బాధ్యత పెంచిన హరితహారం

ABN , First Publish Date - 2022-05-08T08:16:09+05:30 IST

జిల్లాలో గతానికి భిన్నంగా ఈసారి ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ సంస్కరణల వ్యూహం అమలు చేస్తున్నారు.

బాధ్యత పెంచిన హరితహారం

గతానికి భిన్నంగా ఈసారి మొక్కల పెంపకం 

మొక్కలపై సర్వైవల్‌ ఆడిట్‌ 

టెక్నికల్‌ గైడ్‌లు ఫారెస్ట్‌ ఆఫీసర్‌లు 

నీటి పారుదల శాఖకు అత్యధిక టార్గెట్‌ 

ప్రతీ మండలంలో ఐదు పల్లె ప్రకృతి వనాలు 

మూడు మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో ఓ మినీ పార్కు 

జిల్లాలో 44.21లక్షల మొక్కలు నాటడం టార్గెట్‌ 

నిర్మల్‌, మే 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గతానికి భిన్నంగా ఈసారి ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ సంస్కరణల వ్యూహం అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే మొక్కలు నాటే పనులతో పాటు పల్లెప్రకృతి వనాల సందర్శన, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను పరిశీలించేందుకు ఫారెస్ట్‌ ఆఫీసర్‌లను టెక్నికల్‌ గైడ్‌లుగా వినియోగించుకోబోతున్నారు. ఇప్పటి వరకు వివిధ శాఖల అధికారులు సరియైున అవగాహన లేక ఇష్టానుసారంగా మొక్కలు నాటడం, నాటిన ఆ మొక్కలు ఎండిపోవడం లాంటివి జరుగుతున్నాయి. వీటిపెంపకంపై అవగాహన లేకపోవడం సమస్యగా మారుతోంది. ఇక నుంచి అన్నిశాఖలు నిర్వహించే హరితహారం కార్యక్రమంలో ఫారెస్ట్‌ ఆఫీసర్‌లు కీలకపాత్ర నిర్వహించబోతున్నారు. వీరి సూచనలు, సలహాలతో పాటు వీరి తనిఖీలు సైతం ఉండబోతున్నాయి. అలాగే ప్రతిమండలంలో ఐదు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ప్రణాళికలు రూపొందించారు. దీంతో పాటు జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులో ఓ మినీ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వార్డు ప్రజలకు ఆహ్లదకరమైన వాతావరణాన్ని పంచే స్థలాలు లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కలెక్టర్‌ పరిగణలోకి తీసుకున్నారు. హరితహారం కార్యక్రమం ప్రారంభించే నాటికి స్థలాలను గుర్తించడమే కాకుండా మొక్కలు నాటేందుకు గుంతలు కూడా తీసి సిద్దంగా ఉంచ నున్నారు. గ్రామపంచాయతీ, అటవీశాఖ, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను అందుబాటులో ఉంచబోతున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఎవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లెప్రకృతి వనాలపై సర్వైవల్‌ ఆడిట్‌ చేయాలని కలెక్టర్‌ నిర్ణయించారు. మొత్తం నాటిన మొక్కల నుంచి బతికి ఉన్న మొక్క ల వివరాలతో పాటు ఎండిపోయిన మొక్కల వివరాలను కూడా ఈ ఆడిట్‌ ద్వారా తెలుసుకోనున్నారు. మొక్కలు ఎండిపోవడానికి కారణాలను సైతం ఈ సందర్భంగా గుర్తించబోతున్నారు. జిల్లాలో ఈ సారి 44.21 లక్షల మొక్కలను నాటేందు కోసం లక్ష్యంగా నిర్ణయించారు. సంబందిత అధికారులు మాత్రం గడువులోగానే మొక్కలను నాటాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాగా ఈ సారి నాటిన ప్రతిమొక్కను లెక్కించేందుకు జీయోట్యాగింగ్‌ను పకడ్భంధీగా అమలు చేయబోతున్నారు. ప్రతీ శాఖకు సంబంధించిన మండలస్థాయి అధికారులకు జియో ట్యాగింగ్‌ లాగిన్‌ను చేయనున్నారు. దీంతో నాటిన మొక్కల సంఖ్యతో పాటు ఎన్ని మొక్కలు బతికి ఉన్నాయనే వివరాలను సైతం అధికారులు తెలుసుకోనున్నారు. 

టెక్నికల్‌ గైడ్‌లుగా అటవీశాఖ అధికారులు

కాగా ఈ సారి అమలు చేయబోతున్న హరితహారంలో అటవీశాఖ అధికారులకు కీలక బాధ్యత్యలు అప్పజెప్పబోతున్నారు. ప్రతీశాఖకు టెక్నికల్‌ గైడ్‌లుగా ఈ ఆఫీసర్‌లు వ్యవహరించనున్నారు. వీరు మొక్కలు పెరిగే స్థలాల ఎంపిక, అలాగే నాటిన మొక్కలు ఎండిపోకుండా ఆయా శాఖల అధికారులకు సలహాలు అందిస్తారు. అలాగే నాటిన మొక్కల పర్యవేక్షణ ఎలా చేపట్టాలన్న అంశంపై సూచనలు అందిస్తారు. దీంతో పాటు హరితహారం కింద చేపడుతున్న పల్లెప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతివనాలు, నర్సరీలను కూడా అటవీశాఖ అధికారులు నిరంతరంగా తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలను జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరవేయనున్నారు. అధికారులు ప్రతీ పల్లె ప్రకృతివనం, నర్సరీల్లో తాము తనిఖీలు చేసినట్లు అక్కడి రిజిస్ర్టార్‌లో సంతకాలు చేయా ల్సి ఉంటుంది. 

మండల కేంద్రాలు, మున్సిపల్‌ వార్డులకు ప్రాధాన్యత

ఈ సారి ప్రతీ మండలంలో ఐదు పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆయా మండలాల్లో ప్రధాన గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి అక్కడ ఈ ప్రకృతివనాలను నిర్మించనున్నారు. దీంతో పాటు జిల్లాలోని నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపాలిటీల్లో గల వార్డుల్లో కూడా మినీ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీవార్డులో ఈ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. గతంలో కేవలం మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న యంత్రాంగం ఈ సారి పల్లెప్రకృతి వనాలు, మినీ పార్కుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న కారణంగా హరితహారం కొత్త పుంతలు తొక్కనుందంటున్నారు. 

మొక్కలపై సర్వైవల్‌ ఆడిట్‌

మొత్తం నాటిన మొక్కల వివరాలతో పాటు ఇందులో నుంచి ఎన్ని సజీవంగా ఉన్నాయి , ఎన్ని ఎండిపోయాయనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సర్వైవల్‌ ఆడిట్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. సంబందిత అధికారులు ఎప్పటికప్పుడు శాఖల వారిగా నాటిన మొక్కల వివరాలను తెలుసుకుంటూ వాటి స్థితి గతులను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఆయా శాఖల ఉన్నతాధికారులకే కాకుండా జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నారు. దీంతో ఈ విడతలో మొత్తం నాటిన మొక్కల నుంచి ఎన్ని సజీవంగా ఉన్నాయన్న వివరాలతో పాటు ఎన్ని ఎండిపోయాయన్న వివరాలు తెలిసిపోనుంది. ఈ వివరాల ఆధారంగా జిల్లా కలెక్టర్‌ సంబందిత శాఖలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడనుందంటున్నారు. ఎండిపోయిన మొక్కల విషయంలో సంబందిత శాఖలకు మొక్కల సంఖ్యను లెక్కగట్టి జరిమానాలుల కూడా విధించనున్నారంటున్నారు. 

Read more