స్పందన అర్జీలను త్వరగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-06-28T06:18:42+05:30 IST

స్పందన అర్జీలను త్వరగా పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

స్పందన అర్జీలను త్వరగా పరిష్కరించాలి
బాధితుల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న జేసీ

జాయింట్‌ కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి

కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 27: స్పందన అర్జీలను త్వరగా పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా జేసీ రాంసుందర్‌ రెడ్డి మాట్లాడుతూ వివిధ శాఖలకు సంబంధించిన 19 అర్జీలు రీఓపెన్‌ అయ్యాయని, వాటిలో రెవెన్యూకు సంబంధించి 7, పంచాయతీరాజ్‌ 4, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 2, వ్యవసాయశాఖ 2, సచివాలయాలవి 1, రూరల్‌ డెవపల్‌మెంట్‌ 1, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టుకు 1, హార్టికల్చర్‌ 1, రీఓపెన్‌ అయ్యాయన్నారు. జూన్‌లో మొత్తం 110 రీఎపెన్‌ అయ్యాయని, వీటి లో అత్యధికంగా వ్యవసాయశాఖకు సంబంధించి 38 రీఓపెన్‌ అయినట్లు తెలిపారు. ఏపీ సర్వీసె్‌సకు సంబంధించి బీయాండ్‌ ఎస్‌ఎల్‌ఏ 15 అర్జీలు ఉన్నాయనీ వాటిలో రెవెన్యూకి సంబంధించి 9 ఉన్నాయన్నారు. కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించి 6 ఉన్నాయన్నారు. ఒక్క సర్వీసు అందించని సచివాలయాలు 32 ఉన్నాయని, సర్వీసులు అందించని సచివాలయ సిబ్బందికిషోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోలను జేసీ ఆదేశించారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబెషన్‌ డిక్లరేషన్‌ అప్రూవల్‌ కోసం  కలెక్టర్‌కు ఫైల్స్‌ను రేపటిలోగా పంపించాలని అధికారులను ఆదేశించారు. జేసీతోపాటు డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశులు, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, సీపీవో అప్పలకొండ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


స్పందన వినతులు: దేవనకొండ మండలం జిలబుడకల గ్రామానికి చెందిన మాదిగ పెద్దక్క సర్వే.నెం.278లో 5.80 ఎకరాలు ఉన్న పొలం ఉందని, మాకు తెలియకుండా వేరే వ్యక్తులు అన్యాయంగా పొలాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నారని జేసీకి వినతిపత్రం సమర్పించారు. నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన ఎం.నరసన్న సర్వే నెంబర్‌. 932/సీలో గల 4.10 ఎకరాల ఉన్న పొలాన్ని దాదాపు 45 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ జీవనం చేస్తున్నానన్నారు. ఈ భూమికి సంబంధించి పట్టా పాసు పుస్తకం కూడా ఉందని, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లేదన్నారు. తమకు న్యాయం చేసి ఆన్‌లైన్‌లో ఎక్కించాలని కోరారు. ఆస్పరి మండలం కారుమంచి గ్రామ వాసి రైతు ఏ.ప్రభాకర్‌ రెడ్డి బనవూరు గ్రామంలో 18 ఎకరాల పొలం  ఉందని, ఇటీవల ఇచ్చిన క్రాఫ్‌ ఇన్సూరెన్స్‌ తనకు రాలేదని, దీనికి సంబంధించి అధికారులను విచారించి క్రాఫ్‌ ఇన్సూరెన్స్‌ మంజూరు చేయాలని కోరారు.

కార్పొరేషన్‌లో..

కర్నూలు(న్యూసిటీ): స్పందన అర్జీలపై నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తక్షణమే పరిష్కరించాలని కమిషనర్‌ ఏ.భార్గవతేజ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాలులో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జొహరాపురంలోని తమ లేఅవుట్‌లో ఆక్రమణ జరిగిందని సర్వే చేయించాలని సోమన్న ఫిర్యాదు చేశారు. అశోక్‌నగర్‌లోని పార్కుల్లో పందులు ఎక్కువగా ఉన్నాయని, వాటి వలన ప్రజలకు ఇబ్బందిగా ఉందని సమస్యను పరిష్కరించాలని స్థానికుడు చిన్నరత్నం కోరారు. అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌, ఎస్‌ఈ సురేంద్రబాబు, డిప్యూటీ సిటిప్లానర్‌ కోటయ్య, మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ భాస్కర్‌రెడ్డి, మేనేజర్‌ చిన్నరాముడు, రెవెన్యూ ఆఫీసర్‌ జునైద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:18:42+05:30 IST