రిజల్ట్స్‌ రాకనే మెరిట్‌ జాబితా !

ABN , First Publish Date - 2022-09-26T04:50:42+05:30 IST

అంగనవాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 18వ తేదీన పరీక్ష జరగ్గా, అందుకు సంబంధించిన మెరిట్‌ జాబితాను ఒంగోలు ఆర్జేడీ కార్యాలయం నుంచి జిల్లా పీడీ కార్యాలయానికి శనివారం పంపారు.

రిజల్ట్స్‌ రాకనే మెరిట్‌ జాబితా !
గత ఆదివారం ఒంగోలులోని ఓ కేంద్రంలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులు(ఫైల్‌)

అంగనవాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీలో అవకతవకలు

ఫలితాలు విడుదల చేయని అధికారులు

ఏ ప్రతిపాదికన తయారు చేశారో చెప్పేవారేరి ?

భర్తీ ప్రక్రియలో తొలుత హడావిడి... ఇప్పుడు గోప్యత

స్ర్తీ, శిశు సంక్షేమశాఖలో వింత వైఖరి


 ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం భర్తీ చేయాలంటే అందుకు ఒక పద్ధతి ఉంటుంది. ఖాళీలను గుర్తించడం, నోటిఫికేషన ఇవ్వడం, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం, పరీక్ష నిర్వహించడం, ఫలితాలు విడుదల చేయడం, మెరిట్‌ జాబితా రూపొందించడం, అభ్యంతరాలు స్వీకరించడం, తుది జాబితా ప్రచురించడం.. చేయాలి. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలన్నింటిలో ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. కానీ సీ్త్ర, శిశు సంక్షేమ శాఖకు మాత్రం ఈ విధానం వర్తించదట..! నోటిఫికేషన విడుదల చేయడం, హడావిడిగా దరఖాస్తులు స్వీకరించడం, అంతకంటే హడావిడిగా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు విడుదల చేయకుండానే మెరిట్‌ జాబితా రూపొందించడం మాత్రమే తమకు తెలుసు అన్నట్లు ఆ శాఖ వ్యవహరిస్తోంది. అసలు ఫలితాలు విడుదల చేయకుండా మెరిట్‌ జాబితా రూపొందించే విచిత్రమేమిటో ఆ శాఖ ఉన్నతాధికారులకే తెలియాలి. అంగనవాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేక అనుమానాలను కలిగిస్తోంది. నోటిఫికేషన ఇవ్వడం మొదలు పరీక్ష నిర్వహించడం వరకు హడావిడిగా నిర్వహించిన అధికారులు, ఆ తర్వాత ఫలితాలు విడుదల చేయకుండానే మెరిట్‌ జాబితాను తయారు చేసి జిల్లా అధికారులకు పంపారు. ఇదంతా గోప్యంగా జరగడం గమనార్హం. 


నెల్లూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):  అంగనవాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల  భర్తీకి ఈ నెల 18వ తేదీన పరీక్ష జరగ్గా, అందుకు సంబంధించిన మెరిట్‌ జాబితాను ఒంగోలు ఆర్జేడీ కార్యాలయం నుంచి జిల్లా పీడీ కార్యాలయానికి శనివారం పంపారు. ఆ జాబితాలోని అభ్యర్థులకు రెండో దశ పరీక్ష అయిన ఇంగ్లీష్‌ టీచింగ్‌ స్కిల్స్‌ టెస్ట్‌ను చేసేందుకు ఆయా సీడీపీవోలకు సమాచారం ఇచ్చారు. సీడీపీవోలంతా జాబితాలోని అభ్యర్థులకు ఈ వివరాలు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన పరీక్ష రాసిన అభ్యర్థులు కంగుతిన్నారు. అసలు పరీక్ష ముగిశాక ఇంతవరకు కీ గానీ, ఫలితాలు గానీ విడుదల చేయలేదు. కానీ ఇంతలో మెరిట్‌ జాబితా రూపొందించడంతో లబోదిబోమంటున్నారు. సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు జరిగినట్లు వారు ఆరోపిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక బలం ఉన్న వారికే మెరిట్‌ జాబితాలో స్థానం కల్పించారని చెప్పుకుంటున్నారు. కాగా ఫలితాల గురించి అడిగితే సమాధానం చెప్పేవారు కరువవడంతో వీరి ఆరోపణలకు బలం చేకూరుతోంది. 


అప్పుడంతా హడావిడి..


అంగనవాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదటి నుంచి విమర్శల పాలవుతోంది. గతంలో ఓ సారి నోటిఫికేషన ఇచ్చి దరఖాస్తులు కూడా స్వీకరించారు. అయితే ఆ తర్వాత పరీక్ష నిర్వహించలేదు. కాగా ఇటీవల ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను ముందు ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరిగాయి. అయితే ఏమైందో గానీ సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ద్వారానే భర్తీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 5వ తేదీన నోటిఫికేషన ఇచ్చారు. 12వతేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తు చేసుకున్నారు. 18న పరీక్ష నిర్వహించారు. ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరమేమిటో అర్థం కావడం లేదు. నోటిఫికేషన ఇచ్చాక అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు కనీస సమయం కూడా ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నెల్లూరు జిల్లా ఒంగోలు రీజియన కావడంతో ఇక్కడి దరఖాస్తుదారులంతా ఒంగోలుకు వెళ్లి పరీక్ష రాశారు. అంగనవాడీ వర్కర్‌గా కనీసం పదేళ్లు పనిచేసి, కనీసం పదో తరగతి చదివిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కావడంతో జిల్లా నుంచి వేల సంఖ్యలోనే దరఖాస్తులు వెళ్లాయి. అయితే 1463 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒంగోలు రీజియన పరిధిలోని ఉమ్మడి జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, గుంటూరులలో మొత్తం 144 అంగనవాడీ సూపర్‌వైజర్‌ పోస్టులు ఖాళీలున్నాయి. 


ఇప్పుడంతా గోప్యం..


పరీక్ష నిర్వహించే వరకు హడావిడి జరిగినా భర్తీ ప్రక్రియ ఇప్పుడు గోప్యంగా జరుగుతోంది. పరీక్ష నిర్వహించిన వారం రోజుల్లోపే మెరిట్‌ జాబితాను విడుదల చేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణంగా పరీక్ష ముగిశాక కీ విడుదల చేస్తారు. అందులో అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు అభ్యర్థులకు కొంత గడువు ఇస్తారు. అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు. తర్వాత మెరిట్‌ జాబితా ప్రకటిస్తారు. ఇక్కడ కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేసుకునేందుకు అవకాశమివ్వాలి. కానీ ఈ నిబంధలను స్ర్తీ, శిశు సంక్షేమ శాఖలో పక్కనపెట్టారు. 1:2 ప్రకారం మెరిట్‌ జాబితా తయారు చేసి పంపినట్లు జిల్లా అధికారులు చెబుతున్నప్పటికీ ఈ పోస్టులన్నీ ఎవరికి దక్కాలన్నది ముందుగానే రిజర్వ్‌ అయిపోయినట్లు అభ్యర్థులు చెప్పుకుంటున్నారు. తెరవెనుక రాజకీయ, ఆర్థిక ప్రభావం బాగా పనిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతల ముఖ్య  అనుచరులు, భారీగా చేతులు తడిపిన అభ్యర్థులకు సూపర్‌వైజర్‌ పోస్టులను ఖరారు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టులను ముందుగానే అమ్మేసి పేరుకు పరీక్ష నిర్వహించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ బాగోతంలో కొందరు ఐసీడీఎస్‌ ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ మెరిట్‌ జాబితా తయారీ అంతా ఒంగోలు ఆర్జేడీ కార్యాలయం వేదికగా జరిగింది. దీనిపై వివరణ కోరేందుకు ఒంగోలు ఆర్జేడీను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. 


ఫలితాలు మా పరిధి కాదు 


అంగనవాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా 1:2 మేరకు మెరిట్‌ జాబితాను మాకు పంపారు. రెండో దశ పరీక్ష కోసం ఈ జాబితాను ఆయా సీడీపీవోలకు అందజేశాం. పరీక్ష ఫలితాలు మా పరిధిలోవి కావు. 

-ఉమామహేశ్వరి, ఐసీడీఎస్‌ పీడీ

Updated Date - 2022-09-26T04:50:42+05:30 IST