ప్రత్యామ్నాయ బోధన వర్శిటీల బాధ్యత

ABN , First Publish Date - 2020-09-01T06:32:42+05:30 IST

దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు దాటినా, గుణాత్మక విద్య మాట అటుంచి కనీసం నూటికి నూరు శాతం అక్షరాస్యతను కూడ సాధించలేకపోయాం...

ప్రత్యామ్నాయ బోధన వర్శిటీల బాధ్యత

డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం ఆయా వర్సిటీలు ప్రత్యేక యాప్‌లను రూపొందించి వాటిని విద్యార్థులకు చేరే విధంగా చూడాలి. అందుకు యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ విభాగాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోని దూరవిద్యా కేంద్రాలు, డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని అత్యాధునికమైన స్టూడియోల్లో రికార్డింగ్ రూములు, ల్యాబ్‌లను వినియోగించి పాఠ్యాంశాలను సిడిలు, వీడియోలు ద్వారా విద్యార్థులకు చేరవేసే అవకాశాలను పరిశీలించాలి.


దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు దాటినా, గుణాత్మక విద్య మాట అటుంచి కనీసం నూటికి నూరు శాతం అక్షరాస్యతను కూడ సాధించలేకపోయాం. ఉన్నత విద్యను అభ్యసించే వయసు ఉన్న వారిలో కేవలం 10 శాతం మాత్రమే ఆ విద్యను పొందుతున్నారంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. దేశంలో ఆదివాసులు, గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతులు, మహిళలు అక్షరాస్యతలో, గుణాత్మక విద్యలో మరింత వెనకబడ్డారు. ఇప్పుడిప్పుడే ఈ వర్గాలు చదువుకోవడానికి ముందుకు వస్తున్న తరుణంలో కరోనా మహమ్మారి ప్రతిబంధకంగా తయారైంది. ప్రస్తుత కాలంలో తాత్కాలికంగానైనా విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండటానికి ఆన్‌లైన్ విద్య అవసరమే. దానికి అనుగుణమైనటువంటి ప్రత్యామ్నాయ విధానాలను యుద్ధ ప్రాతిపదికన రూపొందించుకోవాలి. దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, లింగ అసమానతలు, వివక్ష నేటికీ రాజ్యమేలుతున్నాయి. సురేష్ టెండూల్కర్ కమిటీ దేశంలో 37 శాతం ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్లు తేల్చింది. అయితే ఆన్‌లైన్ విద్య కంటే ముందుగా ఈ కింది అంశాల పట్ల ఆచరాణాత్మక దృష్టి సారించాలి. అవి ఇవి:


l గ్రామీణ, ఆదివాసి గిరిజన సముదాయాలు; నగర, పారిశ్రామిక బస్తీలు, మురికివాడల ప్రజా సముదాయాల్లో బాలబాలికలు కొన్ని దశాబ్దాల నుంచి చదువుకు దూరం కాగా ఇటీవలే మొదటి తరం చదువుకోడానికి పాఠశాలల వైపు, విశ్వవిద్యాలయాల వైపు అడుగులు వేస్తున్నారు. వీరి కుటుంబ నేపథ్యం చూస్తే 70 నుంచి 80 శాతం పైగా నిరక్షరాస్యులే. నేటికీ రెక్కాడితే గాని పొట్ట పోసుకోవడం కుదరని దుర్భరమైన దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి పిల్లలకు మొబైల్ 4జీ, స్మార్‌్టఫోన్లు, టాబ్లెట్స్, కంప్యూటర్స్, ఇయర్‌ఫోన్స్ తదితర గ్యాడ్జెట్స్ కొనే శక్తి ఎలా ఉంటుంది? ఒక కుటుంబంలో సగటున ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే రెండు సెట్ల గ్యాడ్జెట్స్ ఉండే పరిస్థితులను ఊహించగలమా? అప్పో సప్పో చేసి అతి కష్టం మీద గాడ్జెట్ ఒకటి కొనగలిగితే అమ్మాయికి లేదా అబ్బాయికి ఇద్దరిలో ఎవరికి ప్రాధాన్యం ఇస్తారు? భారత సంస్కృతిలో అంతర్లీనంగా కొన్ని శతాబ్దాల పాటు కర్మ సిద్ధాంతాన్ని ఆచరిస్తున్న ఈ వ్యవస్థలో జెండర్ వివక్ష ఉండదని చెప్పే సాహసం చేయగలమా?


l తరగతి గదుల్లో అధ్యాపకుడికి, విద్యార్థికి ముఖాముఖి సంబంధం ఉన్నప్పుడు విద్యార్థి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని, వ్యక్తిగత సృజనాత్మకతను, గ్రాహ్యశక్తిని అంచనా వేసి తర్ఫీదు, శిక్షణ లేక పునశ్చరణ చేయడానికి ఉపాధ్యాయుడికి అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ విద్యలో క్లాసులు జరుగుతున్నప్పుడు విద్యార్థి దృష్టిని బోధన పాఠ్యాంశాల అవగాహన వైపు మరల్చడం సాధ్యం కాదు గదా!? అలాంటప్పుడు విలువ ఆధారిత, గుణాత్మక విద్యను అందించగలమా?


l చదువుకున్న సంపన్న వర్గాలు లేదా మధ్యతరగతి వర్గాలు లేదా విశ్రాంతి వర్గాల గృహిణి సహజంగా విద్యావంతురాలై ఉంటుంది. ఆన్‌లైన్ విద్యాబోధనలో తల్లి పిల్లలను పర్యవేక్షిస్తుంది. వారి body language, mannerism, గ్రాహ్యశక్తి, అవగాహన, ఏకాగ్రతలను అంచనా వేస్తుంది. అవసరమైతే వారి ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలను ఇవ్వగలుగుతుంది. కనీస అక్షరజ్ఞానం లేని ఆదిమ గిరిజన, దళిత, బడుగు మహిళలు వారి పిల్లలకు బోధన, శిక్షణలో సహకారాన్ని ఎలా ఊహించగలం? భార్యాభర్తలు పని చేయకుండా పూటగడవని ఈ రోజుల్లో భర్తకు చేదోడు వాదోడుగా భార్య కూడా కూలీనాలీ చేసి కుటుంబ పోషణకు సహాయపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ వర్గాల మహిళలు పిల్లల చదువుల కోసం కూలి పని మానుకోలేరు, మానుకుంటే పిల్లలు పస్తులు ఉండాలి. పస్తులు ఉంటే బతకలేరు. చదువు లేకుంటే బతకవచ్చు, మా తండ్రులు, తాతలు, ముత్తాతలు అక్షరగంధం లేకుండా బతుకును వెళ్లదీశారు అని సర్దుకుపోవాలా!?


l ప్రత్యక్షంగా ఆన్‌లైన్ విద్యాబోధనలో ఉపాధ్యాయుడితో సంబంధం లేకుండా చదువుకు పునాదులను ఎక్కడ నుంచి వెతుక్కోవాలి? కరోనా మహమ్మారి మూలంగా ఆన్‌లైన్ విద్య అవసరం అనివార్యం కూడా అని అనుకుందాం. ఈ వర్గాల పిల్లలు చదువుకు దూరమై Dropouts గా మారే అవకాశం అధికం. ఈ తరాన్ని గాలికి వదిలేసి రాబోయే తరం విద్యావంతులుగా మార్చుకుందామని ఆశిద్దామా? చదువు ఈ వర్గాల నుదుట రాసి లేదని కర్మ సిద్ధాంతానికి వదిలేద్దామా? 74 వసంతాలు గడిచినా స్వతంత్ర భారతదేశంలో చదువులు ఎండమావులేనా? విద్య ఒక మిథ్యేనా!


l విద్యారంగం ఉమ్మడి జాబితాలోని అంశమే అయినప్పటికీ రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యాసంస్థలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమనే కనబరుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎస్సి, ఎయిమ్స్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల లాంటి విద్యాలయాల్లో భారీగా వనరుల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో వసతుల కల్పనపై, వనరుల కేటాయింపు పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఈ వివక్షా వైఖరిని కేంద్రం విడనాడాలి. అప్పుడే క్షేత్రస్థాయి లోని అవసరాలకు అనుగుణంగా బోధన, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలు కొనసాగుతాయి. 


l ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ తక్కువ మంది విద్యార్థులు ఉండేలా కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యాబోధన చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. అందుకు యూనివర్సిటీలు మెంటర్లుగా వ్యవహరించాలి. ప్రతి గ్రామంలోనూ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తించి వారితో పాఠాలు బోధించేలా చర్యలు చేపట్టాలి. దీనిని ఈ సంవత్సరానికి గాను ఆయా యూనివర్సిటీ విద్యార్థులకు వారి ప్రాజెక్టు వర్క్‌లో భాగం చేయాలి. మరోవైపు డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం ఆయా వర్సిటీలు ప్రత్యేక యాప్‌లను రూపొందించి వాటిని విద్యార్థులకు చేరే విధంగా చూడాలి. అందుకు యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ విభాగాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోని దూరవిద్యా కేంద్రాలు, డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని అత్యాధునికమైన స్టూడియోల్లో రికార్డింగ్ రూములు, ల్యాబ్‌లను వినియోగించి పాఠ్యాంశాలను సిడిలు, వీడియోలు ద్వారా విద్యార్థులకు చేరవేసే అవకాశాలను పరిశీలించాలి. వనరులు లేని చోట కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్లలో వనరులు ఏర్పాటు చేయడం వల్ల భౌతికదూరం పాటిస్తూనే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఆన్‌లైన్ విద్యను అందించగలుగుతాం. ఇందులో విశ్వవిద్యాలయాలు గురుతరమైన పాత్రను పోషించాలి.


కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాలో ఆదివాసులు, గిరిజనులు, దళితులు, బడుగులు సంఖ్యాపరంగా ప్రాబల్య వర్గాలు. ఆదివాసులు దట్టమైన అడవుల్లో, కొండల్లో, కోనల్లో, వాగువంకల్లో జీవిస్తారు. ఈ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు అంతంత మాత్రమే. నిరంతరంగా నాణ్యమైన సౌకర్యాన్ని ఊహించలేం. ఇంటర్నెట్ కోసం, గాడ్జెట్స్ కోసం వ్యయం చేసే ఆర్థిక స్తోమత వారికి లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో వర్షాకాలంలో సహజంగా సంభవించే అంటువ్యాధులు, డయోరియా, ఫ్లూ జ్వరాలు ఒకవైపు, ఇంకోవైపు దానికి తోడు కొవిడ్–19 వ్యాప్తి. ఈ రెండూ కలిసి Syndemicగా మారే ప్రమాదాలతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చదువులు ఎలా కొనసాగుతాయి అనేది అసలు ప్రశ్న. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్షలు సైతం ఎలా రాయగలుగుతారు? జాతీయ స్థాయిలోని ఎంట్రెన్స్ టెస్ట్‌లు, JEE, NEET లాంటి కేంద్ర పరిధిలోని అత్యున్నత విద్యాప్రమాణాలు కలిగిన పోటీపరీక్షలు ఇప్పుడు నిర్వహించడం వల్లకొండలు, అడవులు, రవాణా సౌకర్యాలు లేని ఏజెన్సీ గ్రామీణ ప్రాంత వర్గాల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతున్నది. ఇది కేవలం కాకతీయ వర్సిటీ సమస్యే కాదు. అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్‌తో పాటు వెనుకబడిన ఒడిషా, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. 


ఈ పరిస్థితుల రీత్యా పాఠశాల విద్య, ఉన్నత విద్యకు సంబంధించి బోధన ఆన్‌లైన్‌లో గుణాత్మక విద్య విషయాన్ని అటుంచి కనీసం, విద్యా బోధనను అందించడంలో కూడ విఫలమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల అమెరికాలో పాఠశాలలు ప్రారంభమైన జులై 16 నుంచి, జులై 30 వరకు 15 రోజుల వ్యవధిలో 97,078 మంది విద్యార్థులు కొవిడ్–‌-19 బారిన పడ్డట్లు “The American Academy of Pediatrics and Children’s Hospital Association” నివేదిక ఇచ్చింది. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆన్‌లైన్ విద్యే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతం ఆన్‌లైన్ విద్య వల్ల పేద వర్గాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా, droupouts గా మారకుండా చూడవలసిన బాధ్యత విశ్వవిద్యాలయాల పైన ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులలో క్షేత్రస్థాయిలో అనుభవమున్న వివిధ స్థాయి లలోని అధ్యాపకులు, విద్యాధికారులు, సాంకేతిక నిపుణులు, సామాజిక కార్యకర్తలు, పరిశోధక విద్యార్థులు, జాతీయ సామాజిక సేవా కార్యకర్తలు సమన్వయంతో ఒక ప్రత్యామ్నాయ నమూనాను తక్షణమే రూపొందించి తగిన మార్గదర్శకాలను, సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న ఈ కాలంలో విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా నిరంతరం ప్రత్యామ్నాయ మార్గాలను రాష్ట్రం అన్వేషిస్తూనే ఉంది. ఆన్‌లైన్ విద్యావిధానం ద్వారా దూరదర్శన్, టీ- శాట్ వంటి ఛానెళ్లలో తరగతుల బోధనకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే ఇందుకోసం మరిన్ని ఛానళ్లు అవసరం అవుతాయి. జీ-నెట్ వర్క్, సన్ నెట్‌వర్క్ వంటి బడా సంస్థలను ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ కింద ఇలాంటి బోధనా ప్రణాళికల్లో భాగస్వాముల్ని చేయాలి. ఇది విద్యార్థులకే కాదు ప్రభుత్వాలకు, పౌర సమాజానికి పరీక్షా సమయం. ఇందులో యూనివర్సిటీలు పెద్దన్న పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. కొన్ని దశాబ్దాలుగా ప్రతిష్ఠ మసకబారుతున్న విశ్వవిద్యాలయాలు కరోనా విపత్తులో కాలాన్ని సానుకూలంగా మలచుకొని తమ మీదున్న అపప్రథను పోగొట్టుకోవడానికి తమ సామాజిక బాధ్యతను గుర్తించి వ్యవహరించినప్పుడే పూర్వపు ఔన్నత్యాన్ని కాపాడుగలుగుతాయి.


ప్రొఫెసర్ తాటికొండ రమేష్

డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సస్, కాకతీయ యూనివర్సిటీ

Updated Date - 2020-09-01T06:32:42+05:30 IST