న్యూఢిల్లీ: రెస్టారెంట్లలో కస్టమర్లకు ఇచ్చే ఫుడ్ బిల్స్ (food bills)కు సర్వీస్ చార్జీలను చేర్చరాదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) శుక్రవారంనాడు అన్నారు. రెస్టారెంట్ యజమానులు తమ ఉద్యోగులకు ఎక్కువ జీతాలు చెల్లించాలనుకుంటే, ఫుడ్ మెనూ రేట్లు పెంచుకోవచ్చన్నారు. వాటిపై నియంత్రణ ఏమీ లేదన్నారు. సర్వీసు చార్జీలు తీసేస్తే తమకు నష్టాలు వస్తాయంటూ రెస్టారెంట్ యజమానులు చేస్తున్న వాదన సరికాదని మంత్రి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
అసోసియేషన్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ కన్యూమర్స్ ప్రతినిధులతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సమావేశమైంది. ఈ సమావేశానంతరం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. కస్టమర్లపై సర్వీస్ చార్జీలు రుద్దడం అనుచితమని, దీనికి కళ్లం వేయడానికి చట్టపరమైన విధివిధానాలను త్వరలోనే తెస్తామని పేర్కొంది. రెస్టారెంట్ల సర్వీసు చార్జీలపై అడిగిన ఒక ప్రశ్నకు పీయూష్ గోయెల్ సమాధానమిస్తూ ''మీరు (రెస్టారెంట్లు) బిల్లులో సర్వీసు చార్జీలు చేర్చరాదు. మీ ఉద్యోగులకు మరికొన్ని ప్రయోజనాలు చేకూర్చాలని అనుకుంటే మెనూ రేట్లు పెంచుకోండి" అన్నారు. ఆహార పదార్ధాల రేట్లు దాచిపెడితే, వాటి వాస్తవ ధర ఎంతో వినియోగదారులకు ఎలా తెలుస్తుంది? అని గోయెల్ ప్రశ్నించారు. రెస్టారెంట్లు బలవంతంగా తమపై సర్వీసు చార్జీలు రుద్దుతున్నాయంటూ వినియోగదారుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. సిబ్బంది అందించిన సేవలకు కస్టమర్లు తృప్తిపడితే టిప్స్ ఇస్తుంటారని, ఆ విధంగా వాళ్లు ఇచ్చుకోవచ్చని అన్నారు.