న్యూఢిల్లీ: భారతీయ సంప్రదాయంలో చీరకు చాలా ప్రాధాన్యం ఉంది. విదేశాల్లో చీరను ఎలా చూస్తారనే విషయం పక్కన పెడితే.. ఇండియాలో అయితే చీర పట్ల అమిత ఆదరణ ఉంటుంది. అలాంటిది చీర కట్టుకుందనే కారణంతో ఒక మహిళను రెస్టారెంట్లోకి రానివ్వలేదట. ఇదెక్కడో జరిగింది కాదు, స్వయానా మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన. జర్నలిస్ట్ అనిత చౌదరికి ఎదురైన ఈ చేదు అనుభవాన్ని తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ చిన్నపాటి వీడియోను కూడా ఫేస్బుక్లో షేర్ చేశారు.
ఢిల్లీలోని అక్విలా అనే రెస్టారెంట్‌కు తాను చీర కట్టుకుని అయితే అక్కడి సిబ్బందిలో ఒక మహిళ తనను లోపలికి అనుమతించలేదని ఆమె వెల్లడించారు. చెప్పేందుకు చాలా ప్రయత్నించానని, అయినా వాళ్లు వినలేదని, ‘స్మార్ట్ క్యాజువల్’ బట్టల్లోనే రావాలని చెప్పారని, చివరికి తనకు తప్పలేదని వాపోయారు. భారతీయ వస్త్రధారణ అయిన చీరలో కనిపిస్తే అమాయకుల్లా చూస్తారని అందుకే తాను చీరలో ఉంటే అనుమతించలేదని అనిత చౌదరి తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.