్వడం లేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు తన తండ్రి అయిన రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ను రాడ్డుతో దాడి చేసి హతమార్చాడు. ఆ విషయాన్ని

chennai: రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ హత్య

                    - కుమారుడి అరెస్టు


ప్యారీస్‌(చెన్నై): కడలూరు పట్టణంలో దారుణ హత్య జరిగింది. మద్యం కోసం అడిగినంత డబ్బు ఇవ్వడం లేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు తన తండ్రి అయిన రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ను రాడ్డుతో దాడి చేసి హతమార్చాడు. ఆ విషయాన్ని స్వయంగా పోలీసులకు తెలిపిన ఓ యువకుడు.. వారు వచ్చే వరకూ తండ్రి శవం పక్కనే కూర్చుని అల్పాహారం సేవించాడు. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసులే దిగ్ర్భాంతి చెందారు. సోమవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే... కడలూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసిన సుబ్రమణియన్‌ (75) పదవీవిరమణ అనంతరం కామాక్షి నగర్‌లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఏడాది క్రితం సుబ్రమణియన్‌ భార్య సరస్వతి అనారోగ్యంతో మరణించారు. ఒక కుమార్తె విదేశాల్లో, ఒక కుమారుడు బెంగుళూరులో, చిన్నకుమారుడు చెన్నైలో నివసిస్తున్నారు. ఇంజనీరింగ్‌ డిగ్రీ పుచ్చుకున్న చివరి కుమారుడు కార్తీక్‌ మద్యానికి బానిసై తరచూ డబ్బు కోసం తండ్రితో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కూడా తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన కార్తీక్‌.. ఫూటుగా తాగి తిరిగొచ్చాడు. ఇంటికి వచ్చిందే తడవుగా తండ్రిని అసభ్యంగా దూషిస్తూ.. ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుబ్రమణియన్‌.. నేలపై పడి విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు. అనంతరం బయటకు వచ్చిన కార్తీక్‌.. తన తండ్రిపై దాడి చేశానని, ఆ కోపంతో ఆయన తనతో మాట్లాడకుండా పడుకున్నాడని స్నేహితులకు చెప్పాడు. తిరిగి ఇంటికెళ్లిన కార్తీక్‌.. నిద్రపోయాడు. సాయంత్రం పుదునగర్‌ పోలీసులకు ఫోన్‌ చేసి జరిగిన విషయం తెలియపరిచాడు. దీంతో పోలీసులు హూటాహూటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటివరకూ కార్తీక్‌ తన తండ్రి శవంపక్కనే కూర్చుని అల్పాహారం తింటూ కాలం గడిపాడు. అతను మద్యం మత్తులో వున్నట్లు గ్రహించిన పోలీసులు.. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు కార్తీక్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-10-20T15:38:59+05:30 IST