క్లౌడ్‌ కిచెన్‌.. రూటు మార్చిన బడా రెస్టారెంట్లు

ABN , First Publish Date - 2020-08-04T14:32:52+05:30 IST

నగరంలోని ఓ మల్టీ చైన్‌ రెస్టారెంట్‌ అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. తమ శాఖలను నగరంలో విస్తరించబోతున్నట్లు లాక్‌డౌన్‌కు ముందు ఉత్సాహంగా ప్రకటించింది. కొవిడ్‌ తర్వాత ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి.

క్లౌడ్‌ కిచెన్‌.. రూటు మార్చిన బడా రెస్టారెంట్లు

కరోనా ప్రభావంతో సరికొత్త ప్రణాళికలు

హోమ్‌ డెలివరీ అవకాశాలవైపు చూస్తున్న ఔత్సాహికులు

సొంతంగా ఏర్పాట్లు చేస్తున్న ఫుడ్‌ డెలివరీ వేదికలు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఓ మల్టీ చైన్‌ రెస్టారెంట్‌ అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది. తమ శాఖలను నగరంలో విస్తరించబోతున్నట్లు లాక్‌డౌన్‌కు ముందు ఉత్సాహంగా ప్రకటించింది. కొవిడ్‌ తర్వాత ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. ఉన్న వాటినే నిర్వహించడం కష్టసాధ్యంగా మారడంతో కొన్ని శాఖలను తెరవలేదు. ఉన్న వాటిలోనూ కొన్ని చోట్ల సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ నుంచి పలు వంటకాలను తెచ్చి వడ్డిస్తున్నారు. ఇకపై తమ వ్యాపార ప్రణాళికలను సమీక్షిస్తున్నామని, కరోనా కాలంలో అతిథులు తమ వద్దకు రావడం కాకుండా తామే అతిథుల దగ్గరకు వెళ్లే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి పేరు వెల్లడించవద్దని చెప్పిన ఆ బడా సంస్థ చైన్‌ వర్క్‌ చేస్తున్న మోడల్‌... క్లౌడ్‌ కిచెన్‌. 


క్లౌడ్‌ కిచెన్‌... ఇప్పుడు రెస్టారెంట్‌, హోటల్‌ సర్కిల్స్‌లో అధికంగా వినిపిస్తున్న పదం. కొంత మంది డార్క్‌ కిచెన్‌, ఘోస్ట్‌ కిచెన్‌ అంటుంటే ఇంకొంత మంది వర్చువల్‌ కిచెన్స్‌, శాటిలైట్‌ కిచెన్స్‌ అని కూడా అంటున్నారు. పలికేది ఏ విధంగా ఉన్నా వీటన్నిటిలోనూ ఉండే ఒకే ఒక్క లక్షణం... డైన్‌ సదుపాయం లేకుండా డెలివరీ ఓన్లీ రెస్టారెంట్‌గా మెలగడమే. ప్రస్తుత కాలంలో వ్యాపారం కాపాడుకోవడానికి ఉన్న అవకాశంగా చాలా మంది దీన్ని భావిస్తున్నారు. అందుకే పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా ఇప్పుడు క్లౌడ్‌ కిచెన్‌ బాట పట్టాయి. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా 30శాతానికి పైగా రెస్టారెంట్లు శాశ్వతంగా మూతపడే అవకాశాలున్నాయని హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేస్తుంటే, నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అయితే దాదాపు 20 లక్షల మంది దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోతారని అంచనా వేస్తోంది. సుప్రసిద్ధ రెస్టారెంట్‌ చైన్స్‌ అయితే నిర్వహణ ఖర్చుల భారంతో వాటిని మూసి క్లౌడ్‌ కిచెన్‌ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తున్నామంటున్నాయి. 


కరోనా వేళ ఇదో అవకాశం

కొవిడ్‌-19 అందరికీ కష్టాలనే తీసుకువచ్చింది. హోటల్‌ రంగ పరిస్థితి మరీ దారుణం. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ హోటల్స్‌ తెరిచినా భోజన ప్రియులు అడుగు లోపలకు పెట్టడం లేదు. ఒకప్పుడు సీటు దొరకడమే కష్టమనుకున్న హోటల్స్‌ కూడా ఇప్పుడు అతిథి వస్తే చాలన్నట్లుగా ఎదురుచూస్తున్నాయి. పలు రెస్టారెంట్లు ఇప్పటికే మూత పడగా, కొన్ని రెస్టారెంట్లు మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి. ఈ రంగంలోనే కొందరు క్లౌడ్‌ కిచెన్‌ అవకాశాలనూ అందిపుచ్చుకుంటున్నారు. అంతేనా.. రాబోయేదంతా క్లౌడ్‌ కిచెన్‌ కాలమేనంటూ కూడా చెబుతున్నారు. పలు ఫుడ్‌ డెలివరీ యాప్‌లు కరోనాకు ముందే క్లౌడ్‌ కిచెన్‌లను ప్రారంభించి తమదైన వ్యాపారం ప్రారంభిస్తే, కరోనా వచ్చిన తర్వాత ఈ తరహా కిచెన్‌లను మరింతగా విస్తరించే అవకాశాలనూ అన్వేషిస్తున్నాయి. వాస్తవానికి క్లౌడ్‌ కిచెన్‌ లాక్‌డౌన్‌ తర్వాత వచ్చిన కొత్త నేపథ్యమేమీ కాదు. పలు ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ద్వారా గతంలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. స్విగ్గీ తమ స్విగ్గీ యాక్సెస్‌ ద్వారా జొమాటో సంస్థ తమ జొమాటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసెస్‌, ఓలా సంస్ధ ఓలా ఫుడ్స్‌ ద్వారా క్లౌడ్‌ కిచెన్‌ల ఏర్పాటు చేస్తున్నాయి. నగరంలో దాదాపు 15 క్లౌడ్‌ కిచెన్‌లు ఇప్పుడు ఉన్నాయని అంచనా. ఇవి గాక షట్టర్లు తీసుకుని ఫుడ్‌ డెలివరీ చేసేవారూ ఉన్నారు. ఇప్పుడు సుప్రసిద్ధ రెస్టారెంట్‌ చైన్స్‌ కూడా డైన్‌ ఇన్‌ ఔట్‌లెట్‌లకు బదులుగా క్లౌడ్‌ కిచెన్‌ ఔట్‌లెట్ల ప్రారంభానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తుండటమే విశేషం. రంగ్‌ దే బసంతి పేరిట నగరంలో రెస్టారెంట్‌ ప్రారంభించిన జింగ్‌ రెస్టారెంట్స్‌ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్‌లలో క్లౌడ్‌ కిచెన్‌లను నిర్వహిస్తోంది. ఇదే రీతిలో నగరంలోని పలు రెస్టారెంట్లు కూడా  క్లౌడ్‌ అవకాశాలను అన్వేషిస్తున్నాయి. వ్యాక్సిన్‌ వచ్చేవరకూ రెస్టారెంట్‌ వ్యాపారాలను ఆశించలేమని నగరంలోని ఓ సుప్రసిద్ధ చైన్‌ రెస్టారెంట్‌ డైరెక్టర్‌ (పేరు వెల్లడించవద్దన్నారు) వెల్లడిస్తూ ఇప్పటికిప్పుడు తాము క్లౌడ్‌ కిచెన్‌ వైపు వెళ్లే అవకాశం లేకపోయినా రాబోయే కాలంలో ఆ అవకాశాలను కాదనలేమన్నారు.


కొందరికి మోదం... మరికొందరికి ఖేదం...

హోటల్‌, రెస్టారెంట్‌ చైన్స్‌ ఇప్పుడు క్లౌడ్‌ కిచెన్‌ల వైపు చూడటానికి చాలా కారణాలే ఉన్నాయి.  కరోనా కాలంలో తాము మనుగడ సాగించాలని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న వారికి ఈ క్లౌడ్‌ కిచెన్‌లు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయన్నది ఈ రంగ నిపుణుల మాట. ఇదే విషయమై గత సంవత్సరారంభంలో జూబ్లీహిల్స్‌లో మల్టీక్యుసిన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించిన మణి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఎఫ్‌ అండ్‌ బీను రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది. మొదటిది ఫంక్షనల్‌ డైన్‌ ఇన్‌ అయితే రెండవది ఎక్స్‌పీరియెన్షల్‌ డైన్‌ ఇన్‌. ఫంక్షనల్‌ రెస్టారెంట్‌లలో అటు డైన్‌ ఇన్‌ ఉంటుంది. ఇటు డెలివరీ కూడా ఉంటుంది. ఎక్స్‌పీరియెన్షనల్‌ డైన్‌ఇన్స్‌లో కేవలం వచ్చి తినడమే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్‌పీరియెన్షల్‌ డైన్‌ ఇన్స్‌కు అవకాశం లేకుండా పోయింది. ఫంక్షనల్‌ డైన్‌ ఇన్‌ కూడా బాగుందని చెప్పలేని స్థితి..’’ అని అన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి రెస్టారెంట్‌ వ్యాపారం ఆరంభించి ప్రస్తుతం క్లౌడ్‌ కిచెన్‌ ఆలోచన చేస్తున్న నవీన్‌ చెబుతూ క్లౌడ్‌ కిచెన్‌తో మార్కెటింగ్‌ అవకాశాలు అధికంగా ఉంటాయని, పెట్టుబడి మహా అయితే ఓ 10 లక్షలు చాలని చెప్పారు. సిబ్బంది అవసరం పెద్దగా ఉండదని, మంచి చెఫ్స్‌  ఇద్దరుంటే చాలని అన్నారు. క్లౌడ్‌ కిచెన్‌ల వల్ల యజమానులు బాగుపడవచ్చేమో కానీ వర్కర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని ఈ రంగంలోని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది ఉపాధి కోల్పోయారని, ప్రతిభావంతులైన చెఫ్‌లకు మాత్రమే అవకాశాలుంటాయంటూనే ఈ తరహా వ్యాపారాల వల్ల ఫుడ్‌ డెలివరీ యాప్‌లు తప్ప బాగుపడేవారుండరంటున్నారు. 


భారీగా పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తున్నాం..

క్లౌడ్‌ కిచెన్‌ ఇప్పుడు ట్రెండ్‌ అయింది. మేం క్లౌడ్‌ కిచెన్‌ మోడల్‌ను 2018లో ప్రారంభించాం. రెస్టారెంట్లతో భాగస్వామ్యాలనూ చేసుకున్నాం. దేశంలోనే అతిపెద్ద క్లౌడ్‌ కిచెన్‌ నెట్‌వర్క్స్‌ సృష్టించడానికి పెట్టుబడులు పెడుతున్నాం. ఎందుకంటే భవిష్యత్‌ డెలివరీ ఆధారితంగా ఉంటుందని అంచనా. స్విగ్గీ యాక్సెస్‌ ద్వారా రెస్టారెంట్‌ భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. క్లౌడ్‌ కిచెన్‌ నెట్‌వర్క్‌తో రెస్టారెంట్‌ భాగస్వాములు తమ వ్యాపారాన్ని కొనసాగించడంలో మేము తోడ్పడుతున్నాం. ఈ సంవత్సరారంభంలో మేం బ్రాండ్‌ వర్క్స్‌ అంటూ నూతన కార్యక్రమం ప్రారంభించాం. ప్రస్తుత డైన్‌ ఇన్స్‌తోనే పలు రెస్టారెంట్లు లాభదాయకతను పొందేందుకు ఇవి తోడ్పడుతున్నాయి. 

-స్విగ్గీ అధికార ప్రతినిధి

Updated Date - 2020-08-04T14:32:52+05:30 IST