స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-27T07:07:12+05:30 IST

స్పందనలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు.

స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ , అధికారులు

జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున 

మహారాణిపేట, సెప్టెంబరు 26: స్పందనలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 225 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందనలో ప్రధానంగా జీవీఎంసీకి చెందిన అర్జీలు అధికంగా వస్తున్నాయని  వివరించారు. ముఖ్యంగా వీధి లైట్లు, డైనేజీ నిర్వహణ, మంచినీటి కుళాయిలు, ట్రేడ్‌ లైసెన్స్‌లు తదితర అంశాలలో దరఖాస్తులు వస్తున్నట్టు తెలిపారు. సచివాలయం, మండల స్థాయిలో వినతులు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న గ్రీవెన్స్‌ను స్పందన పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ కేఎస్‌ విశ్వనాథన్‌, డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, ఆర్‌డీవో హుస్సేన్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు. 

వైసీపీ నాయకుడి భూ ఆక్రమణపై ఆందోళన

గాజువాకకు చెందిన వైసీపీ నాయకుడు తమ భూమికి సంబంధించి నకిలీ పట్టాలను సృష్టించి,  ఆ భూమిని వదిలి వెళ్లిపోవాలని తమను బెదిరిస్తున్నాడని   ముస్లిం కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. తొలుత కలెక్టరేట్‌ ఆవరణలో వారు ఆందోళన నిర్వహించారు. పెదగంట్యాడ మండలం ఇస్లాంపేట దరి కేఎన్‌ పాలెంకు చెందిన అబ్దుల్‌ సుబానీ ఆలీ 1969లో స్థానికంగా సుమారు 2 ఎకరాల 9 సెంట్లు భూమి కొనుగోలు చేసి అక్కడ ఇల్లు కట్టుకొని  వ్యవసాయం చేసుకుంటూ నివసించేవారు. అతని మరణానంతరం కుటుంబ సభ్యులు అక్కడే ఉంటున్నారు. ఈక్రమంలో గాజువాక ప్రాంతానికి  చెందిన వైసీపీ నాయకుడు సౌఖత్‌ ఆలీ, మరో వ్యక్తి రసూల్‌లు తమ భూమిని కబ్జా చేసేందుకు నకిలీ పట్టాలు సృష్టించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.  వారికి స్థానిక పోలీసులు అండగా ఉంటున్నారని, తమను కాపాడాలని కలెక్టర్‌కు విన్నవించారు. ఈమేరకు నగర పోలీస్‌ కమిషనర్‌కు కూడా వినతిపత్రం ఇచ్చామని బాధితులు పేర్కొన్నారు.


Updated Date - 2022-09-27T07:07:12+05:30 IST