రీ సర్వే ఎప్పటికో!

ABN , First Publish Date - 2021-06-18T05:16:18+05:30 IST

జిల్లాలో భూముల రీ సర్వే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన రెండు గ్రామాల్లోనే ఇంకా సర్వే కొలిక్కి రాలేదు. మందకొడిగా సాగుతోంది. చిన్న గ్రామాల విషయంలోనే జాప్యం చేసిన అధికారులు జిల్లాలో లక్షల సంఖ్యలో ఉన్న సర్వే నెంబర్లు, సబ్‌ డివిజన్ల విషయంలో ఎలా ముందుకెళ్తారన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ జిల్లా పర్యాటనకు శుక్రవారం వస్తున్నారు.

రీ సర్వే ఎప్పటికో!

పైలట్‌ గ్రామాల్లో నత్తనడక 

ఇప్పటికీ కానరాని హద్దు రాళ్లు

నేడు రెవెన్యూ మంత్రి పర్యటన 

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో భూముల రీ సర్వే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన రెండు గ్రామాల్లోనే ఇంకా సర్వే కొలిక్కి రాలేదు. మందకొడిగా సాగుతోంది. చిన్న గ్రామాల విషయంలోనే జాప్యం చేసిన అధికారులు జిల్లాలో లక్షల సంఖ్యలో ఉన్న సర్వే నెంబర్లు, సబ్‌ డివిజన్ల విషయంలో ఎలా ముందుకెళ్తారన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ జిల్లా పర్యాటనకు శుక్రవారం వస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టులుగా గుర్తించిన గ్రామాల్లో సర్వే పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లాలోని పార్వతీపురం డివిజన్‌ రామభద్రపురం మండలం మరివలస గ్రామాన్ని భూముల రీసర్వేకు పైలట్‌ ప్రాజెక్టుగా గుర్తించారు. ఆ గ్రామంలో 334.14 ఎకరాల భూమి ఉంది. ఇందులో 15 ఎకరాలు మినహా సమగ్ర సర్వేను పూర్తి చేసినట్లు యంత్రాంగం చెబుతోంది. అలాగే దత్తిరాజేరు మండలం లక్ష్మీపురం గ్రామంలో కూడా రీ సర్వే చేశారు. ఇక్కడ 168.35 ఎకరాల భూమి ఉంది. ఏడు ఎకరాలు మినహా సర్వేను పూర్తి చేసినట్లు చెబుతున్నారు. 

పైలట్‌ ప్రాజెక్టుగా గుర్తించిన చిన్న గ్రామాల్లోనే మందకొడిగా సర్వే చేయడం కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో లక్షల సంఖ్యలో ఉన్న సర్వే నెంబర్లు, సబ్‌ డివిజన్ల విషయంలో ఎప్పటికి సర్వే పూర్తి చేస్తారా అన్నది అనుమానమే. ఇప్పటికీ సర్వే రాళ్లు రాలేదు. సిబ్బంది, సాంకేతిక పరికరాలు పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. జీపీఎస్‌లు, రోవర్స్‌, డిజటలైజేషన్‌, డేటా ఎంట్రీ ఇలా అనేక దశలుగా సర్వేకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంటుంది. సచివాలయ స్థాయిలో సర్వేయర్లను భర్తీ చేశారు. కొన్ని సచివాలయాల్లో ఇప్పటికీ సిబ్బంది కొరత ఉంది. సర్వేలో భాగంగా ముందు వ్యవసాయ భూములను గుర్తించాల్సి ఉంది. వాటి హక్కులకు సంబంధించిన రైతుల వివరాలు తెలుసుకుని వారికి పట్టాదార్‌, టైటిల్‌ డీడ్స్‌ అందించాలి. అలాగే గ్రామ పట్టాలు, గ్రామ స్థాయి హద్దులు. విస్తీర్ణాలు గుర్తించాలి. చెరువులు, ప్రభుత్వ భూములు, రోడ్లు ఇలా ప్రతి అంగుళాన్ని సమగ్రంగా పరిశీలించాలి. కానీ సర్వే ప్రారంభించి ఏడాది అవుతున్నా పైలట్‌ ప్రాజెక్టులుగా తీసుకున్న గ్రామాల్లోనే శత శాతం పూర్తిచేయలేదు. ఈ పైలట్‌ ప్రాజెక్టులకే పూర్తిస్థాయిలో సర్వే రాళ్లు రాలేదు. సర్వే పూర్తి కాలేదు. రైతాంగానికి టైటిల్‌ డీడ్స్‌ ఎప్పుడు అందిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో రెవెన్యూ మంత్రి జిల్లాకు వస్తున్నారు. మంత్రి పరిశీలన తరువాత అయినా సమగ్ర సర్వే ప్రక్రియ ఊపందుకునే పరిస్థితి ఉంటుందో.. లేదో చూడాలి. 

భూములే అసలు సమస్య

జిల్లాలో ఉన్న సమస్యల్లో రెవెన్యూదే అగ్రస్థానం. ముఖ్యంగా భూముల తగాదాలే ఎక్కువ. హక్కులు ఒకరి పేరున ఉంటే సాగు హక్కులు వేరే వారి చేతిలో ఉంటున్నాయి. కొన్నిచోట్ల భూములను విక్రయించి దశాబ్దాలు గడిచినా పాత వ్యక్తుల పేరునే భూములు ఉంటున్నాయి. కొంత మంది రైతులు సొంత జిరాయితీ భూములకు సైతం పట్టా దార్‌ పాసుపుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌ తీసుకోలేదు. కొంత మందికి పట్టాదార్‌ పాసు పుస్తకాలున్నా వెబ్‌ల్యాండ్‌లో కన్పించడం లేదు. భూములు ఆన్‌లైన్‌ చేయని కారణంగా వెబ్‌ల్యాండ్‌ ద్వారా 1బి పొందలేని పరిస్థితిని అనేక మంది రైతులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల భూముల పంపకాలు జరిగినా ఎవరికివారు హక్కులు పొందని పరిస్థితి ఉంది. గ్రామాల్లో సరిహద్దులు సక్రమంగా లేని కారణంగా రైతుల మధ్య నిత్యం తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర భూ సర్వే ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-06-18T05:16:18+05:30 IST