Abn logo
May 4 2021 @ 04:08AM

ఫలితం, పాఠం

ఎన్నికలు ఐదు చోట్ల జరిగినా, ఒక రాష్ట్రం మీదనే అందరి దృష్టి ఎక్కువ ఉండింది. చివరకు ఆ ఒక్క రాష్ట్రం ఫలితమే జాతీయ ఎన్నికల ఫలితం లాగా సంచలనం సృష్టించింది. ఏడు సంవత్సరాలుగా ఏకోన్ముఖంగా సాగుతున్న రాజకీయగమనాన్ని ఈ ఫలితం మలుపు తిప్పుతుందని వ్యాఖ్యాతలు చెబుతున్నారు. భవిష్యత్ పరిణామాల సంగతి పక్కన పెడితే బెంగాల్‌లో జరిగింది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన సంచలనం. ఆ రాష్ట్రాన్ని ఎట్లాగైనా తన ఖాతాలో వేసుకోవాలని భారతీయ జనతాపార్టీ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లోనే మొదలైన ఆ ప్రయత్నం, స్వల్పఫలితాన్ని మాత్రమే ఇవ్వగా, కఠోర పరిశ్రమ, క్షేత్రస్థాయికి తన భావజాలాన్ని వ్యాపింపజేయడం కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికలలో 42లో 18 స్థానాల గెలుపు సాధ్యపడింది. ఇక అసెంబ్లీ ఎన్నికలనాటికి జైత్రయాత్ర పూర్తి చేయవచ్చుననుకున్నారు. ప్రధానమంత్రే స్వయంగా రంగంలోకి దిగారు. ఎన్నికల కమిషన్‌ సహా సకల వ్యవస్థలు బెంగాల్ ఎన్నికలకు ప్రత్యేక వ్యూహాలు అనుసరించాయి. ఎన్నికలు సమీపిస్తుండగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి వరుస ఫిరాయింపులతో మమతా బెనర్జీ మనోస్థైర్యంపై గురిపెట్టారు. నరేంద్రమోదీ, అమిత్ షా బెంగాల్ పోరును అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోకపోయి ఉంటే, ప్రస్తుత ఫలితాలకు ఈ వ్యాఖ్యానాలు వచ్చేవి కావు. ఒక ముఖ్యమంత్రితో ప్రధానమంత్రే తలపడ్డా, ముఖ్యమంత్రే గెలిచారు. భారతదేశ ఆధునిక, సంస్కార, ఉదారవాద భావాలకు ముఖద్వారంగా పేరు పొందిన బెంగాల్‌ను కైవసం చేసుకోవడం హిందూత్వ భావాలకు ప్రతీకాత్మక విజయమని కూడా భారతీయ జనతాపార్టీ భావించింది. అందువల్ల కూడా ఇప్పటి ఫలితానికి ప్రాధాన్యం పెరిగింది. 


రెండేళ్ల కిందట పద్ధెనిమిది లోక్‌సభ స్థానాలలో లభించిన గెలుపును, అసెంబ్లీ స్థానాలకు అనువర్తింపజేస్తే 126 స్థానాలు లభించి ఉండాలి. అందులో దాదాపు సగం మాత్రమే బిజెపి గెలవగలిగింది. 2016 ఎన్నికలలో సాధించిన మూడు స్థానాలతో పోలిస్తే, ఇది 20 రెట్ల అధిక విజయమే. అట్లా సమర్థించుకోవడానికి కూడా వీలు లేకుండా బిజెపి అగ్రనేతలు భీషణ ప్రతిజ్ఞలు చేశారు. తమిళనాడులో 2019లో డిఎంకె సాధించిన లోక్‌సభ స్థానాలకు, ఇప్పుడు గెలిచిన అసెంబ్లీ స్థానాలకు పోలిక లేదు. అయినా, డిఎంకెది, స్టాలిన్‌ది ఘనవిజయమేనని అంతా అంగీకరిస్తున్నారు. భారతీయ జనతాపార్టీతో అన్నాడిఎంకె చెలిమిని బోనులో నిలబెట్టి, డిఎంకె ఎన్నికల ప్రచారం చేసింది. అది ఫలితాన్ని ఇచ్చింది. నిజానికి పళనిస్వామి ప్రభుత్వం, జాగ్రత్తగా సమర్థంగా బాధ్యత నిర్వహించింది. ప్రజలకు ఆ ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత కూడా లేదు. బిజెపి సాంగత్యమే తమ కొంప ముంచిందని, లేకపోతే, ప్రభుత్వాన్ని నెలకొల్పగలిగేవారిమని అన్నాడిఎంకె అనుకుంటోంది. తాము ఉన్నందుకే ఈ మాత్రమైనా స్థానాలు వచ్చాయని బిజెపి వాదిస్తోంది. ఏది ఏమయినా, జయలలిత మరణించిన తరువాత రాష్ట్ర రాజకీయాలలో బిజెపి నిర్వహించిన తెరవెనుక నియంత్రణపై ప్రజలకు ఏవగింపు కలిగింది. ఓడితే ఓడాము కానీ, ఇక బిజెపికి లొంగి ఉండనక్కరలేదు అని అన్నాడిఎంకె నేతలు అనుకుంటున్నారట. 


బెంగాల్ ఫలితంతో, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఫలితాలు కూడా బిజెపి వ్యతిరేకమైనవిగా లెక్కవేస్తున్నారు. కేరళలో పోటీ పడింది కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు, వారి వారి కూటములు. రెండో సారి వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి రావడం విశేషమే అయినప్పటికీ, మెట్రో శ్రీధరన్‌తో సహా ఓడిపోయి ఒక్క సీటూ బిజెపి గెలవకలేకపోవడమే ప్రధానంగా చర్చల్లోకి వచ్చింది. ఈ అపజయాల వరుసలో, అసోంలో ప్రభుత్వాన్ని నిలుపుకోవడం లెక్కలోకి రాకుండా పోయింది. 


ఈ ఫలితాల నుంచి భారతీయ జనతాపార్టీ ఏమి గుణపాఠం తీసుకుంటుంది? ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత కిశోర్ వ్యాఖ్యానించినట్టు, బెంగాల్‌లో జరిగినంత విద్వేష, విభజనవాద భావప్రచారం మునుపు ఏ ఎన్నికలోనూ జరిగి ఉండదు. అది శ్రుతి మించడం ఓటర్లకు నచ్చలేదు. గట్టి సూచన ఇవ్వదలచుకున్నారు. బెంగాల్ రాజకీయాలలో కూడా ఉభయ పక్షాలనుంచి కుల వ్యూహాలు వచ్చి ఉండవచ్చు, బిహార్ తరహా హింసావాతావరణం ఏర్పడి ఉండవచ్చు. కానీ, బిజెపి ఆశ్రయించిన ప్రచార తత్వాన్ని వారు హర్షించలేదు. ఈ గుణపాఠమే నరేంద్రమోదీ, అమిత్ షా తీసుకోవాలి. అట్లా కాక, తీవ్రత ఇంకా పెంచి ఉండవలసింది అనే తరహా పాఠం తీసుకుంటే, వారి రాజసూయం మార్గమధ్యంలోనే నిలిచిపోతుంది. కోవిడ్ రెండవ దశను నిర్వహించడంలో కేంద్ర వైఫల్యం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతికూలతను కలిగించింది. గత ఏడాది కాలంగా, కరోనా తీవ్రత అనేక పర్యవసానాలు కలిగించిన దశలో, కేంద్రప్రభుత్వం వివిధ అంశాలపై అనుసరించిన వైఖరి, ఆరోగ్యసంక్షోభ కాలంలోనూ విద్వేష భావజాలాల ప్రచారానికి ఆస్కారం కలిగించిన తీరు ప్రజల మనసుల్లో క్రమంగా విముఖత పెంచుతూ వచ్చాయి. దీనిని జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ పరిగణనలోకి తీసుకోవాలి. బిజెపిని ఎదుర్కొనడం పేరు మీద మమతా బెనర్జీ పార్టీ, డిఎంకె, కొంత మేరకు వామపక్షాలు కూడా తమ తమ వైఖరులలో స్వల్పమైన మార్పులు చేసుకున్నాయి. అసోంలో గెలవడానికి బిజెపి అభ్యర్థులు కూడా పశుమాంసాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. ప్రజలలో పనిచేసేవారు ఉద్వేగభరితమైన అంశాలలో తగిన మార్పులు చేర్పులు చేసుకోవడంలో తప్పేమీ లేదు. భారతీయ జనతాపార్టీ తనకు అప్రదిష్ఠను, పరాజయాలను తెస్తున్న మతతత్వ భావజాలాన్ని, విద్వేష ప్రచారాన్ని విరమించుకోవడమో, కనీసస్థాయికి తగ్గించుకోవడమో చేయడం ఆ పార్టీ భవిష్యత్తుకే మంచిదని పరిశీలకులు సూచిస్తున్నారు. కార్యకర్తల బలం ఉన్న పార్టీ, వాస్తవ ప్రజాసమస్యలను ఆధారం చేసుకుని తమ రాజకీయ ఆచరణను నిర్మించుకోవడం శ్రేయస్కరం. వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లనున్నందున, సమీక్ష అందరికీ అవసరం. జాతీయస్థాయి ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు కూడా పెద్దగా సమయం లేదు.

Advertisement