ఎరువుల విక్రయాలపై ఆంక్షలు

ABN , First Publish Date - 2021-02-28T04:11:40+05:30 IST

ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఒక్కో రైతుకు నెలకు 50 బస్తా లకు మించి అమ్మవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖకు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.

ఎరువుల విక్రయాలపై ఆంక్షలు

ఒక్కో రైతుకు నెలకు 50 బస్తాలే
అవసరానికి మించి కొనుగోళ్లు
ఎరువులు పక్కదారి పట్టకుండా నిబంధనలు
అమ్మకందారుల వద్ద పీఓఎస్‌ మిషన్లు ఏర్పాటు
బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా కట్టడి
కామారెడ్డి, ఫిబ్రవరి 27: ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఒక్కో రైతుకు నెలకు 50 బస్తా లకు మించి అమ్మవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖకు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఎరువుల విక్రయ యంత్రాల్లో ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ను తక్షణం మార్చాలని వీలైనంత త్వరగా కొత్త విధానాన్ని అమలు చేయాలని జాతీయ సమాచార కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటిదాకా ఎరువుల విక్రయాలపై ఎలాంటి ఆంక్షలూ లేకపోవడంతో ఒక్కోరైతు పేరిట వందలాది బస్తాలు బయటకు వెళ్తున్నాయి. జిల్లాలో ప్రతీ సీజన్‌లో లక్షల టన్నుల ఎరువులు విక్రయిస్తుండగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా కట్టడి చేయడం శుభపరిణామం.
ఆధార్‌, వేలిముద్రలు
పంట సాగుతో పాటు ఇతర అవసరాలకు ఎరువులను మళ్లిస్తుండడంతో ఎరువుల విక్రయాల్లో మొబైల్‌ ఫర్టిలైజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంను (ఎంఎఫ్‌ ఎంఎస్‌)ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎరువులు విక్రయించే వ్యాపారులతో పాటు సంఘాలకు పాయింట్‌ ఆఫ్‌సేల్‌(పీఓఎస్‌) మిషన్లు సరఫరా చేశారు. ఎరువులు కొనుగోలు చేసే రైతుల ఆధార్‌ నెంబర్‌ను నమోదు చేసి, సంబంధిత రైతు వేలిముద్రను తీసుకుని ఎరువులు విక్ర యించాలని సూచించింది. దీనివల్ల ఎరువులు ఎవరెవరు కొనుగోలు చేశా రు. ఎంతమొత్తం కొనుగోలు చేశారనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసు కునే అవకాశం ఏర్పడింది. రెండేళ్లుగా ఎరువుల విక్రయాలను పరిశీలిస్తే కొంతమంది రైతులు వందల బస్తాలు కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. ఎక్కువ మొత్తంలో ఎరువులను కొనుగోలు చేసిన రైతులవారిగా విచారణ జరిపిన ప్రభుత్వం పక్కదారి పట్టినట్లుగా తేలడంతో ఎరువుల విక్రయాలపై పరిమితి విధించింది.
అవసరానికి మించి..
ఎరువులు అవసరానికి మించి వినియోగించడంతో పాటు కొంత మంది బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్నారని ప్రభుత్వం గుర్తించి ఎరువుల విక్రయాలపై పరిమిఽతి విధించింది. వాస్తవానికి వరిసాగు చేసే రైతుకు ఎకరానికి సాధారణంగా యూరియా 3 బస్తాలు, డీఏపీ ఒక బస్తా, పొటాష్‌ 25 కిలోలు అవసరం ఉంటుంది. కానీ రైతులు ఎకరానికి నాలుగైదు బస్తాల యూరియాను వినియోగిస్తున్నారు. యూరియా, పొటాష్‌ ఎరువులను తీసుకెళ్లి కొత్త రకాల మిశ్రమ ఎరువులను తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎరువుల విక్రయాలపై కట్టడి విధించింది.
రాయితీ పక్కదారి
రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఎరువులపై పెద్దఎత్తున రాయితీ ఇస్తున్నారు. యూరియాపై రూ.585, డై అమ్మోనియం ఫాస్పెట్‌పై రూ.511, పొటాష్‌పై రూ.303 చొప్పున కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. కానీ మిక్సింగ్‌ ప్లాంట్ల మాయాజాలంతో రాయితీ ద్వారా వచ్చే ఎరువులను మిక్సింగ్‌ ఎరువులను తయారు చేస్తున్నారు. దీంతో రైతులకు అందాల్సిన రాయితీ ఎరువుల ప్లాంట్ల యజమానులకు కాసులు కురిపిస్తున్నాయి.

Updated Date - 2021-02-28T04:11:40+05:30 IST