స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-24T05:27:09+05:30 IST

స్పందనలో వచ్చిన అర్జీలను సహేతుకంగా పరిష్కరించాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులు ఆయా అర్జీలను పరిశీలించి విచారణ నివేదికను, ఫొటో గ్రాఫ్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు.

స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
స్పందనలో అర్జీదారుల సమస్యలపై మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

- కలెక్టర్‌ దినే్‌షకుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 23 : స్పందనలో వచ్చిన అర్జీలను సహేతుకంగా పరిష్కరించాలని కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులు ఆయా అర్జీలను పరిశీలించి విచారణ నివేదికను, ఫొటో గ్రాఫ్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా యాదృచ్ఛికంగా ఐదు దరఖాస్తులను ఎంపిక చేసుకొని కింది స్థాయి అధికారులు వాటిని పరిష్కరించిన తీరును పరిశీలించాలన్నారు. అంతకు ముందు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ ద్వారా పలుప్రాంతాలకు చెందిన ప్రజలు పలు రకాల సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో పులి శ్రీనివాసులు, స్పెషల్‌ కలెక్టర్లు సరళావందనం, గ్లోరియా తదితరులు ఉన్నారు.

 విద్యుత్‌తీగలు తగిలి రెండు పాడి గెదేలు చనిపోయాయని, జీవనోపాధి కోల్పోయిన తనకు పరిహారం ఇచ్చేలా చూడాలని కంభం మండలం తురిమెళ్లకు చెందిన సుబ్బారాయుడు  కోరారు. ఈ విషయాన్ని విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని అవేదన వ్యక్తంచేశారు.

 22  ఏళ్ల క్రితం ఇచ్చిన లే అవుట్‌లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యుత్‌ లైన్లు లేవని కనిగిరి బీసీ కాలనీకి చెందిన రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. అనేక సంవత్సరాల నుంచి విద్యుత్‌ లైన్లు వేయాలని అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాలనీకి విద్యుత్‌ సౌకర్యం కల్పించి అదుకోవాలని విన్నవించారు.

 తనకుఉన్న భూమిని ఇతరులకు ఆన్‌లైన్‌ చేశారని పెద్దారవీడుకు చెందిన షేక్‌ నజీర్‌ అబ్దుల్‌ ఫిర్యాదు చేశారు. 66/3 సర్వేనెంబరులో 1.90 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని ఇతరుల పేర్లతో ఆన్‌లైన్‌ చేశారన్నారు. ఈ విషయాన్ని అనేక పర్యాయాలు అధికారులను కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. ఇలా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు రకాల సమస్యలను ఇటు స్పందన, అటు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో ఫిర్యాదులు చేశారు. 


ప్రజా ఫిర్యాదులపై అలసత్యం వద్దు

 ఒంగోలు(క్రైం), : స్పందనలో వచ్చిన ఫిర్యాదులపై అలసత్యం వహించవద్దని ఎస్పీ మలికగర్గ్‌ అధికారులను హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీసు మైదానంలోని గెలాక్సీ భవన్‌లో పోలీసు స్పందన కార్యక్రమం జరిగింది. ఎస్పీ మలికగర్గ్‌ స్వయంగా పాల్గొని ఫిర్యాదిదారుల బాధలను విన్నారు. 72 మంది తమ వినతులను ఎస్పీకి అందజేసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులపై సత్యరం స్పందించి పరిష్కరించాలని కోరారు. పోలీసు స్టేషన్‌ల వారీగా ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ బి.మరియదాసు, డీటీసీ డీఎస్పీ జి.రామకృష్ణ, ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లిఖార్జునరావు, ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావు, లీగల్‌ అడ్వైజర్‌ వేణుగోపాల్‌, ప్యానల్‌ అడ్వకేట్‌ బీవీ .శివరామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.

 

Updated Date - 2022-05-24T05:27:09+05:30 IST