ఆంక్షలు.. కఠినతరం

ABN , First Publish Date - 2020-03-31T09:09:04+05:30 IST

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కరోనా వైరస్‌ కట్టడికి పోలీసులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో నమోదైన తొలి రెండు పాజిటివ్‌ కేసులు తూర్పు

ఆంక్షలు.. కఠినతరం

జనం రోడ్డుపైకి రాకుండా కట్టడి

గుంటూరు తూర్పు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి


గుంటూరు, మార్చి 30: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కరోనా వైరస్‌ కట్టడికి పోలీసులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో నమోదైన తొలి రెండు పాజిటివ్‌ కేసులు తూర్పు నియోజకవర్గంలోనివే కావడంతో పోలీసులు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. తూర్పు నియోజకవర్గం కరోనా వైరస్‌ వెలుగు చూసినప్పటికీ ముఖ్యంగా ప్రజల్లో, యువకుల్లో మార్పు కానీ, భయం కానీ కనిపించకపోతుండడంతో అధికారులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా సోమవారం నుంచి తూర్పు నియోజకవర్గానికి పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఏపీఎస్పీ, ఏఆర్‌తో పాటు పశ్చిమలోని పలువురు సిబ్బంది సైతం తూర్పు నియోజకవర్గానికి మళ్ళించారు.


ఎక్కడికక్కడ ఇనుప కంచెలు, స్టాప్‌బోర్డులతో రోడ్లను దిగ్బంధం చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో మెయిన్‌ రోడ్లు తప్ప మిగిలిన అన్ని కాలనీల్లో వ్యాపార దుకాణాలతో పాటు ప్రజల సంచారం అధికంగా ఉన్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అత్యధిక కాలనీల్లో ప్రజలు లాక్‌డౌన్‌ను పాటించడం లేదని పోలీసు అధికారులు గుర్తించారు.  దీంతో ఎన్నడూ లేని విధంగా ఇనుప కంచెలను, స్టాప్‌బోర్డులను, డ్రమ్ములను, అందుబాటులో ఉన్న సామగ్రిని ఉపయోగించి అన్ని గొందులు, సందుల్లో రోడ్లను మూసివేశారు.


అంతేకాక ప్రతి సందులోను ఒక కానిస్టేబుల్‌ను నియమించారు. పోలీసు సిబ్బంది ఇళ్ళల్లో నుంచి అనవసరంగా జనం రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో సోమవారం తూర్పు నియోజకవర్గంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో జన సంచారం పూర్తిగా తగ్గింది. అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు అనవసరంగా రోడ్డు మీదకు వచ్చి ఇబ్బందులకు గురి కాకూడదని సూచించారు.  

Updated Date - 2020-03-31T09:09:04+05:30 IST