రేషన్‌ బండికి నెంబరు ప్లేట్లు ఏవీ?

ABN , First Publish Date - 2022-04-05T04:10:31+05:30 IST

జిల్లాలో ఇంటింటికి రేషన్‌ బియ్యం పంపిణీ చేసే వాహనాలకు నెంబరు ప్లేట్లు ఉండడం లేదు. దీనివల్ల పేదలకు అందాల్సిన బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే సమయంలో ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు అవకాశం ఉంది.

రేషన్‌ బండికి నెంబరు ప్లేట్లు ఏవీ?
ముందు నెంబరు ప్లేటు లేని రేషన్‌ బియ్యం వాహనం

అక్రమ రవాణాను గుర్తించకుండా జాగ్రత్తలు

బ్లాక్‌ మార్కెట్‌కు పేదల చౌక బియ్యం

కావలి, ఏప్రిల్‌ 4 : జిల్లాలో ఇంటింటికి రేషన్‌ బియ్యం పంపిణీ చేసే వాహనాలకు నెంబరు ప్లేట్లు ఉండడం లేదు. దీనివల్ల పేదలకు అందాల్సిన బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే సమయంలో ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు అవకాశం ఉంది. ఇదే అదునుగా నిర్వాహకులు ఈ వాహనాల్లోనే అక్రమ రవాణాకు పాల్పడుతూ రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాహనం కొనుగోలు చేసిన తర్వాత వాటి రిజిస్ట్రేషన్‌ నెంబర్లు వచ్చే వరకు టీఆర్‌ నెంబర్లతో తిరుగుతుంటాయి. అయితే జిల్లాలో ఇంటింటికి రేషన్‌ బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా  524 మందికి రాయితీతో వాహనాలను మంజూరు చేయించింది. ఆ వాహన లబ్ధిదారులనే ఆపరేటర్లుగా నియమించి వారికి నెలకు కొంత వేతనం ఇచ్చి తద్వారా ఆ వాహనాల ద్వారా ఇంటింటికి బియ్యం పంపిణీ చేయిస్తున్నారు. రేషన్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు వెళ్లకుండా  ప్రతి ఇంటికి రేషన్‌ బియ్యం అందచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కొత్త వాహనాలను ప్రవేశ పెట్టింది.

ఏడాది దాటినా...

గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ వాహనాలు ఇంటింటికి బియ్యం పంపిణీ చేస్తుండగా ఇప్పటికీ వాటికి రిజిస్ట్రేషన్‌ నెంబరు ప్లేటు కనిపించలేదు. దీంతో ఏ వాహనం ఎక్కడిదో తెలియక పోవటమే కాక వాటి ద్వారా అక్రమాలు జరిగేందుకు కూడా ఆస్కారాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలి పోకుండా ఇంటింటికి బియ్యం అందచేస్తున్నపుడు నిత్యం ఏదో ఒక చోట అక్రమ రవాణా అవుతోన్న రేషన్‌ బియ్యం అధికారులు పట్టుకుంటున్నారు. బియ్యం ఇంటింటికి ఇచ్చినపుడు ఈ బియ్యం ఎక్కడవనే అనుమానం కలుగుతోంది. అనేక మంది ఎంటీయూ (మొబైల్‌ డిస్టన్స్‌ యూనిట్‌) ఆపరేటర్లు ఇళ్ల వద్దనే బియ్యం లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి వాటిని తమ వాహనాలలో ఉంచుకుని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని ఈ వాహనాల ద్వారానే బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నా నెంబరు ప్లేట్లు లేకపోతే ఏ ప్రాంత వాహనమో తెలియక పోవటంతో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులకు ఇబ్బందికరంగా మారింది. అదే నెంబరు ప్లేట్లు ఉంటే ఒక ప్రాంత వాహనం మరో ప్రాంతంలో తిరుగుతున్నపుడు అనుమానం వచ్చి తనిఖీలు చేసేందుకు అధికారులకు అవకాశం ఉంటుంది. వాస్తవంగా నెంబరు ప్లేట్లు బిగించుకుని వాటిపై పలానా ప్రాంతం, మండలం అని ముందుభాగాన రాసి ఉంచితే ఒక మండలం నుంచి మరొక మండలానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చే వాహనాలను తనిఖీలు చేసి అక్రమాలు జరగకుండా అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ వాహనాలు వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ అనేక వాహనాలకు నెంబరు ప్లేట్లు లేక పోయినా అధికారులు ఎందుకు పట్టించుకోవటంలేదో అర్థం కావడం లేదు. వాస్తవంగా వాటి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి నెంబరు ప్లేట్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటిని బిగించుకోవటంలో ఉద్దేశ పూర్వకంగానే ఎండీయూ ఆపరేటర్లు నిర్లక్ష్యం చేస్తున్నా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ వాహనాలకు నెంబరు ప్లేట్లు బిగించాల్సి ఉంది.

Updated Date - 2022-04-05T04:10:31+05:30 IST