Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉక్కు ను పరిరక్షించే వరకు విశ్రమించం

ఢిల్లీ ధర్నాతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి

పోరాట కమిటీ నేతలు స్పష్టీకరణ


ఉక్కుటౌన్‌షిప్‌: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఈ నెల 2, 3 తేదీల్లో ఢిల్లీలో చేపట్టిన ధర్నాతోనైనా  కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని, లేకుంటే ఈ పోరాటాలను భవిష్యత్‌లో మరింత ఉధృతం చేస్తామని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని ప్రకటన వచ్చిన నాటి నుంచి అధికారులు, కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, ప్లాంట్‌లో వివిధ అసోసియేషన్‌లు కలిసి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడి పోరాటాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్లాంట్‌లో ప్రతి విభాగంలో ఇదే హాట్‌ టాపిక్‌గా నడుస్తున్నది. ఉక్కు ఉద్యమానికి జిల్లాలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ కార్మిక వర్గం మద్దతు తెలిపింది. అమృతరావు ఆమరణ నిరాహార పోరాట దీక్ష, 32 మంది ప్రాణత్యాగం, ఎంతోమంది పోరాటాల ఫలితంగా సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను నేడు ప్రైవేట్‌ వ్యక్తులకు కారుచౌకగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం దుర్మార్గమని, ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఇందుకు ఎంతటి పోరాటాలైనా చేస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేసింది.


కార్పొరేట్‌లకు కొమ్ము కాసేందుకే..: కేఎస్‌ఎన్‌ రావు, కో-కన్వీనర్‌,  పరిరక్షణ పోరాట కమిటీ

దేశంలో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్‌లకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తున్నది. ప్రైవేట్‌ రంగంతో దేశానికి అన్ని విధాల చేటు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రాణ త్యాగాలకు సిద్ధం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. 


అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు: జె.అయోధ్యరామ్‌, పోరాట కమిటీ కన్వీనర్‌

మా పోరాటాలకు రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఇప్పటికే పోరాటాలను ఉధృతం చేశాం. రాబోయే కాలంలో అన్ని వర్గాలను కలుపుకుని పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం. 


ప్రైవేటీకరణ నిర్ణయం దుర్మార్గం: గంధం వెంకటరావు, కో-కన్వీనర్‌

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న పరిశ్రమ. ఎంతో ఘన చరిత్ర కలిగిన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని చెప్పడం దుర్మార్గం. ప్రకటన వెలువడిన నాటి నుంచి ఉక్కు కార్మిక వర్గం తీవ్ర ఆందోళనతో ఉంది. ప్లాంట్‌ను  కాపాడుకునేందుకు పోరాటాలు చేస్తాం.  

Advertisement
Advertisement