‘స్వయం’గా విక్రయించండి

ABN , First Publish Date - 2020-04-07T11:32:53+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అన్నివర్గాల ప్రజలు ఉపాధికి దూరమయ్యారు.

‘స్వయం’గా విక్రయించండి

మహిళా సంఘాలకు అరటి అమ్మకాల బాధ్యత

ఆపద కాలంలో కష్టమంటున్న సభ్యులు

ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన

అటువంటిదేమీ లేదంటున్న అధికారులు


(సంతబొమ్మాళి/పలాస): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అన్నివర్గాల ప్రజలు ఉపాధికి దూరమయ్యారు. నిత్యావసరాల కొనుగోలుకే ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అరటి పండ్ల విక్రయాల బాధ్యతను అప్పగించారు అధికారులు. ఆపద కాలంలో ఎవరు కొనుగోలు చేస్తారని అడుగుతుంటే...తప్పకుండా విక్రయ బాధ్యతలు తీసుకోవాల్సిందేనంటూ అధికారులు తేల్చిచెబుతున్నారు. దీంతో ఏంచేయాలో తెలియక మహిళా సంఘాల సభ్యులు సతమతమవుతున్నారు.


రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అరటి విస్తారంగా పండింది. పంట చేతికందుతుందనగా లాక్‌డౌన్‌తో రవాణా, మార్కెట్‌ నిలిచిపోయింది. దీంతో రైతుల నుంచి వచ్చిన విన్నపం మేరకు  ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖ ద్వారా విక్రయానికి నిర్ణయించింది. మండలానికి టన్నుల ప్రాతిపదికన విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విక్రయ బాధ్యతలను వెలుగు శాఖకు అప్పగించింది. ఇప్పటికే అన్ని ఏఎంసీ కార్యాలయాలకు లారీల్లో అరటిగెలలు చేరుకున్నాయి. వీటిని గ్రామాలు, పట్టణాల్లో విక్రయించాలని స్వయం సహాయక సభ్యులను వెలుగు అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో అరటిపండ్లు రూ.60 పలుకుతుండగా..రూ.12కే విక్రయించాలని సూచించారు. ధర తక్కువగా ఉన్నా... కరోనా భయంతో పండ్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు.


దీంతో ఏంచేయాలో మహిళా సంఘాల సభ్యులకు పాలుపోవడం లేదు. అధికారులను అడిగితే లాక్‌డౌన్‌లో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారని..ఈ పరిస్థితుల్లో తక్కువ ధరకు పండ్లు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. అందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు బాధ్యత అప్పగించామని.. ఈ విషయంలో  ఎటువంటి ఒత్తిడి పెంచడం లేదని అంటున్నారు.


Updated Date - 2020-04-07T11:32:53+05:30 IST