పారదర్శకంగా రీసర్వే పనులు

ABN , First Publish Date - 2022-08-19T04:37:04+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వే పనులు పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సలహాదారు, జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం రాష్ట్ర స్థాయి స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ అజేయకల్లం అధికారులను ఆదేశించారు.

పారదర్శకంగా రీసర్వే పనులు
సమావేశంలో మాట్లాడుతున్న అజేయకల్లం, చిత్రంలో కలెక్టర్‌ గిరీషా తదితరులు

రాష్ట్ర స్థాయి స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ అజేయకల్లం 


రాయచోటి(కలెక్టరేట్‌), ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వే పనులు పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సలహాదారు, జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం రాష్ట్ర స్థాయి స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ అజేయకల్లం అధికారులను ఆదేశించారు. గురువారం కడప కలెక్టరేట్‌లోని స్పందన హాలులో రాష్ట్ర సర్వే సెటెల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డుల కమిషనర్‌ సిద్ధార్థజైన్‌తో కలిసి అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ అజేయకల్లం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ల నుంచి జేసీలు, ఆర్డీవోలు, కింది స్థాయి అధికారుల వరకు సర్వే నియమాలు, టీమ్‌ వర్క్‌తో ముందుకు వెళ్లాలన్నారు. భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న రీసర్వేలు ఎంతో ఉపయోగకరమన్నారు. భూముల సర్వే కోసం  స్పందనలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. సిద్ధార్థజైన్‌ మాట్లాడుతూ భూమి మీద ఉన్న వాస్తవాలకు అద్దం పట్టేలా భూరికార్డులను తీర్చిదిద్దాలన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా మాట్లాడుతూ జిల్లాలో రీసర్వే పనులు ప్రణాళికాబద్ధంగా, వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్లలో ప్రణాళిక ప్రకారం నిర్దేశించిన లక్ష్యం మేరకు డ్రోన్‌ప్లే ప్రక్రియ పూర్తి చేస్తున్నామన్నారు. రీసర్వే ప్రక్రియ మొదలయ్యాక అన్ని గ్రామాల్లో సర్వే నెంబర్లు, భూమి పట్టాదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. సర్వే చేయడంతో పాటు భూముల సరిహద్దులు తెలిపే విధంగా సర్వే రాళ్లు కూడా ఆయా భూముల్లో పాతే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రీసర్వేలో భాగంగా జిల్లాల్లో పనుల స్టేటస్‌ వివరాలను, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు సమస్యలను కలెక్టర్‌, జేసీ చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశానికి జేసీ తమీమ్‌ అన్సారియా, తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2022-08-19T04:37:04+05:30 IST